Home Loan: హోమ్‌లోన్‌ తీసుకునేముందు వీటిని చెక్‌ చేసుకోండి..

ఇంటి రుణం అనేది సుదీర్ఘమైన కాలవ్యవధికి సంబంధించినది మాత్రమే కాకుండా, పెద్ద ఆర్థిక బాధ్యత కూడా. ఈ రుణానికి దరఖాస్తు చేసేవారు ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

Updated : 25 Jul 2023 20:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇల్లు కొనడం అనేది చాలా మందికి ఒక కల. వారి జీవితకాలంలో చేసే అత్యంత ఖరీదైన కొనుగోళ్లలో ఇదీ ఒకటి. చాలా మంది భారతీయులు ప్రతిష్టాత్మకమైన ప్రధాన లక్ష్యాలలో సొంత ఇల్లు అనేది ఉండాలని భావిస్తున్నారని ఒక అధ్యయనం తెలిపింది. అయితే, ఇంటి కొనుగోలు కేవలం పొదుపుతో సాధ్యం కాదు. అందుకు బలమైన ఆర్థిక చేయూత అవసరం. కాబట్టి చాలా మందికి ఇంటిని సొంతం చేసుకోవాలనే కలను నెరవేర్చుకోవడానికి బ్యాంకు రుణంపై ఆధారపడతారు. అయితే, ఇంటి రుణం కోసం దరఖాస్తు చేసుకునే ముందు పరిగణించవలసిన అనేక కీలకమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఈ అంశాలను బట్టి రుణానికి ప్రయత్నించాలా? కొంత కాలం పాటు వేచి చూడాలా? అనేది రుణ దరఖాస్తుదారులు ఆలోచించుకోవాలి.

క్రెడిట్‌ స్కోరు

మీ క్రెడిట్‌ స్కోర్‌ మీ రుణ దరఖాస్తుపై నేరుగా ప్రభావం చూపుతుంది. బ్యాంకులు 700 అంతకంటే ఎక్కువ స్కోరును కలిగి ఉన్న దరఖాస్తుదారులపై ఆసక్తి చూపుతాయి. ఈ స్కోరు మెరుగ్గా ఉంటే తక్కువ వడ్డీ రేట్లు, మెరుగైన రుణ నిబంధనలను పొందొచ్చు. తక్కువ క్రెడిట్‌ స్కోరు ఉంటే రుణాన్ని తిరస్కరించే అవకాశాలే ఎక్కువ. కాబట్టి, మీ క్రెడిట్‌ హిస్టరీ, క్రెడిట్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ రిపోర్ట్‌ (సీఐఆర్‌)ని తప్పనిసరిగా చెక్‌ చేసుకోవాలి. ఇంటి రుణం కోసం దరఖాస్తు చేయడానికి కనీసం 6 నెలల ముందే వీటిని చెక్‌ చేసుకోవాలి. ఈ రిపోర్ట్‌లో ఏవైనా లోపాలుంటే సరిదిద్దుకోవడానికి తగిన సమయం ఉంటుంది. అందుచేత మీ క్రెడిట్‌ స్కోరు తక్కువ ఉంటే, రుణం కోసం దరఖాస్తు చేయడానికి ముందే దాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి. మంచి క్రెడిట్‌ నివేదికను నిర్వహించడానికి గడువులోగా ఎప్పుడూ చెల్లింపులు చేయాలి.

ఖాతా నిర్వహణ

ఇంటి రుణానికి మీ నెలవారీ ఆదాయం కీలకపాత్ర పోషిస్తుంది. ఈ ఆదాయంలో ఎంత వరకు పొదుపు చేస్తారనేది చాలా ముఖ్యం. బ్యాంకులు సాధారణంగా గృహ రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు దరఖాస్తుదారుల బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్‌లను తీసుకుంటాయి. గత 6 నెలల బ్యాంకు స్టేట్‌మెంట్‌ ఆధారంగా బ్యాంకులు మీ రీపేమెంట్‌ సామర్థ్యాన్ని అంచనా వేస్తాయి. ప్రతి నెలా మీ ఆదాయంలో కనీసం మూడో వంతు ఆదా చేసుకోవాలి. ఈ స్టేట్‌మెంట్‌తో మీ ఆదాయం, ఖర్చులు, జీవనశైలి మొదలైన వాటి గురించి బ్యాంకులు విశ్లేషిస్తాయి. ప్రతి నెలా తగిన క్రెడిట్‌ బ్యాలెన్స్‌ని కలిగి ఉన్నారా లేదా అని బ్యాంకు స్టేట్‌మెంట్‌ ద్వారా తెలుసుకుంటాయి. ఈ క్రెడిట్‌ బ్యాలెన్స్‌ కనీసం ఇంటి రుణ ఈఎంఐకి సమానంగా ఉండాలి. ఇంకా చెక్కులు బౌన్స్‌ అయిన సందర్భాలు ఉండకూడదు. ఇది సాధ్యం కాకపోతే.. ఆ ఆర్థిక స్థితికి వచ్చే వరకు ఇంటి రుణాన్ని వాయిదా వేసుకోవడమే మేలు.

పాత రుణాలు క్లియర్‌

మీరు ఒకటి కంటే ఎక్కువ రుణాలను పొందినట్లయితే, ఇంటి రుణం కోసం దరఖాస్తు చేసేముందు వాటిని చెల్లించేయండి. ఎక్కువ రుణాలను కలిగి ఉండడం మీ లోన్‌ అర్హతపై ప్రభావం చూపుతుంది. అయితే, కొన్ని బ్యాంకులు రుణ ఏకీకరణ పథకాన్ని కూడా అందిస్తాయి. దాన్ని పరిశీలించొచ్చు. మీ హోమ్‌ లోన్‌ అర్హతను లెక్కించేటప్పుడు బ్యాంకులు ఇతర రుణ ఈఎంఐలను పరిగణనలోకి తీసుకుంటాయి. తక్కువ సంఖ్యలో ఈఎంఐలతో మీ రుణం పొందే అర్హత పెరుగుతుంది.

డౌన్‌ పేమెంట్‌, ఇతర ఖర్చులు

నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ) నిబంధనల ప్రకారం.. ఇంటి రుణాన్ని తీసుకునేటప్పుడు డౌన్‌ పేమెంట్‌ను చెల్లించాలని బ్యాంకులు అడుగుతాయి. డౌన్‌ పేమెంట్‌ మొత్తం సాధారణంగా ఇంటి విలువలో 10-20% మధ్య ఉంటుంది. ఇది బ్యాంకును బట్టి మారుతుంది. మీరు రూ.60 లక్షల విలువైన ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటే.. బ్యాంకు 20% డౌన్‌ పేమెంట్‌ని అడిగితే.. ఇది దాదాపు రూ.12 లక్షలు అవుతుంది. మీ డౌన్‌ పేమెంట్‌ ఎంత ఎక్కువ ఉంటే ఈఎంఐలు అంతగా తగ్గుతాయి. అలాగే, ఇంటీరియర్‌ డెకరేషన్‌, ఆస్తి రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ డ్యూటీ, ఇతర లావాదేవీ సంబంధిత రుసుములు మొత్తం దాదాపుగా రూ.10 లక్షలు వరకు దాటొచ్చు. ఇంటి విలువను బట్టి ఇవి మారతాయి. ఇటువంటి ఖర్చులను భరించడానికి సిద్ధంగా ఉండాలి.

ఈఎంఐ

ప్రస్తుత ఇంటి రుణ వడ్డీ రేట్లు 8.5- 8.75% వరకు ఉన్నాయి. పై విధంగా డౌన్‌ పేమెంట్‌ చేసిన తర్వాత రూ.50 లక్షల గృహ రుణానికి కనీస ఈఎంఐ, 20 సంవత్సరాల కాలవ్యవధికి సుమారుగా రూ.44 వేలు అవుతుంది. కాబట్టి రుణం కోసం దరఖాస్తు చేసే ముందు మీ నెలవారీ ఆదాయం, ఖర్చులను సరి చూసుకోండి. రుణ కాలవ్యవధిని సుదీర్ఘ కాలానికి సెట్‌ చేసుకోవచ్చు. సుదీర్ఘ కాలవ్యవధి అంటే చిన్న ఈఎంఐలు కానీ, కాలక్రమేణా ఎక్కువ వడ్డీని చెల్లిస్తారు. మరోవైపు తక్కువ కాలవ్యవధికి ఈఎంఐ మొత్తం మారుతుంది. అయితే, వడ్డీ భారం చాలా తగ్గుతుంది. మీకు ఆర్థిక భారం లేకుండా ఈఎంఐ చెల్లింపులను చేయగలరో లేదో అంచనా వేయండి. మీ రొటీన్‌ ఖర్చులు, ఈఎంఐ చెల్లింపులను సౌకర్యవంతంగా నిర్వహించడానికి మీ వద్ద తగినంత నిధులు ఉంటేనే లోన్‌ కోసం దరఖాస్తు చేసుకోండి.

ఆదాయం పెరుగుదల

రుణం కోసం దరఖాస్తు చేసే ముందు మీ ఆదాయం భవిష్యత్‌లో పెరగవచ్చో లేదో గ్రహించండి. ఇంటి రుణం దీర్ఘకాలిక ఆర్థిక నిబద్ధతతో చెల్లింపులు చేసేది కాబట్టి.. జీతం, ఇంక్రిమెంట్లు ఎంత వరకు పెరుగుతాయో ముందే ఒక అంచనాకు రావాలి. ఇవి పెరిగితే, రుణం ముందస్తు చెల్లింపులు చేయవచ్చు అని అనుకుంటారు. కానీ, కాలానుగుణంగా ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి, మీ ఆదాయ పెరుగుదల ఈఎంఐలను వేగంగా తీర్చడానికి పనికరాకపోవచ్చు.

ఉమ్మడి రుణం

క్రెడిట్‌ స్కోరు, ఆదాయ స్థాయి మొదలైన అంశాల కారణంగా రుణాన్ని పొందే అర్హతను మీరు అందుకోకపోతే, సహ-రుణగ్రహీతను ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో జీవిత భాగస్వామితో ఉమ్మడి రుణం కోసం దరఖాస్తు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ రుణం పొందే అవకాశాన్ని పెంచడమే కాకుండా తక్కువ వడ్డీ రేటుకు రుణం లభిస్తుంది. ఇద్దరు రుణగ్రహీతలు వారి ఆదాయంతో తమ జీవన ఖర్చులకు, ఈఎంఐలను తీర్చడానికి ఉపయోగించవచ్చు. ఈ విధంగా రుణం పొందినవారు ఆదాయం కలిపితే ఎక్కువే ఉంటుంది కాబట్టి, ముందస్తు చెల్లింపులు చేయొచ్చు. అంతేకాకుండా, ఉమ్మడి గృహ రుణ విషయంలో రుణగ్రహీతలిద్దరూ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సి, 24 కింద పన్ను ప్రయోజనాలను పొందుతారు.

పరిశోధన

ఇంటి రుణం తీసుకునే మందు వివిధ బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లు, పథకాలను సరిపోల్చడానికి మీరు సమగ్రమైన ఆన్‌లైన్‌ పరిశోధన చేయాలి. కొన్ని ఫెస్టివల్‌ సీజన్లలో ప్రాసెసింగ్‌ రుసుములు మాఫీ వంటివి ఉంటాయి. ఇంకా వడ్డీలపై డిస్కౌంట్లను బ్యాంకులు ప్రకటిస్తుంటాయి. ఫ్లోటింగ్‌, ఫిక్స్‌డ్‌ వంటి ఇంటి రుణాలు అందుబాటులో ఉంటాయి. వీటి వడ్డీ రేట్లను స్పష్టంగా తెలుసుకోవాలి. ఫిక్స్‌డ్‌ రేట్లు, రుణ కాలవ్యవధిలో స్థిరంగా ఉంటాయి. ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్లు మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా మారతాయి. అంటే ఈఎంఐలు కాలక్రమేణా మారొచ్చు. కాబట్టి, మీరు మీ అవసరాలకు సరిపోయే రుణ ప్రణాళికను ఎంచుకోవచ్చు. 

చివరిగా: ఇంటి రుణం తీసుకోవడానికి పైన పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇంటి రుణం వంటి దీర్ఘకాలిక ప్రణాళికను నిర్వహించడానికి ఆర్థిక సామర్థ్యం ఒకటే సరిపోదు. దీర్ఘకాలం పాటు ఆర్థిక క్రమశిక్షణగా ఉండడం చాలా అవసరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు