Loan Mistakes: రుణాల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ప్రతి ఒక్కరు ఏదో సమయంలో ఆర్థిక సంస్థల వద్ద రుణాలు తీసుకున్నవారే. రుణాలు తీసుకునేటప్పుడు, ఎలాంటి తప్పులు చేయడానికి అవకాశముంటుందో ఇక్కడ చూడండి.

Published : 27 Nov 2023 17:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతంతో పోలిస్తే ప్రస్తుతం బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలు రుణాలను విరివిగా అందిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా రుణాలు తీసుకునేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఈ రుణాలను అనేక అవసరాల మేరకు చాలా మంది తీసుకుంటారు. ఉదాహరణకు అనేక కార్యకలాపాల ఖర్చుల కోసం వ్యక్తిగత రుణం, బంగారంపై రుణం, ఇంటి రుణం, కారు రుణం, విద్యా రుణం మొదలైన రుణాలు తీసుకుంటారు. చాలా మంది రుణం తీసుకునే దగ్గర నుంచి తీర్చేదాకా అనేక తప్పులు చేస్తుంటారు. అవేంటో చూద్దాం..

వ్యక్తిగత రుణం

ఈ రుణాన్ని తీసుకునేటప్పుడు బ్యాంకులు ఏ విధమైన హామీని అడగవు. ఇది పూర్తిగా అసురక్షిత రుణం. అందుచేత రుణ దరఖాస్తుదారుడికి మెరుగైన క్రెడిట్‌ స్కోరు ఉండడం చాలా అవసరం. చాలామంది అప్పు అవసరమైనప్పుడు తగిన అవగాహన లేని కారణంగా మెరుగైన క్రెడిట్‌ స్కోరు లేకుండా కూడా అనేక రుణ సంస్థలకు, తక్కువ కాలవ్యవధిలో రుణం కోసం దరఖాస్తు చేసేస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. ఇలా ఎక్కువ సార్లు రుణం కోసం దరఖాస్తు చేసినందుకు గాను వారి స్కోరు మరింత తగ్గుతుంటుంది. అందుచేత వ్యక్తిగత రుణం అవసరమైన వారు ముందు వారి క్రెడిట్‌ స్కోరును చెక్‌ చేసుకుని ఆ తర్వాతే రుణం గురించి దరఖాస్తు చేయాలి. ఏ కారణం చేతనైనా ఒకసారి రుణ దరఖాస్తు ఫెయిలయితే, మళ్లీ 6 నెలల వరకు దరఖాస్తు చేయకపోవడమే మంచిది. ఈ 6 నెలల గడువులో క్రెడిట్‌ స్కోరును పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇందుకుగాను వారి రుణ బకాయిలు ఏవైనా ఉంటే గడువులోగా చెల్లించేయాలి.

అంతేకాకుండా వ్యక్తిగత రుణాన్ని అన్ని రకాల ఆర్థిక అవసరాల/ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు. మీ ఇంటిని పునరుద్ధరించాలని ప్లాన్‌ చేస్తుంటే, వ్యక్తిగత రుణానికి బదులు.. హోమ్‌ రినోవేషన్‌ లోన్‌ను ఎంచుకోవచ్చు. దీనిపై వడ్డీ వ్యక్తిగత రుణం కంటే తక్కువ ఉంటుంది. చాలామంది వ్యక్తిగత రుణాన్ని తీసుకుని, రుణాన్ని చెల్లించే కాలవ్యవధిని తప్పుగా సెట్‌ చేసుకుంటారు. ఇలాంటి రుణాలకు దీర్ఘకాల ఈఎంఐలు కరెక్ట్‌ కాదు. ఒకవేళ మీ వద్ద డబ్బు ఉన్నప్పుడు ముందుగానే రుణాన్ని తీర్చేద్దామంటే రుణసంస్థలు ప్రీ-క్లోజర్‌ ఛార్జీలు వసూలు చేస్తాయి. ఇది కూడా నష్టమే. అందుచేత వ్యక్తిగత రుణాలకు తక్కువ (3-5 ఏళ్లు) కాలవ్యవధినే సెట్‌ చేసుకోవాలి.

క్రెడిట్‌ కార్డు రుణం

మీ క్రెడిట్‌ కార్డుతో ఏటీఎంలో నగదు విత్‌డ్రా చేయొచ్చు. ఇలా నగదు విత్‌డ్రా చేసుకోవడం కూడా అత్యవసర తక్షణ రుణం లాంటిదే. క్రెడిట్‌ కార్డులో ఈ సౌకర్యం ఉంది కదా అని నగదు విత్‌డ్రా చేసుకోవడం చాలా పెద్ద తప్పిదం. ఎందుకంటే ఇలాంటి రుణంపై వడ్డీ, రుసుములు, ఖర్చులు చాలా ఎక్కువ ఉంటాయి. ఏటీఎంలో నగదు విత్‌డ్రా చేసిన రోజు నుంచి వడ్డీ ప్రారంభమవుతుంది. సాధారణ కొనుగోళ్లకు లభించే గ్రేస్‌ పీరియడ్‌ దీనికి వర్తించదు. అంతేకాకుండా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది రుణంలో 2-3% వరకు ఉండొచ్చు. వడ్డీ కూడా అధికంగానే ఉంటుంది. నెలకు 3-4% వరకు ఉండొచ్చు. చాలా మంది నగదు విత్‌డ్రా చేసిన తర్వాత చెల్లింపుల విషయంలో డిఫాల్టవుతారు. దీనివల్ల క్రెడిట్‌ స్కోరు దెబ్బతిని భవిష్యత్‌లో అత్యవసరమైనప్పుడు అప్పు లభించని అవకాశాలుంటాయి. అందుచేత ఏటీఎంలో నగదు విత్‌డ్రా చేసే బదులు ఏ మాత్రం అవకాశమున్నా కూడా వ్యక్తిగత రుణాన్ని తీసుకోవడం మేలు. వడ్డీ, రుసుంలు ఉన్నంతలో కొద్దిగా సౌకర్యంగానే ఉంటాయి.

కారు రుణం

ప్రస్తుతం అన్ని బ్యాంకులు, చాలా ఆర్థిక సంస్థలు కార్ల కొనుగోలు కోసం రుణాలిస్తున్నాయి. మధ్యతరగతి ఆదాయ వర్గాలు కూడా కారు కోసం రుణం తీసుకుంటున్నారు. ఈఎంఐ తీర్చగలిగే ఆర్థిక పరిస్థితి ఉంటే రుణం తీసుకోవచ్చు. కానీ, తగిన ఆర్థిక స్థోమత లేకుండా కారు రుణం తీసుకోవడం తప్పిదమే. ఆర్థిక సంస్థలు రుణాన్ని చెల్లించడానికి 3-7 సంవత్సరాల కాలవ్యవధిని ఇస్తుంటాయి. సుదీర్ఘ కాలవ్యవధిని ఎంచుకోవడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందని రుణగ్రహీతలు అర్థం చేసుకోవాలి. దీర్ఘకాలం పాటు చెల్లించే రుణాలపై అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అందుచేత మీ ఆదాయం తక్కువగా ఉంటే తప్ప, ఎక్కువ కాలవ్యవధిని ఎంచుకోవద్దు.

అంతేకాకుండా కారు డీలర్లు కూడా రుణాలిచ్చే బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని రుణాలకు మధ్యవర్తిగా ఉంటాయి. ఈ డీలర్లు సాధారణంగా కమీషన్‌/అదనపు రుసుములను వసూలు చేయొచ్చు. దీని వల్ల వినియోగదారునికి నష్టమే. అందుచేత డీలర్‌ చెప్పిన ఆర్థిక సంస్థను నేరుగా వివిధ బ్యాంకులను సంప్రదించడం మేలు. అంతేకాకుండా ఈ రుణానికి ఎక్కువ మొత్తంలో అంటే 30-40% వరకు డౌన్‌పేమెంట్‌ను చెల్లించడం మంచిది. దీనివల్ల ఈఎంఐ కాలవ్యవధి, మొత్తంతో పాటు వడ్డీ భారం కూడా తగ్గుతుంది. కారును ఎంపిక చేసుకునేటప్పుడు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వేరే వారి కార్లతో పోల్చుకోకుండా, మీ కుటుంబానికి, ఆర్థిక పరిస్థితికి తగ్గ కారును ఎంపిక చేసుకోవడం మంచిది. దీనివల్ల అనవసర వ్యయాలు బాగా తగ్గుతాయి.

హోమ్‌ లోన్‌

ఇంటి రుణం దీర్ఘకాలంతో కూడుకున్నది. రుణ మొత్తం, తిరిగి చెల్లించే కాలవ్యవధి, ఈఎంఐ కూడా పెద్దగానే ఉంటాయి. చిన్న రుణాలపై తప్పులు జరిగినా, నష్టం పరిమితంగా ఉంటుంది. అదే ఇంటి రుణం అయితే నష్టం దీర్ఘకాలం పాటు అధిక మొత్తంలో ఉంటుంది. చాలా మంది హోమ్‌ లోన్‌ తీసుకునేటప్పుడు, తీసుకున్న తర్వాత కొన్ని తప్పులు చేస్తుంటారు. ఉదాహరణకు ఏడాది క్రితం బ్యాంకులు ఈ రుణాలకకు వడ్డీ రేట్లు పెంచినప్పుడు, పెరిగిన వడ్డీ రేటుకు తగ్గట్టుగా ఈఎంఐ మొత్తం పెరిగింది. అలా పెరిగిన ఈఎంఐని చెల్లిస్తే మంచిదే. కానీ, చాలా మంది రుణగ్రహీతలు ఈఎంఐ మొత్తాన్ని పెంచకుండా, ఈఎంఐల సంఖ్య (కాలవ్యవధి)ను పెంచుకోవడానికి మొగ్గు చూపారు. అయితే, ఈఎంఐల సంఖ్య పెరిగినప్పుడు చక్ర వడ్డీ ప్రభావం వల్ల మీరు అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల రుణగ్రహీతలు ఈ తప్పు చేయకుండా పెరిగిన వడ్డీని ఈఎంఐ షెడ్యూల్‌ ప్రకారం ఎప్పటికప్పుడు చెల్లించేయడం మంచిది.

చాలా మంది వడ్డీ పెరుగుతున్నా అదే బ్యాంకులో రుణాన్ని కొనసాగిస్తుంటారు. ఇతర బ్యాంకుల్లో కనీసం 1% తక్కువ వడ్డీకే రుణం లభిస్తున్నప్పుడు మీ రుణాన్ని బదిలీ చేసుకోవడం మేలు. దీనివల్ల గణనీయంగా లాభం పొందే అవకాశముంది. అంతేకాకుండా కొద్దిమంది వడ్డీ మార్పులకు భయపడి ఫిక్స్‌డ్‌ హోమ్‌లోన్‌ను తీసుకుంటారు. ఇది కూడా సరైంది కాదు. ఒక్కోసారి వడ్డీ రేట్లు బాగా తగ్గొచ్చు. అలాంటి సమయాల్లో ఫ్లోటింగ్‌ రుణాల వల్ల గరిష్ఠ లాభముంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంటి రుణంపై పన్ను మినహాయింపులు ఉంటాయి. కాబట్టి, మీకు ఇక మొత్తంలో నగదు అందితే రుణాన్ని పూర్తిగా చెల్లించేసేకంటే కొంత కొంత ముందస్తు చెల్లింపులు చేయడం మంచిది. దీనివల్ల పన్ను మినహాయింపులు కోల్పోరు. వడ్డీ భారం కూడా తగ్గుతుంది. హోమ్‌లోన్‌ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు మీ ఆర్థిక సంసిద్ధతను జాగ్రత్తగా అంచనా వేయడం చాలా ముఖ్యం.

విద్యా రుణం

విద్యా రుణాలు ఉన్నత విద్యను మరింత అందుబాటులోకి తెచ్చాయి. ఈ రుణాలపై మారటోరియం పీరియడ్‌ ఉంటుంది. ఈ పీరియడ్‌ ఉంది కదా అని చెల్లింపులు అనేవి అసలు చేయకపోవడం కరెక్ట్‌ కాదు. రుణం తీసుకున్న దగ్గర నుంచి వడ్డీ మొదలవుతుంది. ఇది రుణంలో కలిపేస్తారు. ఇదంతా కలిపి మారటోరియం పీరియడ్‌ తర్వాత పెరిగిపోయే అవకాశముంది. అందుచేత వీలయితే రుణం తీసుకున్నాక మరుసటి నెల నుంచి వడ్డీని చెల్లించడం చాలా మంచిది. ఇలా చేస్తుంటే విద్యార్థి ఉద్యోగంలో చేరాక ఈఎంఐ పెద్దగా భారంగా అనిపించదు. రుణం తీసుకున్న వెంటనే చెల్లింపులు ప్రారంభిస్తే, రుణగ్రహీతలు ఆర్థిక పరమైన విషయాలలో క్రమశిక్షణ కూడా అలవర్చుకోవచ్చు.

బంగారు రుణాలు

ఇది పూర్తిగా సురక్షిత రుణం. దీనికి క్రెడిట్‌ స్కోరు అవసరం కూడా లేదు. కొద్దిమంది ఇప్పటికి సరైన అవగాహన లేక ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద, చిన్న సంస్థల వద్ద బంగారాన్ని తాకట్టు పెట్టి అధిక వడ్డీకి రుణాన్ని తీసుకుంటారు. ఇది ఎంత మాత్రం సరైంది కాదు. అధిక రిస్క్ ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా అన్ని బ్యాంకులు సరసమైన వడ్డీ రేట్లకు బంగారాన్ని తాకట్టు పెట్టుకుని రుణాలిస్తున్నాయి. అంతేకాకుండా వ్యక్తులతో, చిన్న సంస్థలతో పోలిస్తే బంగారాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తాయి. అయితే, రుణం తీసుకునేవారు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను సరిపోల్చుకుని రుణం తీసుకోవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని