Home Loan: రెండో హోమ్‌ లోన్‌.. ఆర్థికంగా సిద్ధంగా ఉన్నారా?

Home Loan: వివిధ పెట్టుబడి మార్గాల్లో భాగంగా కొంత మంది రెండో ఇల్లును కొంటుంటారు. అందుకోసం మళ్లీ హోమ్‌ లోన్‌ తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. మరి అందుకు ఆర్థికంగా సంసిద్ధంగా ఉన్నారా? లేదా? సమీక్షించుకోవాలి.

Updated : 10 Jan 2024 16:49 IST

Home Loan | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థిక లక్ష్యాల్లో భాగంగా అనేక మార్గాల్లో పెట్టుబడి పెడుతుంటారు. చాలా మంది ఇళ్లను కూడా ఆదాయ మార్గంగా చూస్తారు. అద్దె రూపంలో లేదా ధర పెరిగిన తర్వాత అమ్మి డబ్బు ఆర్జిస్తారు. ఈ క్రమంలో కొంత మంది రెండోసారి గృహ రుణం (Home Loan) తీసుకునేందుకు సిద్ధపడతారు. అలాంటప్పుడు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి? రెండోసారి రుణం తీసుకోవడం సరైన నిర్ణయమేనా? చూద్దాం..

రెండో ఇల్లు కొనాలనుకోవడం జీవితంలో కీలక నిర్ణయం. దీనికోసం కచ్చితమైన ప్రణాళికతో ముందుకెళ్లాలి. ఆర్థిక సంసిద్ధతను సమీక్షించుకోవాలి. ఎందుకు కొంటున్నారు? ఖర్చులు, ఆదాయం.. వంటి విషయాల్లో స్పష్టమైన అవగాహన ఉండాలి. ఆర్థిక లక్ష్యాలు, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా మీ నిర్ణయం ఉండాలి.

అవసరం ఏంటి?

రెండోసారి గృహ రుణం (Home Loan) తీసుకోవాలనే నిర్ణయం వెనుక అవసరం ఏంటో సమీక్షించుకోవాలి. మీ లక్ష్యం స్పష్టంగా ఉండాలి. రెండో ఇల్లును అద్దె ఆదాయం కోసం కొంటున్నారా? లేదా ధర పెరిగిన తర్వాత విక్రయించి సొమ్ము చేసుకుంటారా? సెలవుల్లో సరదాగా గడపడానికి వాడుకోవాలనుకుంటున్నారా? కుటుంబం పెద్దదవుతున్న నేపథ్యంలో అవసరాలకు అనుగుణంగా తీసుకుంటున్నారా? అనే అంశంపై స్పష్టత ఉండాలి. అందుకు అనుగుణంగా ప్లాన్‌ చేసుకోవాలి.

ఆర్థిక సంసిద్ధత..

రెండోసారి గృహ రుణం (Home Loan) తీసుకోవడం వల్ల ఆర్థికంగా అనేక పర్యవసానాలు ఉంటాయి. అందుకే ఈ ప్రశ్నలు మీకు మీరే సంధించుకొని సమీక్షించుకోవాలి.

  • ఇప్పటికే ఉన్న రుణాలను ఎంత వరకు తీర్చారు? ఇంకా ఎంత బకాయి ఉంది? వాటిని తీర్చేందుకు ఆదాయ వనరులేంటి?
  • స్థిరమైన ఆదాయ మార్గం ఉందా? కొత్త రుణాన్ని చెల్లించేందుకు అది సరిపోతుందా?
  • డౌన్‌పేమెంట్‌ కోసం కావాల్సిన డబ్బు చేతిలో ఉందా? రుణం తీసుకునే సమయంలో అనుకోకుండా ఏమైనా అదనపు రుసుములు చెల్లించాల్సి వస్తే భరించే సామర్థ్యం ఉందా?
  • రెండోసారి హోమ్‌ లోన్‌ తీసుకునేందుకు కావాల్సిన అర్హతలు ఉన్నాయా?

రుణ రేటు, గడువు..

రుణ గడువు, వడ్డీరేటుపై ప్రధానంగా దృష్టి సారించాలి. సమంజసంగా ఉంటేనే ముందుకెళ్లాలి. ఈ రెండే రుణం తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వివిధ బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలను సంప్రదించాలి. ఏవి మెరుగైన షరతులతో రుణాన్ని ఇస్తాయో చూడాలి. పేరున్న సంస్థల్ని ఎంచుకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు ఉండకపోవచ్చు! రెండోసారి గృహ రుణం (Home Loan) తీసుకోవడం వల్ల పన్నుల విషయంలో ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో చూసుకోవాలి.

ఎక్కడ తీసుకుంటున్నారు?

రెండో ఇంటిని తీసుకునేటప్పుడు అది ఏ ప్రాంతంలో ఉందనేది చాలా కీలకం. చుట్టూ సరైన వసతులు ఉంటేనే ప్రయోజనకరం. అప్పుడే అద్దె ఆదాయానికి ఢోకా ఉండదు. భవిష్యత్‌లో అమ్మినా మంచి ధర పలుకుతుంది. లేదంటే ఆర్థిక భారంగా పరిణమిస్తుంది.

ఇబ్బందులకూ సిద్ధంగా ఉండాలి..

ఎంత పక్కాగా ముందుకెళ్లినా.. ప్రత్యామ్నాయ ప్రణాళికలూ ఉండాల్సిందే. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఊహించని పరిణామాల వల్ల భవిష్యత్‌లో ఆదాయ మార్గాలు తగ్గిపోవచ్చు. అప్పుడు రుణం తిరిగి చెల్లించడం కష్టమైపోతుంది. లేదా చట్టపరంగా ఏమైనా చిక్కులు రావొచ్చు. కొత్త ఇంటి నిర్వహణకూ ఖర్చులుంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని