Home Loans: గృహ రుణాలపై ఛార్జీలు...ఇన్ని ఉన్నాయా?

డాక్యుమెంటేషన్‌ రుసుము నుంచి చట్టపరమైన ఖర్చుల వరకు, బ్యాంకులు వివిధ రకాల ఛార్జీలను విధిస్తాయి.

Published : 17 Oct 2022 14:38 IST

ఇంటి నిర్మాణానికి చాలా పెద్ద మొత్తం అవసరం పడుతుంది. అందుచేత చాలా మంది తమ అర్హతను బట్టి ఇంటి రుణం కోసం బ్యాంకుల‌పై ఆధార‌ప‌డ‌తారు. బ్యాంకులు మెరుగైన క్రెడిట్ స్కోరు ఉండేవారికి 7.50 శాతం నుంచి గృహ రుణాల‌ను అందిస్తున్నాయి. ఈ రుణాలపై వడ్డీ రేట్లు తెలుసుకుంటే సరిపోదు. ఇతర ఛార్జీలు, రుసుములు గురించి తెలుసుకోవాలి. బ్యాంకులు వివిధ రకాల ఛార్జీలను విధిస్తాయి. వీటి గురించి ఇప్పుడు చూద్దాం.

ప్రాసెసింగ్‌ రుసుములు:

గృహ రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు బ్యాంకులు ప్రాసెసింగ్‌ ఫీజులను వసూలు చేస్తాయి. చాలా సందర్భాల్లో బ్యాంకులు ప్రాసెసింగ్‌ ఛార్జీలుగా..రుణ మొత్తంలో కొంత శాతం లేదా ఫిక్స్‌డ్‌గా కొంత మొత్తాన్ని..ఏది తక్కువైతే అది విధిస్తాయి. ఉదాహరణకు, ఎస్‌బీఐ కనిష్ఠంగా రూ. 2,000, గరిష్ఠంగా రూ. 10 వేలు మొత్తాన్ని వసూలు చేస్తుంది. దీనిపై అదనంగా 0.35% జీఎస్‌టీ కూడా ఉంటుంది. సాధారణంగా ప్రాసెసింగ్‌ ఫీజులు రుణ మొత్తంలో 0.20% నుంచి 2% వరకు ఉంటుంది. ఇవి ఫీజులు రుణ పరిమితి, బ్యాంకు నిబంధనలు, షరతులపై కూడా ఆధారపడి ఉంటాయి. అయితే, పండుగ ఆఫర్‌లో భాగంగా..ఎస్‌బీఐ 31 జనవరి 2023 వరకు గృహ రుణాలపై ప్రాసెసింగ్‌ రుసుములను మాఫీ చేసింది.

అడ్మినిస్ట్రేషన్‌ రుసుములు:

బ్యాంకులు రుణం మంజూరు ముందు ఆస్తి విలువను అంచనా వేస్తాయి. ఆస్తిపై చట్టపరమైన అభిప్రాయాలు, వివాదాల గురించి తెలుసుకుంటాయి. వీటి ఆధారంగా వేర్వేరుగా రుసుము వసూలు చేస్తాయి. ఈ అడ్మినిస్ట్రేషన్‌ ఛార్జీలు సాధారణంగా రుణ మొత్తంపై 0.20% నుంచి 0.50% వరకు ఉంటాయి.

మెమొరాండమ్‌ ఆఫ్‌ డిపాజిట్‌ ఆఫ్‌ టైటిల్‌ డీడ్‌ (MODT) :

టైటిల్‌ డీడ్‌పై తనఖాని తయారు చేయడానికి MODT ఛార్జీని బ్యాంకు విధిస్తుంది. గృహ రుణం తీసుకున్నవారు రుణాన్ని తిరిగి చెల్లించే వరకు ఆస్తిలో బ్యాంకు వాటాను MODT చూపుతుంది. స్టాంఫ్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులతో సహా ఈ ఛార్జీలు రాష్ట్రానికి- రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. ఈ ఫీజులు రుణ మొత్తంలో 0.1% నుంచి 0.5% మధ్య ఉంటాయి.

రుణంపై జీఎస్‌టీ ఛార్జీలు:

రుణ మొత్తంపై, ఈఎంఐలపై జీఎస్‌టీ ఉండదు, కానీ బ్యాంకులు వసూలు చేసే ఛార్జీలపై జీఎస్‌టీ వర్తిస్తుంది. ఉదాహరణకు ప్రాసెసింగ్‌ ఫీజు రూ. 5000 అయితే, దానిపై 18% జీఎస్‌టీని చెల్లించాలి. అంటే అదనంగా రూ. 900 బ్యాంకుకు చెల్లించాలి. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్‌ ఛార్జీలు, న్యాయ సంబంధిత అభిప్రాయాల ఫీజులు మొదలైన వాటికి జీఎస్‌టీ వర్తిస్తుంది. ఈఎంఐ చెల్లింపు ఆలస్యమయినప్పుడు బ్యాంకులు జరిమానా విధిస్తే ఆ జరిమానా మొత్తానికి 18% జీఎస్‌టీ ఉంటుంది.

డాక్యుమెంటేషన్‌ రుసుములు:

గృహ రుణం దరఖాస్తు చేసినప్పుడు, బ్యాంకు అనేక డాక్యుమెంట్లను సురక్షితంగా నిర్వహిస్తుంది. రుణదారుని పత్రాలను భద్రపరచడానికి, రికార్డు చేయడానికి డాక్యుమెంటేషన్‌ రుసుములను బ్యాంకులు విధిస్తాయి. కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్‌ ఫీజులోనే డాక్యుమెంటేషన్‌ రుసుములను కలిపి వసూలు చేస్తాయి.

ఇతర రుసుములు:

గృహ రుణంలో హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, క్రెడిట్‌ రిపోర్ట్ తీసుకునేందుకు అయ్యే రుసుములు మొదలైన మరికొన్ని ఛార్జీలుంటాయి. అయితే ఈ ఛార్జీలు బ్యాంకు బ్యాంకుకు మారతాయి, ఒకేలా ఉండవు.

రుసుముల మినహాయింపులు ఎప్పుడుంటాయి: 

ప్రాపర్టీని కొనుగోలు చేయాలని యోచించేవారు, నిర్మాణదారు.. ఏఏ బ్యాంకులతో ఒప్పందాలు ఉన్నాయో చూసుకోవాలి. ఇలా ఒప్పందాలున్న బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే..కొన్ని ఛార్జీలను ఆదా చేయొచ్చు. సాధారణంగా వీరికి న్యాయ సంబంధిత అభిప్రాయాల ఫీజులు, వాల్యుయేషన్‌ ఫీజులు, ప్రాసెసింగ్‌ ఛార్జీల్లో మినహాయింపులుంటాయి. అయితే, ఈ మినహాయింపులు నిర్మాణ సంస్థ, బ్యాంకు మధ్య ఉన్న భాగస్వామ్య ఒప్పందాలపై ఆధారపడి ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని