Home Loan: సుదీర్ఘ రుణం..పెంచేను వడ్డీ భారం

ఇంటి రుణంపై ఈఎంఐలను..స్వల్ప, దీర్ఘ కాలాలకు ఎంచుకుంటే చెల్లించే వడ్డీ మొత్తం ఎంత అవుతుంది అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు.

Published : 03 Jul 2023 17:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఇంటి నిర్మాణానికి లేదా కొనుగోలుకు అధిక పెట్టుబడి అవసరమనే సంగతి తెలిసిందే. కాబట్టి చాలామంది ఇంటి కొనుగోలు రుణాలకు బ్యాంకులను ఆశ్రయిస్తారు. రుణగ్రహీత అర్హతలను బట్టి బ్యాంకులు రుణంపై ఈఎంఐ కాలవ్యవధిని నిర్ణయిస్తాయి. అయితే, రుణగ్రహీతలు స్వల్పకాలానికి రుణాన్ని చెల్లించేవిధంగా ఆప్షన్‌ తీసుకుంటే ఈఎంఐ పెరుగుతుంది. దీర్ఘకాలానికి చెల్లించేవిధంగా రుణం తీసుకుంటే ఈఎంఐ తగ్గుతుంది. కానీ దీర్ఘకాల ఈఎంఐలు ఎంచుకుంటే.. రుణానికి చెల్లించే వడ్డీ బాగా పెరిగిపోతుంది.

సాధారణంగా రుణాలు గరిష్ఠంగా 30 ఏళ్లకు బ్యాంకులు ఇస్తాయి. దాన్ని 40 ఏళ్లకు పెంచుతున్నట్లు ఇటీవల బజాజ్‌ ఫైనాన్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది. దరఖాస్తు సమయంలో వయసుకు లోబడి కాలవ్యవధిని నిర్ణయిస్తామని పేర్కొంది. ఇందుకోసం గృహ రుణం కోసం కనీస, గరిష్ఠ వయసులను 23-75 సంవత్సరాలుగా నిర్ణయించింది. లోన్‌ మెచ్యూరిటీ సమయంలో రుణగ్రహీత గరిష్ఠ వయసు 75 సంవత్సరాలు. అంటే 23-35 సంవత్సరాల వయసు గల వ్యక్తులు మాత్రమే 40 సంవత్సరాల రుణ కాలవ్యవధిని పొందగలరు. 45 ఏళ్ల వ్యక్తికి, రుణం తీర్చే గరిష్ఠ కాలవ్యవధి 30 సంవత్సరాలు ఉంటుంది. ఈ రుణాలపై వడ్డీ రేట్లు 8.5% నుంచి ప్రారంభమవుతాయి.

సుదీర్ఘ కాలవ్యవధి.. ఈఎంఐ మొత్తాన్ని తగ్గించడంలో మీకు సహాయపడినప్పటికీ ఇంత సుదీర్ఘమైన కాలవ్యవధి మంచిదా? కాదా? అని మీరు కూడా నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు 8.5% వడ్డీ రేటుతో 30 ఏళ్ల ఇంటి రుణంతో పోల్చుకుంటే.. 40 ఏళ్ల కాలవ్యవధితో కూడిన ఇంటి రుణ ఈఎంఐ రూ.లక్షకు 5% తక్కువగా ఉంటుంది. ఎక్కువ కాలవ్యవధితో కూడిన రుణం నెలవారీ ఈఎంఐ భారాన్ని తగ్గిస్తుంది. ఈఎంఐ విషయంలో ఊరటలా కనిపించినా.. ఈ ఆప్షన్‌లో అధిక వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. ఇది రుణానికి సంబంధించిన మొత్తం వ్యయాన్ని గణనీయంగా పెంచుతుంది.

ఈ పట్టికలో తక్కువ కాలవ్యవధికి ఈఎంఐ పెరిగినా.. చెల్లించే మొత్తం వడ్డీ చాలా వరకు తగ్గుతుంది. అదే ఈఎంఐ కాలవ్యవధిని సుదీర్ఘ కాలానికి ఎంచుకుంటే.. వడ్డీ మొత్తం ఎంత పెరుగుతుందనేది ఇక్కడ చూడొచ్చు. 40 ఏళ్ల ఇంటి రుణం కోసం చెల్లించే వడ్డీ.. 30 ఏళ్ల రుణం కోసం చెల్లించే వడ్డీ కంటే 42.5% ఎక్కువ. 15, 20, 25 సంవత్సరాల రుణం కోసం వెళ్లడం అనేది రుణ గ్రహీతకు సంబంధించిన ఆదాయం, ఖర్చులు, ఈఎంఐ స్థోమతపై ఆధారపడి ఉంటుంది.  30 ఏళ్లు, 40 ఏళ్ల రుణానికి సంబంధించి ఈఎంఐలో నెలకు కేవలం రూ.1,765 వ్యత్యాసం ఉంటుంది. అలాగని 40 ఏళ్ల కాలవ్యవధికి రుణాన్ని ఎంచుకుని రూ.38 లక్షలు ఎక్కువ వడ్డీ చెల్లించడం ఎంత మాత్రం సమంజసం కాదు. కాబట్టి 30 ఏళ్ల  కాలపరిమితికే రుణాన్ని తీసుకోవడం మంచిదని బ్యాంకింగ్‌ నిపుణులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని