SBI Amrit Kalash: ఎస్‌బీఐ ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీం.. 7.60% వడ్డీ.. కొన్ని రోజులే!

SBI Amrit Kalash: బ్యాంకులన్నీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీరేట్లను పెంచుతున్నాయి. ఈ తరుణంలో ఎస్‌బీఐ పరిమిత కాల ప్రత్యేక ఎఫ్‌డీ స్కీం తీసుకొచ్చింది.

Updated : 17 Feb 2023 12:01 IST

దిల్లీ: బ్యాంకింగ్‌ దిగ్గజం ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)’ మరో కొత్త పరిమిత కాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (Fixed Deposit) స్కీంను తీసుకొచ్చింది. ‘అమృత్‌ కలశ్‌ డిపాజిట్‌’ (SBI Amrit Kalash) పేరిట తీసుకొచ్చిన ఈ స్కీంలో సీనియర్‌ సిటిజన్లకు దీంట్లో 7.6 శాతం వడ్డీరేటు లభించనుంది. మిగిలిన వారికి 7.1 శాతం వడ్డీరేటు ఇవ్వనున్నారు. ఎస్‌బీఐ (SBI) సిబ్బంది, పింఛనుదారులకు ఒక శాతం  వడ్డీరేటు అదనంగా ఇవ్వనున్నారు.

‘భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI)’ రెపోరేటును పెంచుతున్న విషయం తెలిసిందే. అందుకనుగుణంగా బ్యాంకులు సైతం రుణ రేట్లను సవరిస్తున్నాయి. అదే సమయంలో డిపాజిట్‌ రేట్లనూ పెంచుతున్నాయి. ఈ తరుణంలో ఎస్‌బీఐ (SBI) ప్రత్యేక పరిమితకాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (Fixed Deposit) స్కీంను తీసుకురావడం గమనార్హం.

అమృత్‌ కలశ్‌ వివరాలు.. 

  • కాలపరిమితి: 400 రోజులు
  • చివరి తేదీ: ఈ స్కీంను 2023 ఫిబ్రవరి 15న ప్రారంభించారు. ఇది 2023 మార్చి 31 వరకు కొనసాగనుంది. ఆలోపు డిపాజిట్‌ చేసినవారికి మాత్రమే ఈ ప్రత్యేక 7.1 శాతం వడ్డీరేటు లభిస్తుంది.
  • ఎంత వడ్డీ: సీనియర్‌ సిటిజెన్లకు 7.6 శాతం వడ్డీరేటు లభించనుంది. ఈ లెక్కన రూ.1 లక్ష డిపాజిట్‌ చేస్తే 400 రోజులకు రూ.8,600 వడ్డీ వస్తుంది. మిగిలిన వారికి 7.1 శాతం చొప్పున రూ.8,017 వడ్డీ లభిస్తుంది.
  • ఎలా దరఖాస్తు చేసుకోవాలి: ఎస్‌బీఐ శాఖలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎవరికి సరిపోతుంది: స్వల్పకాలిక లక్ష్యంతో మదుపు చేసేవారికి అమృత్‌ కలశ్‌ సరిగ్గా సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. పోస్టాఫీసులో ఏడాది కాలపరిమితితో ఉండే టైం డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ వస్తుందని చెబుతున్నారు.
  • పన్ను: ఆదాయ పన్ను చట్టం ప్రకారం వడ్డీపై ‘మూలం వద్ద పన్ను (TDS)’ కోత ఉంటుంది.
  • రుణ సదుపాయం: అవసరాన్ని బట్టి ముందుగానే డిపాజిట్‌ను ఉపసంహరించుకునే సదుపాయం ఉంది. అలాగే డిపాజిట్‌ చేసిన మొత్తం ఆధారంగా రుణ సదుపాయం కూడా ఉంటుంది.

మరోవైపు ఎస్‌బీఐ ఇటీవలే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధి గల ఎఫ్‌డీలపై 3% నుంచి 7% వరకు వడ్డీని అందిస్తోంది. 2-3 సంవత్సరాల మధ్య కాలానికి ఎఫ్‌డీ చేసిన సీనియర్‌ సిటిజన్లు 7.50% వడ్డీ పొందుతారు. అమృత్‌ కలశ్‌ కాకుండా సీనియర్‌ సిటిజన్లకు ఎస్‌బీఐ అందించే అత్యధిక వడ్డీ రేటు ఇదే. ఈ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వచ్చాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని