RBI - UDGAM: అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల కోసం RBI కొత్త పోర్టల్.. వివరాలు ఇలా తెలుసుకోండి..

UDGAM portal: అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల కోసం ఆర్‌బీఐ ప్రత్యేక పోర్టల్‌ ప్రారంభించింది. ఇందులో ఏదైనా బ్యాంకులో క్లెయిమ్‌ చేయకుండా ఉన్న డిపాజిట్లు ఉంటే తెలుసుకోవచ్చు.

Published : 18 Aug 2023 01:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంకుల్లో ఏళ్లుగా మూలుగుతున్న అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లకు (Unclaimed Deposits) సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక ముందడుగు వేసింది. వేర్వేరు బ్యాంకుల్లో మూలుగుతున్న అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లను ఒకే చోట తెలుసుకొనేందుకు UDGAM  (Unclaimed Deposits Gateway To Access Information) పేరిట ఓ సెంట్రలైజ్డ్‌ పోర్టల్‌ను లాంచ్‌ చేసింది. ఈ పోర్టల్‌ ద్వారా అన్‌క్లెయిమ్డ్‌ మొత్తాలను కావాలంటే తీసుకోవడం లేదా ఆయా ఖాతాలను పునరుద్ధరించుకోవడానికి వీలవుతుందని ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

ఏదైనా బ్యాంకు ఖాతాలోని నగదు పదేళ్లు లేదా అంతకు మించిన వాడుకలో లేకుండాపోతే దాన్ని అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్‌గా పరిగణిస్తారు. అలా ఎవరూ క్లెయిమ్‌ చేయని డిపాజిట్లుగా ఆ డబ్బులన్నీ బ్యాంకుల్లోనే పేరుకుపోతుంటాయి. అటువంటి ఖాతాల వివరాలను ఈ పోర్టల్‌ ద్వారా చూసుకోవచ్చు. ప్రస్తుతానికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ధనలక్ష్మి బ్యాంక్‌ లిమిలెడ్‌, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌, డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా లిమిటెడ్‌, సిటీ బ్యాంక్‌కు సంబంధించిన అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల వివరాలు ఈ పోర్టల్‌లో లభ్యం కానున్నాయి. అక్టోబర్‌ 15 నాటికి ఇతర బ్యాంకుల వివరాలు సైతం అందుబాటులోకి రానున్నాయని ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

మీ ఆధార్‌ నంబర్‌తో ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా?

ఎలా ఉపయోగపడుతుంది?

ఎవరైనా హఠాత్తుగా చనిపోతే మృతుడికి ఏయే బ్యాంకుల్లో ఎన్ని ఖాతాలున్నాయి? వాటిలో ఎంత సొమ్ముందన్న వివరాలు కుటుంబ సభ్యులకు తెలిస్తే ఫర్వాలేదు. కష్టకాలంలో ఆ డబ్బు ఉపయోగపడుతుంది. కానీ, చాలా కుటుంబాల్లో ఆర్థిక వ్యవహారాలన్నీ పురుషుల చేతుల మీదుగానే సాగుతుంటాయి. ఆర్థిక వివరాలు ఏవీ ఇతరులకు పెద్దగా చెప్పరు. దాంతో ఆకస్మిక మరణాలు సంభవించినప్పుడు ఆయా డిపాజిట్ల వివరాలు తెలియక కుటుంబ సభ్యులు అవస్థలు పడుతుంటారు. అలాగే, ఏదో బ్యాంకులో మరేదో సందర్భంలో సొమ్ము జమచేసి.. పనుల ఒత్తిడిలో పడిపోయి కాలగమనంలో దాని గురించి మరచిపోతుంటారు కొందరు. అటువంటివారు తమ కష్టార్జితాలను తిరిగి పొందడానికి ఈ పోర్టల్‌ దోహద పడుతుంది. ప్రస్తుతం క్లెయిమ్‌ చేయని డిపాజిట్ల గురించి తెలుసుకోవాలంటే ఆయా బ్యాంకుల వెబ్‌సైట్లను ఆశ్రయించాల్సి ఉంటుంది. అసలే బ్యాంకులో ఖాతా ఉందో తెలీకపోతే ఆ వివరాలు తెలుసుకోవడం కష్టం. ఈ పోర్టల్‌ ద్వారా ఆ కష్టాలు తీరనున్నాయి. డిపాజిట్‌దారులు లేదా మృతిచెందిన ఖాతాదారుల వారసులకు సంబంధిత డిపాజిట్లను వెతికి పట్టుకోవడం సులువవుతుంది.

ఎలా సెర్చ్‌ చేయాలి?

UDGAM వెబ్‌సైట్‌లోకి వెళ్లి ముందుగా రిజిస్టర్‌ అవ్వాలి. తర్వాత లాగిన్‌ అయ్యి ఖాతాదారు పేరు పేర్కొనాలి. ఫలానా బ్యాంకు వివరాలే కావాలా? అన్ని బ్యాంకుల వివరాలూ (ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్యాంకులు) కావాలా? అనే ఆప్షన్లు ఎంచుకోవాలి. మెరుగైన సెర్చ్‌ కోసం ఆ తర్వాత పాన్‌, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్ట్‌, పుట్టిన తేదీ వివరాలు ఏవైనా పేర్కొనాలి. ఒకవేళ ఆ వివరాలూ ఏవీ లేకపోతే గ్రామం, జిల్లా, రాష్ట్రం వంటి వివరాలు తెలుసుకోవాలి. అలా సెర్చ్‌ చేస్తే ఆ పేరుతో ఉన్న వ్యక్తుల వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ ఏదైనా బ్యాంకులో అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు కనిపిస్తే బ్యాంకుకు వెళ్లి ఖాతాను పునరుద్ధరించుకోవచ్చు. ఒకవేళ మరణించిన వ్యక్తుల చట్టబద్ధ వారసులైతే సంబంధిత బ్యాంకుకు వెళ్లి పత్రాలను సమర్పించి అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లను సెటిల్‌ చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు