గృహరుణం... తొందరగా తీరాలంటే...

గత ఏడాది కాలంలో రెపో రేటు పెంపుతో గృహరుణాల వడ్డీ ఒక్కసారిగా పెరిగిపోయింది. చాలామంది తాము పదవీ విరమణ చేసిన తర్వాతా రుణానికి వాయిదాలు చెల్లించాల్సిన పరిస్థితిలో ఉన్నారు.

Updated : 23 Feb 2024 11:19 IST

గత ఏడాది కాలంలో రెపో రేటు పెంపుతో గృహరుణాల వడ్డీ ఒక్కసారిగా పెరిగిపోయింది. చాలామంది తాము పదవీ విరమణ చేసిన తర్వాతా రుణానికి వాయిదాలు చెల్లించాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఈసారి ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచకపోవడంతో రుణ గ్రహీతలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి అప్పును వేగంగా తీర్చేందుకు ఏం చేయాలో చూద్దాం.

దీర్ఘకాలిక రుణాలను తీసుకున్నప్పుడు అనేక ఆర్థిక లక్ష్యాల విషయంలో రాజీ పడాల్సి వస్తుంది. వడ్డీ అధికంగా చెల్లించాల్సి రావడం, ఇతర పెట్టుబడులకు కావాల్సినంత డబ్బు అందుబాటులో ఉండకపోవడం లాంటి ప్రతికూలతలు ఉంటాయి. పదవీ విరమణ తదితర ముఖ్యమైన లక్ష్యాలకూ విఘాతం కలుగుతుంది. కాబట్టి, వీలైనంత తొందరగా ఈ రుణాన్ని వదిలించుకునే ప్రయత్నం చేయాల్సిందే.
* తెలుసుకోండి: మీరు గృహరుణం ఎప్పుడు తీసుకున్నారు? అప్పుడు వడ్డీ రేటు ఎంత? ఇప్పుడు ఎంతుంది? ఇంకా ఎన్నాళ్లు చెల్లించాలి? ముందుగా మీ రుణ సంస్థను సంప్రదించి, ఈ వివరాలన్నీ తెలుసుకోండి. అప్పుడే అప్పు తీర్చే విషయంలో మీకో స్పష్టమైన అవగాహన వస్తుంది.
* ఆర్థిక పరిస్థితి: మీ రుణాన్ని వేగంగా చెల్లించేందుకు మీ ఆర్థిక పరిస్థితి ఎంత మేరకు సహకరిస్తుందో సమీక్షించుకోండి. మీ ఖర్చులు, పెట్టుబడులు పోను మిగులు మొత్తం అధికంగా ఉన్నట్లు అనిపిస్తే.. దాన్ని రుణం తీర్చేందుకు
వినియోగించండి.
*చర్చించండి: మీరు చెల్లిస్తున్న వడ్డీ ఎంత? ఇంకా తగ్గేందుకు అవకాశం ఏమైనా ఉందా? అనే వివరాలను బ్యాంకుతో చర్చించండి. ఏదైనా బ్యాంకు తక్కువ వడ్డీ రేటుకు రుణాన్ని ఇస్తానంటే అక్కడికి మారేందుకు ప్రయత్నించొచ్చు. కనీసం ఒక శాతం వ్యత్యాసం ఉన్నప్పుడే ఇది మేలు.
*పాక్షిక చెల్లింపు: కేవలం ఏడాదికి 12 వాయిదాలే చెల్లిస్తే రుణం తొందరగా తీరదు. కాబట్టి, అసలులో కొంత మొత్తం చెల్లించేందుకు ప్రయత్నించాలి. దీనివల్ల రుణం వ్యవధి దిగి వస్తుంది. వడ్డీ భారమూ తగ్గుతుంది. దీనివల్ల మీ ఇతర లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టేందుకు వీలవుతుంది. బాకీ ఉన్న రుణ మొత్తంలో ఏటా 5 శాతం చెల్లిస్తే.. 20 ఏళ్ల వ్యవధి ఉన్న రుణం 12 ఏళ్లకు తగ్గుతుంది. ఏటా ఒక ఈఎంఐ అదనంగా చెల్లించడం ద్వారా మూడేళ్ల ముందే రుణం తీరుతుంది. ఒకవేళ ఏటా ఈఎంఐని 5 శాతం పెంచుకుంటే.. రుణాన్ని 13 ఏళ్లలోనే పూర్తి చేయొచ్చు.  
* ఖర్చులను తగ్గించుకుంటూ..: అనవసర ఖర్చులను తగ్గించుకొని, పొదుపును పెంచుకోండి. దీనివల్ల రుణాల చెల్లింపుపై దృష్టి సారించేందుకు వీలవుతుంది.
* రీఫైనాన్స్‌ చేయండి: రుణాన్ని రీఫైనాన్స్‌ చేయడం వల్ల వడ్డీ రేటు తగ్గడం లేదా ఈఎంఐ భారం తగ్గే అవకాశాలున్నాయి. ఒకసారి బ్యాంకును సంప్రదించి, ఈ అవకాశం ఉందా అనేది తెలుసుకోండి. మీ క్రెడిట్‌ స్కోరు, ఆదాయం తదితరాలను బట్టి, రీఫైనాన్సింగ్‌ చేసే విషయాన్ని బ్యాంకులు పరిశీలిస్తాయి. ఈఎంఐ తగ్గితే, ఇతర పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించాలి. రీఫైనాన్సింగ్‌కు ముందు వర్తించే ఫీజుల గురించి తెలుసుకోండి.
ఒకే అప్పుగా: మీకు అనేక రుణాలు ఉంటే.. వాటిని నిర్వహించడం కష్టం కావచ్చు. సాధ్యమైనంత మేరకు రుణాలను ఏకీకృతం చేసేందుకు ప్రయత్నించండి. వడ్డీ అధికంగా ఉన్న వ్యక్తిగత, క్రెడిట్‌ కార్డు రుణాలను తీర్చేందుకు ప్రయత్నించండి.
* తక్కువ వడ్డీ వస్తుంటే: కొంతమంది అధిక వడ్డీకి రుణాలు తీసుకొని, తమ వద్ద ఉన్న డబ్బును తక్కువ వడ్డీ వచ్చే డిపాజిట్లలో జమ చేస్తుంటారు. ఇది మంచిది కాదు. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకొని, మిగతా మొత్తాన్ని రుణాన్ని చెల్లించేందుకు వాడుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని