సినిమా సూపర్‌హిట్‌.. టీవీ అంతంతే

మీడియా, వినోద పరిశ్రమకు 2023 సంవత్సరం  మిశ్రమ ఫలితాలను అందించింది. ప్రకటనల పరంగా టీవీ విభాగం ఇంకా పూర్తిగా కోలుకోకపోగా.. సినిమా వసూళ్లు మాత్రం కొత్త గరిష్ఠాలను నమోదుచేశాయి.

Updated : 27 Dec 2023 07:23 IST

2023 ఆదాయంపై అంచనా
టీవీ ప్రకటనల్లో రికవరీ కొంతే
అదరగొట్టిన సినిమా వసూళ్లు

దిల్లీ: మీడియా, వినోద పరిశ్రమకు 2023 సంవత్సరం  మిశ్రమ ఫలితాలను అందించింది. ప్రకటనల పరంగా టీవీ విభాగం ఇంకా పూర్తిగా కోలుకోకపోగా.. సినిమా వసూళ్లు మాత్రం కొత్త గరిష్ఠాలను నమోదుచేశాయి. ఈ ఏడాది ప్రకటనల వ్యయాల వృద్ధి అంతంత  మాత్రంగానే ఉంది. ఇ-కామర్స్‌, గేమింగ్‌ కంపెనీలు వ్యయాలు తగ్గించుకోవడం ఇందుకు కారణం. దీంతోపాటు 2023 క్రికెట్‌ ప్రపంచకప్‌ కోసం, పండగ వ్యయాలను కూడా కంపెనీలు బదిలీ చేయడం వల్లా  ఇతర విభాగాల వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. క్రీడా ప్రకటనల వ్యయాలను మినహాయిస్తే.. టీవీ ప్రకటనల ఆదాయం ఏడాది క్రితంతో పోలిస్తే, 1-2 శాతం తగ్గిందని అంచనా. క్రికెట్‌ ప్రపంచకప్‌ ప్రకటనల ఆదాయం అంచనాలను మించి, 25 శాతం వృద్ధితో దాదాపు రూ.3,000 కోట్లకు చేరింది. అయితే ప్రపంచకప్‌ కారణంగా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సన్‌టీవీ వంటి సంస్థలు ప్రకటనల ఆదాయ పరంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాయని చెబుతున్నారు.

సెప్టెంబరు త్రైమాసికంలో జీ ప్రకటనల ఆదాయం 3.3 శాతం తగ్గి రూ.980 కోట్లకు పరిమితమైంది. సన్‌టీవీ ఆదాయం స్తబ్దుగా ఉంది. పండగల సీజన్‌ వల్ల డిసెంబరు త్రైమాసికంలో ఆదాయం పెరగొచ్చని జీ యాజమాన్యం భావిస్తోంది.

టీవీ ప్రకటనల ఆదాయం

2023లో టీవీ ప్రకటనల ఆదాయాలు 8.9 శాతం వృద్ధి చెంది రూ.36,500 కోట్లకు చేరొచ్చని అంతర్జాతీయ మీడియా పెట్టుబడుల సంస్థ మాగ్నా అభిప్రాయపడింది. 2024లో ఈ ఆదాయం 9.9% వృద్ధితో రూ.40,100 కోట్లకు పెరగొచ్చని భావిస్తున్నారు.

దేశంలో మొత్తం ప్రకటనల ఆదాయం

2022లో దేశీయ మొత్తం ప్రకటనల మార్కెట్‌ 17.4% వృద్ధి చెందగా.. ఈ ఏడాది 11.8 శాతానికి నెమ్మదించింది. 2024లో ప్రకటనల వృద్ధి 11.4% తగ్గే అవకాశం ఉంది. 2023లో రూ.లక్ష కోట్లకు చేరిన భారత ప్రకటనల మార్కెట్‌.. వచ్చే ఏడాది రూ.1.2 లక్షల కోట్లకు చేరొచ్చు.

సినిమా వసూళ్ల జోరు

దేశంలో సినిమా బాక్సాఫీస్‌ మాత్రం రికార్డులు బద్దలు కొట్టింది. 2023 జనవరి నుంచి నవంబరు మధ్య బాక్సాఫీస్‌ వ్యాపారం రూ.10,252 కోట్లుగా నమోదైంది. డిసెంబరులో వచ్చిన యానిమల్‌ సినిమాతో ఈ వసూళ్లు రూ.11,000 కోట్ల మార్కును దాటాయి. దీంతో అత్యధిక సినిమా వసూళ్లు సాధించిన ఏడాదిగా 2023 నిలిచింది. సలార్‌, డంకీ సినిమా వసూళ్లతో కలిపి ఇవి రూ.12,000 కోట్లను అధిగమించే అవకాశం ఉంది. కరోనాతో కుదేలైన బాలీవుడ్‌ పరిశ్రమ ఈ ఏడాది 20% వృద్ధితో రూ.4,700 కోట్ల వసూళ్లు నమోదుచేసింది. 2024లో భారీ బడ్జెట్‌ సినిమాలు తక్కువగా ఉండటంతో ఈ స్థాయి వసూళ్లు ఉండకపోవచ్చని అంటున్నారు. ఈ ఏడాది మే నుంచి నవంబరు మధ్య జరిగిన రచయిత సంఘం సమ్మె వల్ల, వచ్చే ఏడాది విడుదలయ్యే హాలీవుడ్‌ చిత్రాల సంఖ్య తగ్గనుంది.

విలీనాలే కీలకం: జీ- సోనీ విలీనానికి అదనంగా నెల రోజుల గడువు లభించింది. ఈ విలీన సంస్థకు చెందిన టీవీ, ఓటీటీ విభాగాలపై అందరూ దృష్టి పెట్టారు. టీవీ, ఓటీటీ ప్రకటనల విభాగంలో దేశీయంగా ఈ సంస్థకు 65% మార్కెట్‌ వాటా లభించనుంది. ఓటీటీ విభాగంలో మరిన్ని విలీనాలు జరగొచ్చని అంటున్నారు. ఇప్పటికే భారత మీడియా కార్యకలాపాల విలీనానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో డిస్నీ సంస్థకు ఒప్పందం కుదిరినట్లు వార్తలు వచ్చాయి. మీడియా, వినోద రంగంలో ఇది అతిపెద్ద విలీనం కానుంది. 100కు పైగా ఛానెళ్లు, రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో ఇది అతిపెద్ద సంస్థగా అవతరించనుంది. ఓర్మాక్స్‌ గణాంకాల ప్రకారం.. భారత ఓటీటీ వీక్షకుల సంఖ్య 13.5% పెరిగి 48.11 కోట్లకు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని