SBI ‘అమృత్‌ కలశ్‌’ గడువు పొడిగింపు.. ఎఫ్‌డీ వడ్డీ రేట్ల పెంపు

SBI news: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ‘అమృత్‌ కలశ్‌’ డిపాజిట్‌ పథకం గడువును మరో మూడు నెలలు పొడిగించింది. కొన్ని ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లనూ పెంచింది.

Published : 27 Dec 2023 13:46 IST

SBI latest news | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తన స్పెషల్‌ డిపాజిట్‌ స్కీమ్‌ ‘అమృత్‌ కలశ్‌’ (SBI Amrit Kalash) పథకం గడువును మరోసారి పొడిగించింది. 400 రోజుల కాలవ్యవధితో వస్తున్న ఈ పథకం గడువు డిసెంబర్‌ 31తో ముగియాల్సి ఉండగా.. వచ్చే ఏడాది (2024) మార్చి 31 వరకు పెంచింది. గతంలోనూ ఈ పథకం గడువును పలుమార్లు ఎస్‌బీఐ పొడిగించింది.

ఈ స్కీమ్‌ కింద సీనియర్‌ సిటిజన్లకు 7.6 శాతం, మిగిలిన వారికి 7.1 శాతం వడ్డీరేటు లభిస్తోంది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం వడ్డీపై మూలం వద్ద పన్ను (TDS) కోత ఉంటుంది. ఎస్‌బీఐ శాఖలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.2 కోట్లలోపు మొత్తాలకు ఈ స్కీమ్‌ వర్తిస్తుంది. స్వల్పకాలిక లక్ష్యంతో మదుపు చేసేవారికి అమృత్‌ కలశ్‌ పథకం ప్రయోజనకరం. పైగా డిపాజిట్‌ను ముందుగా ఉపసంహరించుకోవచ్చు. రుణ సదుపాయం కూడా ఉంది.

సినిమా సూపర్‌హిట్‌.. టీవీ అంతంతే

ఎస్‌బీఐ లేటెస్ట్‌ వడ్డీ రేట్లు..

ఇతర ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాల వడ్డీ రేట్లనూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) సవరించింది. రూ.2 కోట్లలోపు డిపాజిట్లపై గరిష్ఠంగా 50 బేసిస్‌ పాయింట్లు మేర పెంచింది. 7 రోజుల నుంచి 45 రోజుల కాల వ్యవధికి 3.5 శాతం వడ్డీ చెల్లించనునున్నారు. గతంలో ఇది 3 శాతంగా ఉండేది. 46 రోజుల నుంచి 179 రోజుల కాలవ్యవధి డిపాజిట్లపై వడ్డీని 25 బేసిస్‌ పాయింట్లు పెంచి 4.75 శాతానికి చేర్చింది. 180 నుంచి 210 డిపాజిట్లపై వడ్డీని 5.25 శాతం నుంచి 5.75 శాతానికి; 211 రోజుల నుంచి ఏడాదిలోపు డిపాజిట్లపై 5.75 శాతం నుంచి 6 శాతానికి పెంచింది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై 6.50 శాతం నుంచి 6.75 శాతానికి పెంచింది. ఇతర వడ్డీ రేట్లను మాత్రం యథాతథంగా కొనసాగించింది. సీనియర్‌ సిటిజన్లకు 50 బేసిస్‌ పాయింట్లు అదనంగా లభిస్తుంది. డిసెంబర్‌ 27 నుంచి సవరించిన వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని