Gautam Adani: నా మనవరాళ్లు విశాల ప్రపంచాన్ని చూడాలి

Eenadu icon
By Business News Desk Published : 09 Mar 2025 02:37 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

లింగ సమానత్వం అవకాశం కాదు..అవసరం
గౌతమ్‌ అదానీ భావోద్వేగ పోస్టు

దిల్లీ: ‘లింగ సమానత్వం అనేది కేవలం మహిళలకు అవకాశం కల్పించడం కాదు. ఇది మానవ మనుగడకు ఎంతో అవసరం’ అని అదానీ గ్రూపు ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన సామాజిక వేదిక లింక్డ్‌ఇన్‌లో ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. తన ముగ్గురు మనవరాళ్ల భవిష్యత్తు గురించి ఆయన మాట్లాడుతూ.. వారు గాజు గదుల్లోనుంచి కాకుండా తెరిచిన తలుపుల నుంచి విశాల ప్రపంచాన్ని చూడాలని ఆంకాక్షించారు. ‘నా మనవరాళ్లు బోర్డు రూములకు వెళ్లినప్పుడు అక్కడ వారొక్కరే మహిళగా ఉండకూడదు. వారు తమ స్థానం కోసం పోరాడాల్సిన అవసరం రాకూడదు’ అని పేర్కొన్నారు. 

బనస్కాంత(గుజరాత్‌)లోని తన బాల్యం నుంచి నేటి బోర్డు రూముల వరకూ తన జీవితాన్ని మలిచిన మహిళల గురించి అదానీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తన తల్లి, భార్య ప్రీతి అదానీ జీవితంలో మహిళల ప్రాధాన్యం తెలియజేశారని పేర్కొన్నారు. తన తల్లి కష్టాలను అవకాశాలుగా మార్చారని, అదానీ ఫౌండేషన్‌ ద్వారా లక్షలాది మంది జీవితాల్లో ప్రీతి వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు. అదానీ గ్రూపు సంస్థల్లో మహిళలు అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని, సాంకేతిక బృందాల నుంచి పునరుత్పాదక శక్తి ప్రాజెక్టుల వరకూ మహిళలు తమ సత్తా చాటుతున్నారని ఆయన తెలిపారు.

‘కొన్నేళ్ల క్రితం ఒక పోర్టును సందర్శించాను. అక్కడ మహిళలు లేకపోవడం గమనించాను. సరైన అవకాశాలు లేకపోవడం వల్లే వారు దూరంగా ఉన్నారని అర్థమైంది. అప్పటి నుంచి మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాను’ అని వివరించారు. ‘లక్షాధికారి దీదీలు’ వంటి కార్యక్రమాల ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారని ఆయన తెలిపారు. మహిళల ప్రతిభకు హద్దులు లేవని, వారికి సమాన అవకాశాలు కల్పిస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని