Fixed Deposits: పెద్ద మొత్తంలో ఎఫ్‌డీ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి..

ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులే కాకుండా అనేక ప్రైవేట్‌ బ్యాంకులు కూడా నిర్వహణనలో ఉన్నాయి. ఇందులో అధిక మొత్తంలో డిపాజిట్లు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏవేవి చూడాలో ఇక్కడ ఉంది.

Published : 23 May 2023 16:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం చాలా బ్యాంకులు.. ముఖ్యంగా ప్రైవేట్‌ బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నాయి. ఆర్బీఐ రెపోరేట్లు పెంచినప్పటి నుంచి కొన్ని ప్రైవేట్‌, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు దాదాపు 9.50% వరకు వడ్డీ రేట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. చాలా మందికి అన్ని బ్యాంకుల్లో డిపాజిట్లు సురక్షితమేనా అని అనుమానాలు వస్తుంటాయి. అన్ని బ్యాంకులు ఆర్‌బీఐ నియంత్రణలో ఉన్నప్పటికీ సొమ్ము భద్రతకు ఎలాంటీ హామీ ఇవ్వలేదు. డిపాజిటర్లు, ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో డిపాజిట్‌ చేసేవారు పెట్టుబడి పెట్టే ముందు భద్రతా అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం మంచిది. బ్యాంకుల నిర్మాణం, పరిధి, ఆర్థిక బలాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అధిక మొత్తాలను డిపాజిట్‌ చేసేవారు బ్యాంకుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూడండి.

మల్టీపుల్‌ ఖాతాలు

ఎఫ్‌డీ పూర్తిగా డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (DICGC) కింద రూ.5 లక్షల బీమా కవర్‌ పరిధిలో ఉండే విధంగా చూసుకోవాలి. ఇందులో అసలు, వడ్డీ రెండూ ఉంటాయి. క్యుములేటివ్‌ ఎఫ్‌డీ అయితే, మెచ్యూరిటీ మొత్తం రూ.5 లక్షలకు మించకుండా చూసుకోవాలి. కుటుంబంలో ఎక్కువ మంది పేర్ల మీద ఎఫ్‌డీలు తీసుకోవచ్చు. ఉదా: ఒకరిపై రూ.25 లక్షలు కాకుండా ఐదుగురు కుటుంబ సభ్యులు ఉంటే ఒక్కొక్కరి పేరు మీద రూ.5 లక్షలు డిపాజిట్‌ చేయడం మంచిది. ఒక్కరి పేరు మీదే అయితే, అయిదు వేరు వేరు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం మంచిది.

క్యాపిటల్‌ అడిక్వసీ రేషియో (CAR)

బ్యాంకు యజమాన్యం అధిక నిష్పత్తిలో బ్యాంకులో నిధులను కలిగి ఉంటుంది. ఏదైనా ప్రతికూల పరిస్థితి ఏర్పడినప్పుడు తట్టుకునేంత బలంగా బ్యాంకు యాజమాన్యం ఉంటుంది. బ్యాంకులో నష్టం సంభవించినప్పుడు డిపాజిటర్ల డబ్బు సురక్షితంగా ఉంచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. యాజమాన్య అధిక మూలధన స్థాయిలు బ్యాంకు బలాన్ని పెంచుతాయి. ఆర్‌బీఐ ఆపరేటింగ్‌ మార్గదర్శకాల ప్రకారం కనీసం 7.50-15% క్యాపిటల్‌ అడిక్వసీ రేషియో (CAR)ను నిర్వహించాలి.

లిక్విడిటీ కవరేజ్‌ రేషియో (LCR)

దీని ద్వారా స్వల్పకాలంలో ఎదురయ్యే లిక్వడిటీ సమస్యలను బ్యాంకులు సమర్థంగా ఎదుర్కొంటాయి. ఆర్‌బీఐ ప్రకారం.. బ్యాంకులు 100% LCRను కలిగి ఉండాలి. అధిక LCR బ్యాంకుకు ఎక్కువ స్థిరత్వాన్ని ఇస్తుంది. బ్యాంకుకు సంబంధించిన ఇతర వనరులకు అంతరాయం కలిగించకుండా స్వల్పకాలిక నిధుల ప్రవాహాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. బ్యాంకుకు తక్కువ LCR ఉండడమేనేది బ్యాంకు దుర్బలత్వాన్ని సూచిస్తుంది. ఇటువంటి బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్‌ చేయకపోవడమే మంచిది.

నికర స్థిర నిధుల నిష్పత్తి (NSFR)

బ్యాంకులు తమ కార్యకలాపాలకు మరింత స్థిరమైన నిధి వనరులను కలిగి ఉండాలని ‘NSFR’ (నెట్‌ స్టేబుల్‌ ఫండ్స్‌ రేషియో) ప్రవేశపెట్టింది. 2021 అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు తప్పనిసరిగా కనీసం 100% NSFRను కలిగి ఉండాలి.

CASA రేషియో

కరెంట్‌ అకౌంట్‌, సేవింగ్‌ అకౌంట్‌ (CASA) రేషియో, బ్యాంకు మొత్తం డిపాజిట్లలో కరెంట్‌, సేవింగ్స్‌ ఖాతా డిపాజిట్ల వాటాను చూపే నిష్పత్తి. ఈ ఖాతా డిపాజిట్లలో నిధులు బ్యాంకుకు చౌకగా లభించే నిధి వనరులు. ఎందుకంటే బ్యాంకులు ఈ ఖాతాలపై ఎక్కువ వడ్డీని చెల్లించవు. వీటిపై వడ్డీ రేట్లను కూడా ఆర్‌బీఐ నియంత్రిస్తుంది. అధిక ‘CASA’ నిష్పత్తి అంటే బ్యాంకు తక్కువ ఖర్చుతో కూడిన నిధులతో అధిక లాభదాయకతను కలిగి ఉంటుంది. 40% లేదా అంతకంటే ఎక్కువ ‘CASA’ నిష్పత్తి గల బ్యాంకును అనుకూలమైనదిగా పరిగణించొచ్చు.

నాన్‌-పెర్ఫార్మింగ్‌ అసెట్‌ (NPA)

బ్యాంకులు ప్రధానంగా రుణాలిచ్చే వ్యాపారంలో ఉంటాయి. రుణం/క్రెడిట్‌ లైన్‌ ద్వారా బ్యాంకు ఆదాయాన్ని పొందుతుంది. అయితే, రుణంపై 90 రోజుల వరకు వడ్డీ/అసలు చెల్లింపులు లేకపోతే, అది పని చేయనిది (NPA)గా మారుతుంది. అధిక NPA నిష్పత్తి ఉంటే.. బ్యాంకు తన రుణాలను వసూలు చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటోందని, భవిష్యత్‌లో నష్టాలు కూడా చూడవచ్చని అర్థం. డిపాజిట్‌దారులు ఇటువంటి బ్యాంకులకు దూరంగా ఉండాలి.

రుణ వైవిధ్యం

మరోవైపు బ్యాంకుకు వైవిధ్యభరితమైన రుణాల బేస్‌ ఉంటే.. అది తక్కువ రిస్క్‌గా పరిగణించొచ్చు. బ్యాంకులు ఒకే సంస్థకు, ఒకే రంగానికి అధిక మొత్తంలో రుణాలు ఇవ్వకుండా, సాధ్యమైనన్ని ఎక్కువ సంస్థలకు, వివిధ రంగాలకు రుణాలు ఇవ్వడం వల్ల రుణ పోర్ట్‌ఫోలియో బాగా విస్తరించి వైవిధ్యభరితంగా ఉంటుంది. ఇది క్రెడిట్‌ రిస్క్‌ను తగ్గిస్తుంది. బ్యాంకుల త్రైమాసిక నివేదికలను చెక్‌ చేసి, రుణ వైవిధ్యతను తెలుసుకోవచ్చు. ఇటువంటి బ్యాంకుల భవిష్యత్తు వృద్ధి స్థిరంగా ఉండే అవకాశం ఉంది.

ఆర్థిక నివేదికలు

బ్యాంకు తన ఆర్థిక, ఇతర నివేదికలను షేర్‌ చేసే ప్రక్రియను ఆలస్యం చేస్తుంటే లేదా సమాచారాన్ని తెలపడానికి సంకోచిస్తునట్లు కనిపిస్తే, బ్యాంక్‌ ఆర్థిక పరిస్థితి అనుమానాస్పదంగా ఉన్నట్లే. కొన్ని ప్రైవేటు బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు వారి త్రైమాసిక ఆర్థిక నివేదికలను వారి వెబ్‌సైట్‌లో తెలుపవు. ఇది అనుమానాస్పదంగా ఉంటుంది. అందుచేత అధిక మొత్తంలో డిపాజిట్లు చేసేవారు క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీల నివేదికలను కూడా చూడాలి.

చివరిగా: అధిక మొత్తంలో డిపాజిట్లు చేసేటప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకులను చాలా మంది నమ్ముతుంటారు. పైన చెప్పిన పాయింట్లను కూడా పరిగణనలోకి తీసుకోరు. దీనికి బలమైన కారణమేమిటంటే అవి నష్టాల్లో జారుకున్నప్పుడు ప్రభుత్వ మద్దతు ఉంటుంది. ఇప్పటి దాకా ప్రభుత్వ బ్యాంకులు నష్టాల్లో ఉన్నప్పుడు వేరే బ్యాంకులో విలీనం చేశారు గానీ, ఏ ప్రభుత్వ రంగ బ్యాంకునూ మూసివేయలేదు. అయితే, ఇలాంటి మద్దతు స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులకు, సహకార బ్యాంకులకు ఉండకపోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు