Bank Cheque: బ్యాంకు చెక్కు ఇచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

బ్యాంకు చెక్కు రాయడం చాలా సులభమైన పనే. కానీ, చెక్కులను జారీ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

Published : 07 Nov 2023 18:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ రోజుల్లో ఆన్‌లైన్‌ ద్వారా నగదు పంపడం, తీసుకోవడం చాలా సులభం అయిపోయింది. గతంలో నగదు కార్యకలాపాలకు బ్యాంకు జారీ చేసిన చెక్‌లను విరివిగా వాడేవారు. అయితే, ఇప్పటికీ నగదు చెల్లింపులకు చెక్‌లు జారీ చేస్తుంటారు. చెక్‌ జారీ చేసేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అనేక ఆర్థిక నష్టాలు, వివాదాలకు కారణమవుతుంది. భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మోసాలు, చట్టపరమైన సమస్యల బారిన పడే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు.

నగదు నిల్వ, తేదీ

బ్యాంకులో తగినంత నగదు బ్యాలెన్స్‌ లేకుండా చెక్‌ను ఎవరికీ ఇవ్వొద్దు. చెక్‌పై రాసిన మొత్తానికి మీ ఖాతాలో తగినంత నిధులు ఉన్నాయని నిర్ధారించుకోవాలి. బ్యాంకులో తగిన బ్యాలెన్స్‌ లేక చెక్‌ బౌన్స్‌ అయితే స్వీకరించినవారికి పెనాల్టీ ఉంటుంది. అంతేకాకుండా అది ఇచ్చిన వారి ఆర్థిక విశ్వసనీయత దెబ్బతినడమే కాకుండా కోర్టు కేసును ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకులో తగిన నిల్వ లేనప్పుడు కొద్దిగా లేటుగా తేదీని రాయడం మరువొద్దు. ఆ తేదీకి కాస్త ముందుగానే బ్యాంకులో తగినంత డిపాజిట్‌ చేయడానికి వెసులుబాటు ఉంటుంది. అలాగే తేదీ లేకుండా చెక్కు ఇస్తే బ్యాంకు అంగీకరించదు. సంవత్సరం లేదా నెలను తప్పుగా రాసినా కూడా మీ చెక్‌ బౌన్స్‌ అయ్యే అవకాశం ఉంది. కచ్చితమైన ఆర్థిక రికార్డులను నిర్వహించడానికి చెక్‌ నంబర్‌తో సహా తేదీ చాలా కీలకం.

పోస్ట్‌-డేటెడ్ చెక్కు

సాధారణంగా చాలా మంది పోస్ట్‌-డేటెడ్ చెక్కులు ఇస్తుంటారు. ముఖ్యంగా తక్కువ కాలవ్యవధిలో ఎక్కువ పోస్ట్‌-డేటెడ్ చెక్కులను వేర్వేరు వ్యక్తులకు ఇవ్వొద్దు. దీనివల్ల తికమకకు గురై బ్యాంకులో డబ్బు నిల్వ ఉంచడంలో ఇబ్బందులు ఏర్పడవచ్చు. పోస్ట్‌-డేటెడ్ చెక్ ఇచ్చినప్పుడు ఆ డేట్‌ను నోట్‌ చేసుకోవడమే కాకుండా.. దాని కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. 

చెక్కులో పేరు, మొత్తం

మీరు చెక్కును జారీ చేస్తున్న వ్యక్తి/వ్యాపారం పేరును స్పష్టంగా రాయాలి. సరిగ్గా పేరు రాస్తేనే చెక్‌ పనిచేస్తుంది. పేరు రాయడంలో పొరపాట్లు జరిగితే చెక్కు క్లియర్‌ అవ్వడంలో జాప్యం కావచ్చు లేదా తిరస్కరణకు గురికావచ్చు. చెక్కును ఇచ్చేటప్పుడు దానిపై రాసే మొత్తాన్ని ఒకటికి రెండు సార్లు తనిఖీ చేయండి. చెక్కులో పేరును రెండు, మూడు పదాలుగా రాసేటప్పుడు, పదాల మధ్యలో తక్కువ గ్యాప్‌ వదలాలి. ఎక్కువ గ్యాప్‌ వదిలితే ఆ పదాల మధ్య ఏదైనా అక్షరాన్ని చేర్చి ‘పేరు’ మార్చేయడానికి అవకాశం ఉంది. డబ్బు మొత్తాన్ని సంఖ్యలో రాసినప్పుడు, ఆ సంఖ్యను ఎవరూ మార్చకుండా చూడాలి. ఉదాహరణకు 5000/- ఇలా కుడివైపు బాక్స్‌లో రాయాలి. అంతేకాకుండా ఎడమవైపు గీతపై Rupees Five Thousand only అని అక్షరాలలో కూడా తప్పనిసరిగా రాయాలి. దీనివల్ల అమౌంట్‌ మొత్తం ఎవరూ ఉద్దేశపూర్వకంగా మార్చకుండా ఉంటుంది.

సంతకం, ఓవర్‌రైట్‌

చెక్కుకు కుడివైపు కింద సంతకం చేయవలసి ఉంటుంది. ఇది చాలా కీలకం. మీరు బ్యాంకులో ఇచ్చిన సంతకంతో ఇది సరిపోలాలి. లేని పక్షంలో బ్యాంకు మీ చెక్కును తిరస్కరించే అవకాశం ఉంది. దీనివల్ల చాలా విలువైన సమయం వృథా అవుతుంది. అంతేకాకుండా మీరు రాసిన చెక్కులో ఎలాంటి వివరాలను ఓవర్‌రైట్‌ చేయకుండా జాగ్రత్త వహించండి. చెక్‌ను అంగీకరించడానికి, నిరాకరించడానికి బ్యాంకుకు స్వేచ్ఛ ఉన్నందున చెక్కుపై కొట్టివేతలు ఉండకూడదు. మీరు చెక్‌ రైటింగ్‌ ఫార్మాట్‌లో పొరపాటు చేస్తే, కొత్త చెక్కును రాయండి. 

క్రాస్‌ ది చెక్‌, BEARER

మీరు ఎవరి పేరు మీద చెక్కు ద్వారా డబ్బు చెల్లించినా.. చెక్కు ఎడమవైపున పైన డబుల్‌ క్రాస్‌ లైన్‌ను గీయాలి. ఆ రెండు లైన్ల మధ్యలో 'A/C Pay only' అని రాయాలి. దీనివల్ల ఆ డబ్బు కచ్చితంగా అతడి బ్యాంకు ఖాతాలోకే వెళుతుంది. మధ్యలో ఎవరూ దీన్ని దుర్వినియోగం చేయలేరు. బ్యాంకు ఖాతాకే వెళుతుంది కాబట్టి, ప్రూఫ్ కింద ఉంటుంది. అంతేకాకుండా చెక్కు పైనుంచి 2వ లైన్‌లో చివర BEARER అని ఉంటుంది. ఆ అక్షరాలను అడ్డండా గీత గీయాలి (కొట్టివేయాలి). ఇలా చేయడం వల్ల రిసీవర్‌ బ్యాంకు ఖాతాకు మాత్రమే మొత్తం జమ అవుతుంది. చాలా మంది చెక్కు ఇచ్చేటప్పుడు హడావిడిలో ఇది మర్చిపోతుంటారు.

బ్లాంక్‌ చెక్‌

ఖాళీగా ఉన్న చెక్కును ఎవరికీ ఇవ్వొద్దు. సంతకం మాత్రమే చేసి అసలు ఇవ్వకూడదు. అవతలి వ్యక్తులు దీన్ని దుర్వినియోగం చేయడానికి అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. ఈ అజాగ్రత్త కారణంగా చెక్కు జారీ చేసినవారు అనేక ఆర్థిక నష్టాలకు, చట్టపరమైన ఇబ్బందులకు గురవుతారు. ఎల్లప్పుడూ చెక్కు వివరాలను పూర్తిగా రాసి సరైన వ్యక్తులకు మాత్రమే అందజేయండి.

చెక్కు వివరాలు

మీరు ఎవరికైనా చెక్కు ఇచ్చినప్పుడు దాని నంబరు, ఖాతా పేరు, అమౌంట్‌ మొత్తం, జారీ చేసిన తేదీ లాంటివన్నీ ముఖ్యమైన చోట నోట్‌ చేసుకోండి. సాధారణంగా చెక్ బుక్ మొదట్లోనే దీనికోసం ఒక పేజీ అందుబాటులో ఉంటుంది. ఏ కారణం వల్లనైనా చెక్కును రద్దు చేయాలనుకున్నప్పుడు ఈ సమాచారం అవసరం పడుతుంది. బ్యాంకుకు కాల్‌ చేసి తెలుపాలన్నా, స్వయంగా వెళ్లి అడిగినా బ్యాంకు తప్పక ఆ చెక్కు వివరాలు అడుగుతుంది. ప్రస్తుతం చాలా మంది స్మార్ట్‌ఫోన్‌లనే వాడుతున్నారు కాబట్టి, చెక్కును ఇచ్చే ముందు దాన్ని స్నాప్‌షాట్‌ పొందడం మంచిది.

అదనపు జాగ్రత్తలు

సాధారణంగా చెక్కు ఇస్తున్నప్పుడు.. పేరు, అమౌంట్‌ మొత్తంపై ట్రాన్స్‌పరెంట్ సెల్లో టేప్‌ను అతికించాలని ముఖ్యమైన సూచన. దీని వల్ల చెక్కును మార్చడానికి ఎవరూ ప్రయత్నం చేయలేరు. చెమట, నీరు లాంటివి తగిలినప్పుడు చెక్కుపై అక్షరాలు చెరిగిపోవు. చెక్‌ బుక్‌ను జాగ్రత్తగా నిర్వహించాలి. మడత పెట్టడం గానీ, పాడు చేయడం గానీ చేయకూడదు. చెక్కు స్వరూపం కొద్దిగా మారినా, మురికిగా ఉన్నా బ్యాంకు ఆ చెక్కులను తిరస్కరిస్తుంది. చెక్కును జారీ చేసేటప్పుడు వెనుక భాగంలో మీ పేరు, ఖాతా వివరాలు, మొబైల్‌ నంబర్‌తో పాటు సంతకం కూడా చేయండి. ఇతర కారణాల వల్ల అవసరమైతే తప్ప రద్దు చేసిన చెక్కులను పూర్తిగా నాశనం చేయండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని