గృహ రుణం... తొందరగా తీరాలంటే..

గృహరుణం వడ్డీ రేట్లు 9 శాతం దరిదాపుల్లోకి వచ్చేశాయి. మరోసారి కీలక వడ్డీ రేటు పెరిగే అవకాశం ఉందనే సూచనలూ ఉన్నాయి. దీంతో ఇంటిరుణం భారం అవుతోంది.

Published : 03 Mar 2023 01:10 IST

గృహరుణం వడ్డీ రేట్లు 9 శాతం దరిదాపుల్లోకి వచ్చేశాయి. మరోసారి కీలక వడ్డీ రేటు పెరిగే అవకాశం ఉందనే సూచనలూ ఉన్నాయి. దీంతో ఇంటిరుణం భారం అవుతోంది. దీనికి రుణగ్రహీతలు సిద్ధంగా ఉండాల్సిందే. తమ పొదుపు, పెట్టుబడి, రుణాలను తీర్చే ప్రణాళికలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా దీర్ఘకాలం కొనసాగే గృహరుణాన్ని వీలైనంత తొందరగా వదిలించుకునేందుకు ప్రయత్నించాలి. దీనికోసం ఏం చేయాలో తెలుసుకుందాం.

రెపో రేటు పెరగడం, తద్వారా దీనికి అనుసంధానమైన రెపో ఆధారిత గృహరుణ వడ్డీ రేట్లు అధికం అవుతుండటం చూస్తూనే ఉన్నాం. వాస్తవంగా తీసుకున్న వ్యవధికి మించి కొన్నేళ్లు అధికంగా రుణ వాయిదాలు చెల్లించాల్సి వస్తోంది. గృహరుణం 20, 25 ఏళ్లు కొనసాగే ఒక దీర్ఘకాలిక అప్పు. ఈ వ్యవధిలో ఎన్నోసార్లు వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ఇప్పుడు పెరుగుతున్న వడ్డీ రేట్లతో కొత్తగా రుణం తీసుకునే వారికి ఈఎంఐ భారం అవుతుంది. ఇప్పటికే రుణం తీసుకున్న వారికి వాయిదా మొత్తంలో మార్పు ఉండదు. వ్యవధి మాత్రం ఏళ్లకు ఏళ్లు పెరుగుతుంది. కాబట్టి, నిర్ణయించుకున్న వ్యవధిలోపే ఈ రుణాన్ని తీర్చేందుకు ప్రయత్నించాలి.

అవసరం ఉంటేనే..

తక్కువ వడ్డీకి లభించే అప్పుల్లో గృహరుణం ఒకటి. ఈఎంఐ ఎంత చెల్లించగలరో చూసుకొని, ఆ మేరకు అప్పు తీసుకుంటారు చాలామంది. నిజానికి మీకు ఎంత అవసరం ఉందన్నది చూసుకొని, అంత వరకే తీసుకోవడం మేలు. అధిక మొత్తంలో రుణం తీసుకుంటే తక్కువ వడ్డీ ఉన్నప్పుడు ఇబ్బందేమీ ఉండదు. కానీ, వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పుడు చిక్కులు వస్తాయి. మీ చేతిలో ఉన్న డబ్బును తక్కువ వడ్డీ ఇచ్చే పథకాల్లో మదుపు చేసి, మీరు రుణం తీసుకోవడం మంచిది కాదు. ఒకటికి రెండుసార్లు అన్ని లెక్కలూ వేసుకున్నాకే ఎంత మొత్తం తీసుకోవాలన్నది నిర్ణయించుకోవాలి. దీనివల్ల రుణం మీరు అనుకున్న వ్యవధిలోపే తీరేందుకు వీలవుతుంది.

వాయిదా పెంచితే..

గృహరుణం తీసుకున్నప్పటి ఆదాయంతో పోలిస్తే.. ఇప్పుడు అధికంగా ఆర్జిస్తూ ఉండొచ్చు. దీనికి అనుగుణంగా మీ ఈఎంఐని పెంచుకునేందుకు ప్రయత్నించండి. దీనివల్ల వడ్డీ భారాన్ని కొంత మేరకు తగ్గించుకునే వీలుంది. ఏడాదికి కనీసం 5 నుంచి 10 శాతం చొప్పున ఈఎంఐని పెంచుకుంటూ వెళ్లడం వల్ల తొందరగా రుణం తీరేందుకు అవకాశం ఉంటుంది.

అసలు చెల్లించండి

బోనస్‌ల్లాంటివి వచ్చినప్పుడు, ఇతర అనుకోని ఆదాయాలు లభించినప్పుడు వాటిని ఇంటి అప్పు తీర్చేందుకు వాడుకోవచ్చు. ప్రస్తుతం గృహరుణాలన్నీ దాదాపు 9 శాతం దగ్గరకు వచ్చాయి. డిపాజిట్లపై రాబడి ఈ స్థాయిలో రావడం లేదు. కాబట్టి, తక్కువ వడ్డీకి డిపాజిట్‌ చేసే బదులు ఆ మొత్తాలను రుణానికి చెల్లించడమే ఉత్తమం. ఉదాహరణకు.. మీ గృహరుణంపై వార్షిక వడ్డీ 8.55 శాతం అనుకుందాం. బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 7 శాతం రాబడి వస్తుందనుకుందాం. 20 శాతం పన్ను శ్లాబులో ఉంటే నికర వార్షిక రాబడి 5.6 శాతం మాత్రమే. అందువల్ల గృహరుణానికి ఆ డబ్బును చెల్లించడమే లాభం. ఏడాదికి కనీసం 4 ఈఎంఐలు అదనంగా లేదా అసలులో 5-10 శాతం చెల్లించేందుకు ప్రయత్నించండి.

బ్యాంకు మార్చుకుంటే..

అధిక వడ్డీ వసూలు చేసే బ్యాంకు నుంచి తక్కువ వడ్డీ ఉన్న చోటకు మారేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడున్న బ్యాంకు.. కొత్త బ్యాంకుల మధ్య వడ్డీ రేటు కనీసం అర శాతం తేడా ఉండాలి. పరిశీలనా రుసుములు, ఇతర ఖర్చులు అన్నీ  చూసుకోవాలి. అప్పటికీ మీకు లాభం ఉంటుంది అని అనిపిస్తేనే కొత్త సంస్థకు మారాలి. క్రెడిట్‌ స్కోరు  పెరగడం, ఆదాయంలో వృద్ధి తదితర కారణాలతో మీకు వడ్డీని తగ్గించే అవకాశం ఏదైనా ఉందా అని  మీ బ్యాంకుతో చర్చించండి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని