Home Loan Insurance: గృహ రుణ బీమాను కొనుగోలు చేయాలా.. వద్దా?

గృహ రుణం పొందేవారు గృహ బీమా తీసుకోవడం తప్పనిసరి అని బ్యాంకులు చెబుతుంటాయి. గృహ రుణ బీమా తీసుకోవడం మంచిదా?కాదా? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

Published : 31 May 2024 16:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం మదుపు చేసి ఇంటిని కొనుగోలు చేయడం అనే పరిస్థితి దాదాపుగా కనిపించడం లేదు. నేటి జనాభాలో చాలా మంది వారి కలల ఇంటిని కొనుగోలు చేయడానికి గృహ రుణాలను తీసుకుంటున్నారు. వ్యక్తులకు ఆర్థిక పరిస్థితులు బాగా అనుకూలించడంతో ఇంటి కోసం రుణాలు తీసుకునేవారు గతంలో కంటే ఇప్పుడు చాలా పెరిగారు. అయితే, ఇంటి రుణం అనేది దీర్ఘకాలిక ఆర్థిక బాధ్యత. రుణగ్రహీత రుణ వ్యవధిలోపు తిరిగి చెల్లించవలసి ఉంటుంది. రుణగ్రహీత మరణం, ఉద్యోగం కోల్పోవడం వంటి ఊహించని పరిస్థితుల కారణంగా ఈఎంఐలను చెల్లించకపోతే ఇంటిని స్వాధీనం చేసుకునే హక్కు బ్యాంకుకు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి గృహ రుణ బీమా కాపాడుతుందా లేదా అనేది ఇక్కడ తెలుసుకుందాం.

గృహ రుణ బీమా

ఇంటిని కొనుగోలు చేయడం అనేది ఒక ముఖ్యమైన ఆర్థిక మైలురాయి. నిధులను ఏర్పాటు చేయడానికి, గృహ రుణంపై శ్రద్ధ వహించడానికి చాలా ఓపిక, కృషి అవసరం. కొన్ని బ్యాంకులు గృహ రుణ బీమాను ఆప్షన్‌గా ఇస్తాయి. మరికొన్ని తప్పనిసరి అంటుంటాయి. అయితే, RBI నిబంధనల ప్రకారం గృహ రుణ బీమా తప్పనిసరి కాదు. ఈ విషయాన్ని మీరు బ్యాంకుకు తెలపొచ్చు. గృహ రుణ బీమాను తీసుకునేటప్పుడు పాలసీకి సంబంధించిన నిబంధనలు, షరతులను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. కవరేజీని ప్రభావితం చేసే మినహాయింపులు, పరిమితుల గురించి తెలుసుకోండి. వినియోగదారులు తమకు కావాల్సిన బీమా కంపెనీ నుంచి ఏదైనా గృహ బీమా పాలసీని ఎంచుకోవచ్చు.

బీమా అవసరం

ఇల్లు కొనడం అనేది భారీ, దీర్ఘకాలిక పెట్టుబడి. 20-30 సంవత్సరాల కాలంలో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అందుచేత గృహ రుణ బీమా పొందడం ద్వారా మీ పెట్టుబడిని, కుటుంబాన్ని ఆర్థికంగా రక్షించుకోవచ్చు. అందువల్ల అనిశ్చిత భవిష్యత్‌ కోసం సిద్ధంగా ఉండడం చాలా మంచిది. గృహ రుణ బీమాను.. తనఖా బీమా లేదా హోమ్‌ లోన్‌ ప్రొటెక్షన్‌ ప్లాన్‌ అని కూడా పిలుస్తారు. ఇది రుణ వ్యవధిలో దురదృష్టవశాత్తు రుణగ్రహీత మరణించిన సందర్భంలో అతడి కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించడానికి రూపొందించారు. బాకీ ఉన్న ఇంటి రుణ భారం పూర్తిగా మిగతా కుటుంబ సభ్యులపై పడకుండా చూసుకోవడమే దీని ప్రాథమిక ఉద్దేశం. గృహ రుణ బీమాతో బకాయి ఉన్న రుణ మొత్తం సెటిల్‌ అవుతుంది. బీమా సంస్థ నేరుగా బ్యాంకుకు బకాయి మొత్తాన్ని చెల్లిస్తుంది. రుణగ్రహీతలు ఇంటి రుణ బీమాకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను తెలుసుకోవాలి.

బీమా పునఃపరిశీలన

రుణగ్రహీత ఇప్పటికే గణనీయమైన తగిన జీవిత బీమా పాలసీని కలిగి ఉన్నట్లయితే.. ఈ పాలసీను బ్యాంకుకు చూపించవచ్చు. ఇటువంటి సందర్భాల్లో మీ ప్రస్తుత కవరేజీ.. బకాయి ఉన్న రుణ మొత్తానికి తగిన విధంగా సరిపోతుందో లేదో అంచనా వేయాలి. అంతేకాకుండా రుణం స్వల్ప కాలవ్యవధికి ఎంచుకుంటే.. బకాయి మొత్తం వేగంగా తగ్గుతుంది. అటువంటి సందర్భాల్లో, గృహ రుణ బీమా అవసరం తక్కువగా ఉండొచ్చు. రుణ దరఖాస్తుదారుడు ఇప్పటికే టర్మ్‌ బీమా ప్లాన్‌ను కలిగి ఉన్నట్లయితే దాన్ని ఇంటి రుణంతో సమానమైన మొత్తంతో టాప్‌ అప్‌ చేయడం మేలు. ఇంకా, రుణ మొత్తాన్ని కవర్‌ చేయగల ఆర్థిక సామర్థ్యం ఉన్న పొదుపులను కలిగి ఉంటే, గృహ రుణ బీమా అవసరాన్ని పునఃపరిశీలించవచ్చు.

ప్రీమియం

మీ బడ్జెట్‌కు అనుగుణంగా ఉండేలా వివిధ బీమా ప్లాన్స్‌ను సరిపోల్చండి. సాధారణంగా ఇందులో ఒకేసారి ప్రీమియం మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. మీరు బ్యాంకును ఈ మొత్తాన్ని రుణంతో కలిపి నెలవారీ EMI ద్వారా చెల్లిస్తామని కోరవచ్చు.

యాడ్‌-ఆన్‌లు

అనేక గృహ రుణ బీమా సంస్థలు తమ పాలసీదారుడి ప్రయోజనాలను మెరుగుపరచడానికి ఐచ్ఛిక రైడర్‌ ప్లాన్స్‌తో బీమా పథకాలను అందిస్తున్నాయి. అదనపు ఖర్చుతో అదనపు కవరేజీ కోసం యాడ్‌-ఆన్స్‌ (రైడర్స్‌) గృహ రుణ బీమాకు జోడించవచ్చు. అదనపు కవరేజీ వల్ల పాలసీదారుడికి మరింత ఆర్థిక రక్షణ చేకూరుతుంది. ఉదాహరణకు అత్యవసర వైద్య పరిస్థితులు, తీవ్రమైన అనారోగ్యం, వైకల్యం, ప్రమదవశాత్తు మరణం లేదా ఉద్యోగం కోల్పోవడం వంటి సందర్భాల్లో ఆర్థిక రక్షణ ఉంటుంది.

పన్ను ప్రయోజనాలు

ఇతర సాధారణ బీమాల మాదిరిగానే గృహ రుణ బీమా.. రుణగ్రహీతకు, 1961 ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. ప్రీమియం చెల్లింపులపై రూ.1.50 లక్షల వరకు మినహాయింపులుంటాయి. ఇంటి రుణ ఈఎంఐలోనే బీమా మొత్తాన్ని కలిపి చెల్లిస్తే దానికి పన్ను ప్రయోజనం వర్తించదు.

చివరిగా: గృహ రుణ బీమాను కొనుగోలు చేయాలనే నిర్ణయం మీ వ్యక్తిగత పరిస్థితులు, ఆర్థిక స్థితి, రిస్క్‌ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు