Home Loan: ఇంటి ఒరిజినల్‌ సేల్‌ డీడ్‌ బ్యాంకులో పోతే ఏంచేయాలి?

ఇంటి రుణ బకాయిలను పూర్తిగా తీర్చివేసిన తర్వాత ఇతర పత్రాలతో సహా ఒరిజినల్‌ సేల్‌ డీడ్‌ను బ్యాంకు తిరిగి రుణగ్రహీతకు ఇచ్చేయాలి. దీన్ని కోల్పోతే ఎం జరుగుతుందో ఇక్కడ చూడండి.

Published : 08 Sep 2023 18:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలా మంది బ్యాంకు ద్వారా రుణం తీసుకుని ఇంటిని కొనుగోలు చేస్తారు. ఇలా ఇంటిని కొనుగోలు చేసినవారు చాలా పత్రాలను బ్యాంకులకు సమర్పించవలసి ఉంటుంది. ఇందులో ఇంటికి సంబంధించిన ఒరిజినల్‌ సేల్‌ డీడ్‌ కూడా ఉంటుంది. ఇంటి రుణ బకాయిలు పూర్తిగా చెల్లించిన తర్వాత బ్యాంకు రుణగ్రహీతలకు దీన్ని తిరిగి ఇచ్చేస్తుంది. సేల్‌ డీడ్‌ అనేది ఆస్తి యజమాన్యాన్ని తెలిపే విలువైన పత్రం. ఇది ఇంటికి సంబంధించి చట్టపరమైన పత్రం కూడా. ఇంటి కొనుగోలుదారులు.. తమ యాజమాన్యాన్ని నిరూపించుకోవడానికి, ఆస్తి లావాదేవీలను నిర్వహించడానికి వారి వద్ద అసలు సేల్‌ డీడ్‌ను కలిగి ఉండడం చాలా అవసరం.

బ్యాంకు బాధ్యత..

రుణగ్రహీత ఇంటి రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించినప్పుడు బ్యాంకులు ‘నో డ్యూ సర్టిఫికెట్‌’తో పాటు సేల్‌ డీడ్‌ను కూడా తిరిగి ఇచ్చేస్తాయి. కొన్నిసార్లు అసలు సేల్‌ డీడ్‌ను రుణగ్రహీతకు ఇవ్వని సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, సేల్‌ డీడ్‌ బ్యాంకు వారు పోగొట్టినా, ఉద్దేశపూర్వకంగా ఇవ్వకపోయినా.. రుణగ్రహీతలు తీసుకోవలసిన కొన్ని చట్టపరమైన పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. భారతీయ కాంట్రాక్ట్‌ చట్టంలోని సెక్షన్‌ 171 ప్రకారం.. ఏదైనా ఇతర లావాదేవీలకు సంబంధించి బకాయిలను దీనికి ముడిపెడుతూ, టైటిల్‌/సేల్‌ డీడ్‌లను బ్యాంకు తమ వద్ద భద్రపరచుకోవడానికి ఏ విధమైన హక్కు లేదని చట్టం చెబుతోంది. రుణగ్రహీత ఇంటి రుణ బకాయిలను పూర్తిగా తీర్చివేయగానే హోమ్‌ లోన్‌ నో డ్యూ సర్జిఫికేట్‌తో పాటు, డిపాజిట్‌ చేసిన అన్ని పత్రాలను తిరిగి ఇచ్చేయాలి. ఇటువంటి కేసులను పరిశీలించిన కోర్టులు కూడా దీన్ని బ్యాంకుల సేవా లోపంగా పరిగణిస్తున్నాయి. ఆస్తి బదిలీ చట్టంలోని సెక్షన్‌ 60 ప్రకారం చెల్లించాల్సిన మొత్తం బకాయిలను ఇచ్చేసిన తర్వాత టైటిట్‌ డీడ్‌ ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకుదే. 

సేల్‌ డీడ్‌ ఎలా మిస్సవుతుంది?

ఇంటి రుణాలు 10-30 ఏళ్ల సుదీర్ఘకాల వ్యవధిని కలిగి ఉంటాయి. ఈ డాక్యుమెంట్‌లు బ్యాంకు సెంట్రల్‌ రిపోజిటరీకి పంపుతారు. ఇవి ఎక్కువుగా వారి ప్రధాన కార్యాలయం ఉన్న ప్రదేశాలలో ఉంటాయి. చాలా బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు, సెంట్రల్‌ రిపోజిటరీలు ముంబయిలో ఉన్నాయి. ఎక్కువగా వీటి నిర్వహణ థర్డ్‌ పార్టీ చూస్తుంటుంది. ఈ పత్రాలను పంపడానికి, వాటిని సురక్షితంగా ఉంచడానికి మానవ జోక్యం అవసరం. కాబట్టి, ఎక్కడైనా పొరపాటు జరిగే అవకాశం ఉంది. సుదీర్ఘ కాలవ్యవధిలో వాటి స్థానం మారొచ్చు. 

రుణగ్రహీత ఏం చేయాలి?

రుణం పూర్తిగా తిరిగి చెల్లించిన తర్వాత కూడా బ్యాంకు అసలు సేల్‌ డీడ్‌ను తిరిగి ఇవ్వడంలో విఫలమైతే, రుణగ్రహీత 'బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌'కు ఫిర్యాదు చేయొచ్చు. అంబుడ్స్‌మన్‌ వినియోగదారుల ఫిర్యాదుల విషయంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తారు. ఒకవేళ ఈ సమస్యను పరిష్కరించడంలో వారు సహాయం చేయలేకపోతే, రుణగ్రహీత బ్యాంకుకు లీగల్‌ నోటీసును పంపడంతో పాటు అవసరమైన చట్టపరమైన చర్యను తీసుకోవచ్చు. బ్యాంకు అధీనంలో ఉండగానే సేల్‌ డీడ్‌ పోయింది కాబట్టి, బ్యాంకును పోలీసులకు ఫిర్యాదు చేయమని అడగొచ్చు. బ్యాంకు అలా చేయడానికి నిరాకరిస్తే, రుణగ్రహీతే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. పోలీసుల నుంచి ఫస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఎఫ్‌ఐఆర్‌) కాపీని పొంది, బ్యాంకుకు ఆ కాపీని అందించండి. భవిష్యత్‌లో ఎఫ్‌ఐఆర్‌ చట్టపరమైన రికార్డుగా రుణగ్రహీతకు ఉపయోగపడుతుంది.

పబ్లిక్‌ నోటీసు

రుణగ్రహీతలు కనీసం రెండు ప్రముఖ వార్తాపత్రికలలో పబ్లిక్‌ నోటీసులను ఇవ్వాలి. ఈ నోటీసులో బ్యాంకు ద్వారా సేల్‌ డీడ్‌ను కోల్పోయినట్లు తెలియజేయాలి. నోటీసులో మీ ఆస్తికి సంబంధించిన అన్ని వివరాలు ఉండాలి. ఎవరైనా మీ పత్రాలను తిరిగి ఇవ్వొచ్చు లేదా ఏవైనా అభ్యంతరాలు లేవనెత్తచ్చు. ఒక వారం/10 రోజులు వేచి చూడండి. సేల్‌ డీడ్‌ను పోగొట్టుకున్నట్లు రుజువుగా నోటీసు ప్రచురణ అయిన పత్రికను మీ వద్ద భద్రపరచుకోవాలి.

వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు

రుణగ్రహీతలు సేల్‌ డీడ్‌ కోల్పోయినందుకు వినియోగదారుల ఫోరంలో బ్యాంకుపై ఫిర్యాదు చేయొచ్చు. ఇంటి పత్రాలు అందజేసినప్పుడు బ్యాంకు ద్వారా పొందిన రశీదులు, పోలీసు పిర్యాదు కాపీ, రుణానికి సంబంధించిన పత్రాలు, వార్తపత్రిక నోటీసు కాపీ.. వినియోగదారుల ఫోరానికి సమర్పించాలి. ఇలాంటి ఫిర్యాదులను వినియోగదారుల ఫోరం బ్యాంకు వల్ల ఏర్పడిన సేవా లోపంగా పరిగణిస్తుంది. ఒరిజినల్‌ డాక్యుమెంట్ల నష్టానికి బ్యాంకు ద్వారా పరిహారం పొందే అవకాశం కూడా ఉంది. నేషనల్‌ కన్స్యూమర్‌ డిస్ప్యూట్స్‌ రిడ్రెసల్‌ కమిషన్‌ (NCDRC) 2022  జనవరిలో ఒక తీర్పులో.. సేల్‌ డీడ్‌ కోల్పోయినందుకు పరిహారంగా వినియోగదారుడికి రూ.5 లక్షలు చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది.

వేరొక సేల్‌ డీడ్‌ను పొందొచ్చు

సేల్‌ డీడ్‌ను కోల్పొయిన సందర్భంలో దస్తావేజు నమోదయిన సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని సంప్రదించాలి. అక్కడ మీ సేల్‌ డీడ్‌కు సంబంధించిన హార్డ్‌/సాఫ్ట్‌ కాపీ ఉంటుంది. మీరు ఇప్పటి వరకు చేసిన ఫిర్యాదులతో సహా ఆస్తికి సంబంధించిన ఇతర పత్రాలతో సబ్‌-రిజిష్టర్‌కు దరఖాస్తు చేసి వేరొక సేల్‌ డీడ్‌ కాపీ పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని