SBI Rewardz Fraud: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్‌.. ఆ లింకులపై క్లిక్‌ చేయొద్దు..!

SBI Rewardz Fraud: తమ బ్యాంకు పేరిట వాట్సప్‌, ఎసెమ్మెస్‌ సందేశాల్లో వచ్చే లింకులపై క్లిక్‌ చేయొద్దని ఎస్‌బీఐ తమ కస్టమర్లను అప్రమత్తం చేసింది.

Updated : 20 May 2024 12:44 IST

SBI Rewardz Fraud | దిల్లీ: ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)’ రివార్డ్స్‌ పేరిట ఈ మధ్య వాట్సప్‌ సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. కొందరికి సాధారణ ఎసెమ్మెస్‌ల రూపంలోనూ మోసపూరిత లింకులు వస్తున్నాయి. వాటిపై క్లిక్‌ చేసి పలువురు నష్టపోయిన ఘటనలూ వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ తమ కస్టమర్లను అప్రమత్తం చేసింది.

ఇదీ జరుగుతోంది..

ఎస్‌బీఐ పేరిట వాట్సప్‌లో రివార్డ్స్‌ (SBI Rewardz) లింకు విస్తృతంగా ప్రచారమవుతోంది. తెలిసిన నంబర్ల నుంచే వస్తుండటంతో దాన్ని చూసినవారు నిజమని నమ్ముతున్నారు. ఫలితంగా సులభంగా మోసపోతున్నారు. ‘మీ ఎస్‌బీఐ రివార్డ్‌ రూ.7,250 యాక్టివేట్‌ అయింది. దీని గడువు ఈరోజుతో ముగిసిపోతుంది. డబ్బులు పొందేందుకు ఎస్‌బీఐ రివార్డ్స్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోండి. తద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేసుకోండి’ అంటూ సందేశంలో పేర్కొంటున్నారు. ఎస్‌బీఐ యోనో పేరిట ఓ లింకును సైతం జత చేస్తున్నారు.

బెంబేలెత్తిస్తున్న ‘ఎస్‌బీఐ’ సందేశం.. సైబర్‌ నేరస్థుల కొత్త పంథా

మేం ఎలాంటి లింకులు పంపబోం: ఎస్‌బీఐ

తమ బ్యాంకు రివార్డ్ పాయింట్ల పేరుతో జరుగుతున్న సైబర్ నేరాలపై ఎస్‌బీఐ (SBI) స్పందించింది. రివార్డు పాయింట్ల విషయంలో తాము ఎలాంటి లింకులు పంపబోమని స్పష్టం చేసింది. ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరబోమని తెలిపింది. ఇలా వాట్సప్‌, ఎసెమ్మెస్‌లో వచ్చే ఎలాంటి లింకులను క్లిక్ చేయొద్దని హెచ్చరించింది. సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని