Home Loan: హోమ్‌లోన్‌ ఓవర్‌డ్రాఫ్ట్‌ ఖాతా గురించి తెలుసా?

అనేక బ్యాంకులు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు తమ గృహ రుణ దరఖాస్తుదారులకు ‘హోమ్‌ లోన్‌ ఇంట్రెస్ట్‌ సేవర్‌’ మొదలైన ఖాతాలతో హోమ్‌లోన్‌ ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యాలను అందిస్తున్నాయి, ఈ ఖాతా గురించి ఇక్కడ తెలుసుకుందాం.  

Published : 18 Apr 2023 14:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా గృహ రుణం (Home Loan) తీసుకునేటప్పుడు ప్రతి నెలా క్రమ పద్ధతిలో ఈఎంఐ చెల్లిస్తూ ఉంటాం. బకాయి కూడా తీరుతూ ఉంటుంది. గృహ రుణాన్ని ‘హోమ్‌లోన్‌ ఓవర్‌డ్రాఫ్ట్‌’ ఖాతాకు లింక్‌ చేసుకుంటే.. మన బ్యాంకు పొదుపు ఖాతాలో సగటు బ్యాలెన్స్‌ కన్నా అధికంగా ఉన్నప్పుడు గృహరుణ ఖాతాకు ఆ మొత్తం జమ అవుతుంది. దీనివల్ల గృహ రుణ అసలు మొత్తం తగ్గుతూ ఉంటుంది. ఒకవేళ తీసుకున్న రుణ మొత్తం కంటే ఎక్కువ మొత్తాన్ని గృహ రుణ ఖాతాలో జమచేస్తే.. ముందస్తు చెల్లింపుగా బ్యాంకులు పరిగణిస్తాయి. ఇది రుణంపై వడ్డీ తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇది వ్యక్తిగత పరిస్థితులు, ఆర్థిక లక్ష్యాలను బట్టి మంచి ఆర్థిక సాధనంగా ఉపయోగపడుతుంది.

ఓవర్‌డ్రాఫ్ట్‌తో సౌకర్యం

ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయం బ్యాంకు ఖాతాలా పనిచేస్తుంది. ఇక్కడ అవసరాలకు అనుగుణంగా నిధులను డిపాజిట్‌ చేయొచ్చు. విత్‌డ్రా చేసుకోవచ్చు. ఓవర్‌డ్రాఫ్ట్‌ రుణ సౌకర్యంపై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు తీసుకున్న రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించేలా చూసుకోవాలి. మీకు రూ.50 లక్షల గృహ రుణానికి రూ.10 లక్షల ఓవర్‌డ్రాఫ్ట్‌ పరిమితి ఉంటే, మీకు అవసరమైనప్పుడు గృహ రుణ ఖాతా నుంచి రూ.10 లక్షల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతకన్నా తక్కువ మొత్తాన్ని కూడా ఉపసంహరించుకోవచ్చు. విత్‌డ్రా చేసుకునే మొత్తంపై మాత్రమే బ్యాంకులు వడ్డీ విధిస్తాయి. గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో రుణగ్రహీతలకు ఈ ఖాతాల అవసరం ఉండొచ్చు.

అత్యవసర నిధిని ఉపయోగించొచ్చు

అనేక బ్యాంకులు హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు తమ గృహ రుణ దరఖాస్తుదారులకు ‘హోమ్‌ లోన్‌ అడ్వాంటేజ్‌’, ‘మాక్స్‌గెయిన్‌’, ‘హోమ్‌ లోన్‌ ఇంట్రెస్ట్‌ సేవర్‌’ మొదలైన ఖాతాలతో హోమ్‌లోన్‌ ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యాలను అందిస్తున్నాయి. మీ ఖాతాలో జమ అయిన నిధులు గృహ రుణ వడ్డీని తగ్గించడంలో ఉపయోగపడతాయి. హోమ్‌లోన్‌ ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయాన్ని ఎంచుకునే గృహ రుణగ్రహీతలు తమ అత్యవసర నిధిని కూడా ఓవర్‌డ్రాఫ్ట్‌ ఖాతాకు లింక్‌ చేయొచ్చు. ఇది వడ్డీని ఆదా చేయడంలో సహాయపడుతుంది.

నిబంధనలు

ఈ ఖాతా అర్హత ప్రమాణాలు బ్యాంకును బట్టి మారొచ్చు. గృహ రుణ ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయం రుణగ్రహీతలకు అధిక లిక్విడిటీ, సౌలభ్యాన్ని అందిస్తుంది. కాబట్టి, బ్యాంకులు వారి సాధారణ గృహ రుణాలతో పోలిస్తే గృహ రుణ ఓవర్‌డ్రాఫ్ట్‌ ఖాతాలకు కొంచెం ఎక్కువ వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. పొదుపు ఎక్కువ చేయగలిగేవారు, ఆదాయాన్ని అధికంగా పొందేవారు మాత్రమే హోమ్‌లోన్‌ ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయాన్ని ఎంచుకోవాలి. రుణ గ్రహీతలు అదనపు ఛార్జీలపై కూడా బ్యాంకు నుంచి స్పష్టత పొందాలి. ఈ ఖాతాను ఎంచుకోవడానికి ముందు తప్పనిసరిగా నిబంధనలు, షరతులను స్పష్టంగా అర్థం చేసుకోవాలి.

వేగంగా చెల్లింపులు

ప్రతి సంవత్సరం రుణ అసలు మొత్తంపై 5% ముందస్తుగా చెల్లించడం ఒక మార్గం. సాధారణంగా, 20 ఏళ్ల రుణంపై ఇలా చేయడం వల్ల రుణ కాల పరిమితిని కొంత వరకు తగ్గించుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారి ముందస్తు చెల్లింపులు చేయడానికి సిద్ధం అవ్వొచ్చు. లేదా ప్రతి 3 నెలలకొకసారి విభజించి చెల్లించవచ్చు. ఈ సందర్భంలో రుణగ్రహీత రుణంపై మూడింట ఒక వంతు ప్రీపేమెంట్‌గా.. మిగిలిన మొత్తాన్ని ఈఎంఐలుగా ముందస్తుగా చెల్లించొచ్చు. దీంతో గృహ రుణం నుంచి త్వరగా బయటపడొచ్చు. ఈ ఖాతాలో ప్రతి నెలా ఈఎంఐ కంటే కొంత మొత్తాన్ని అధికంగా చెల్లించడం మరొక మార్గం. ఇది మీ రుణ చెల్లింపులను వేగవంతం చేస్తుంది. అంతేకాకుండా, మీ ఆదాయం పెరిగేకొద్దీ మీరు ప్రతి సంవత్సరం ఈఎంఐ కూడా పెంచుకోవచ్చు. మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, లోన్‌ అగ్రిమెంట్‌లోని ప్రీపేమెంట్‌ నిబంధనలు, షరతుల ఆధారంగా ఏ ప్రీపేమెంట్‌ ప్లాన్‌ పనిచేస్తుందో మీరు ఎంచుకోవాలి.

జరిమానాలుండవు

ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం ఫ్లోటింగ్‌ రేట్‌ గృహ రుణాలపై ముందస్తు చెల్లింపు/ ప్రీ-క్లోజర్‌ ఛార్జీలు లేనప్పటికీ, బ్యాంకులు ఫిక్స్‌డ్‌ రేటు రుణాలపై ఛార్జీలను విధించవచ్చు. ఈ హోమ్‌లోన్‌ ఓవర్‌డ్రాఫ్ట్‌ ఎంపిక ప్రీపేమెంట్‌ పెనాల్టీను నివారిస్తుంది. హోమ్‌లోన్‌ ఓవర్‌డ్రాఫ్ట్‌ ఖాతాలో జమయిన మిగులు నిధులు బకాయి ఉన్న అసలుకు ముందస్తు చెల్లింపులా పనిచేస్తాయి.

ప్రతికూలతలు

గృహ రుణ ఖాతాలో జమ అయిన మిగులు మొత్తం ఆదాయపు పన్ను రాయితీకి సంబంధించిన సెక్షన్‌ 80సి కింద అర్హత పొందదు. ఎందుకంటే, దీన్ని ముందస్తు చెల్లింపుగా ఐటీ శాఖ పరిగణించదు. ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యం ఉన్న గృహ రుణ వడ్డీ రేటు.. సాధారణ గృహ రుణ వడ్డీ రేటుకంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మీ వద్ద తరచూ మిగులు నిధులు ఉండే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఈ ఖాతా ఉపయోగపడుతుంది. కొన్ని ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలపై లావాదేవీ ఛార్జీలు, వార్షిక ఛార్జీలు కూడా ఉండొచ్చు. ఒక్కోసారి ఇలాంటి సౌకర్యం ఉండడం వల్ల అధిక మొత్తం తీసుకుని అనవసర ఖర్చుల కోసం ఉపయోగిస్తుంటారు. ఇది అప్పుల ఊబికి దారి తీయొచ్చు. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఎక్కువగా వాడడం వల్ల లోన్ డిఫాల్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. డిఫాల్ట్ జరిగినట్లయితే, బ్యాంకు మీరు తాకట్టు పెట్టిన ఆస్తిని వేలం వేసే ప్రమాదం లేకపోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని