SBI: రుణాలు, ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్‌బీఐ

ఆర్‌బీఐ రెపోరేటు 25 బేసిస్‌ పాయింట్లు పెంచిన తర్వాత ఎస్‌బీఐ తన రుణాలపై, ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది.

Published : 15 Feb 2023 16:54 IST

దిల్లీ: ఆర్‌బీఐ రెపో రేటును 6.50 శాతానికి (25 బేసిస్‌ పాయింట్ల) పెంచిన తర్వాత.. ఫిబ్రవరి 15 నుంచి MCLR, గృహ రుణ వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) ప్రకటించింది. ఎస్‌బీఐ వెబ్‌సైట్‌ ప్రకారం.. ఒక నెల, 3 నెలలకు MCLR 8% నుంచి 8.10%కు పెంచింది. ఒక సంవత్సరం MCLR 8.50%కు పెంచింది. వాహన, గృహ, వ్యక్తిగత రుణాలు సహా వినియోగదారుల రుణాల్లో ఎక్కువ భాగం MCLRతో ముడిపడి ఉంటాయి. ఎస్‌బీఐ వెబ్‌సైట్‌ ప్రకారం 800 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్‌ స్కోర్‌ ఉన్న వారికి ప్రామాణిక గృహ రుణ వడ్డీ రేటు కనిష్ఠంగా 9.15%గా ఉంది. 750-799 మధ్య క్రెడిట్‌ స్కోరు ఉన్న రుణగ్రహీతలకు వడ్డీ రేటు 9.25% శాతంగా ఉంది. 700-749 మధ్య స్కోరు వారి వడ్డీ రేటు 9.35% శాతంగా ఉంది. 650-699 మధ్య క్రెడిట్‌ స్కోరు వారికి వడ్డీ రేటు 9.45%. మహిళా రుణ గ్రహీతలకు గృహ రుణాలపై 0.05% తగ్గింపు ఉంటుంది.

ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు

రూ.2 కోట్లలోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 25 బీపీఎస్‌ వరకు ఎస్‌బీఐ పెంచింది. అలాగే, బ్యాంకు 400 రోజుల నిర్దిష్ట కాలవ్యవధి ఎఫ్‌డీ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకానికి 7.10% వడ్డీ రేటును అందిస్తోంది. ఈ పథకం 2023 మార్చి 31 వరకు చెల్లుబాటులో ఉంటుంది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధి గల ఎఫ్‌డీలపై 3% నుంచి 7% వరకు వడ్డీని అందిస్తోంది. 2-3 సంవత్సరాల మధ్య కాలానికి ఎఫ్‌డీ చేసిన సీనియర్‌ సిటిజన్లు 7.50% వడ్డీ పొందుతారు. సీనియర్‌ సిటిజన్లకు ఎస్‌బీఐ అందించే అత్యధిక వడ్డీ రేటు ఇదే. ఈ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని