Home Loan: ఇంటి రుణం బదిలీ.. ఇవి చూశాకే

ఇంటి రుణం తీసుకున్న తర్వాత, వేరే బ్యాంకుల్లో వడ్డీ రేట్లలో మరింత రాయితీలు ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో రుణాన్ని వేరే బ్యాంకుకు బదిలీ చేయొచ్చు.

Published : 16 Jun 2023 17:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంటిని కొనుగోలు చేయడానికి రుణం (Home loan) తీసుకోవడం ఇప్పుడు సాధారణ విషయమైపోయింది. ఇల్లు కొనుగోలుకు అధిక మొత్తంలో డబ్బు అవసరం పడడం, రుణాలు కూడా సరసమైన వడ్డీ రేట్లకు లభించడం వల్ల చాలా మంది కొనుగోలుదారులు ఇంటి రుణాలపై ఆసక్తి చూపుతున్నారు. రుణగ్రహీతలలో కొంత మంది రుణం కొనసాగుతుండగానే మధ్యలో వేరే రుణ సంస్థ (బ్యాంకు)కు మారుతూ (Home loan Transfer) ఉంటారు. అంటే వేరే బ్యాంకుకు తమ రుణాన్ని బదిలీ చేస్తారు. కొన్ని బ్యాంకులు రుణానికి వడ్డీ తగ్గింపులతో పాటు మెరుగైన ఆఫర్లు ఇస్తుండడమే దీనికి ప్రధాన కారణం. అంతేగాక మరికొన్ని బ్యాంకుల్లో సర్వీస్‌ మెరుగ్గా ఉంటుంది.

వడ్డీ భారం

ఇంటి రుణం దీర్ఘకాలం పాటు ఈఎంఐలను కలిగి ఉంటుంది. వడ్డీ 1% అధికంగా ఉన్నా కూడా దీర్ఘకాలం చెల్లించుకుంటూపోతే రుణ చెల్లింపులో చాలా భాగం వడ్డీకే పోతుంది. వడ్డీ భారాన్ని తగ్గించుకోవడానికి ఉత్తమ మార్గాల్లో రీఫైనాన్సింగ్‌ ఒకటి. ఉదా: 8% వడ్డీతో రూ.50 లక్షల రుణాన్ని 20 సంవత్సరాల కాలవ్యవధికి తీసుకుంటే.. కేవలం వడ్డీయే రూ.50.37 లక్షలు అవుతుంది. ఈ రుణాన్ని 7% వడ్డీ వసూలు చేసే బ్యాంకుకు రీఫైనాన్స్‌ చేస్తే, రూ.43.03 లక్షలు మాత్రమే వడ్డీ అవుతుంది. దీనివల్ల రూ.7 లక్షలు ఆదా చేయొచ్చు.

ప్రారంభంలోనే..

మీ రుణ కాలవ్యవధి ప్రారంభంలో రీఫైనాన్సింగ్‌ చేయడం వల్ల ఆర్థికంగా లాభం ఉంటుంది. లేదా రుణ కాలవ్యవధి మధ్యలో కూడా రీఫైనాన్సింగ్‌ అనేది అర్థవంతంగా ఉంటుంది. ఈ కాలవ్యవధిలో అసలు కన్నా వడ్డీయే ఎక్కువ చెల్లిస్తారు. ఎక్కువ వడ్డీ చెల్లించే కాలవ్యవధిలోనే రుణ బదిలీకి ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. అదే కాలవ్యవధి చివర్లో రీఫైనాన్సింగ్‌ మంచి నిర్ణయం కాదు. అప్పటికే వడ్డీలో ఎక్కువ భాగం చెల్లించేసి ఉంటారు కాబట్టి ఆలస్యంగా రీఫైనాన్సింగ్‌ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు.

నిబంధనలు, సేవలు

ప్రస్తుత హోమ్‌ లోన్‌కు సంబంధించి ప్రీపేమెంట్‌ ఛార్జీలు, ప్రాసెసింగ్‌ ఫీజులు వంటి నిబంధనలు, షరతులతో ప్రస్తుత బ్యాంకుతో సంతృప్తి చెందని పరిస్థితులుంటాయి. అటువంటప్పుడు రుణగ్రహీత అవసరాలకు, నిబంధనలకు సరిపోయే వేరే బ్యాంకుతో హోమ్‌లోన్‌ బ్యాలెన్స్‌ బదిలీ ప్రక్రియను చేపట్టొచ్చు. మీ ప్రస్తుత బ్యాంకు అందించే సేవలతో అసంతృప్తిగా ఉన్నట్లయితే.. అంటే మీ ప్రశ్నలకు ఆలస్యంగా ప్రతిస్పందించడం, పేలవమైన కస్టమర్‌ సర్వీసు, రుణ మంజూరులో జాప్యం వంటివి ఉంటే మెరుగైన సేవలను అందించే బ్యాంకుకు మారడానికి హోమ్‌ లోన్‌ బ్యాలెన్స్‌ బదిలీ మీకు ఉపయోగపడుతుంది. మీరు హోమ్‌ లోన్‌ని రీఫైనాన్స్‌ చేసినప్పుడు మీ కొత్త బ్యాంకు.. లోన్‌ కొనసాగుతున్న పాత బ్యాంకుకు మిగిలిన లోన్‌ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఆపై మీరు కొత్త బ్యాంకుకు నేరుగా ఈఎంఐలు చెల్లిస్తారు.

జాగ్రత్తలు

తగ్గిన వడ్డీ రేట్లను పొందడానికి మీ హోమ్‌లోన్‌ను మార్చుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, ప్రస్తుతం కొనసాగుతున్న హోమ్‌ లోన్‌ ఈఎంఐలను డిఫాల్ట్‌ చేయకుండా చూసుకోండి. కొత్త బ్యాంకుకు రుణాన్ని బదిలీ చేసేటప్పుడు, ఆ బ్యాంకు మీ మునుపటి బ్యాంకులో రీపేమెంట్‌ రికార్డులను పరిశీలించే అవకాశం ఉంది. పాత బ్యాంకులో ఈఎంఐ చెల్లింపులు సక్రమంగా లేకపోతే, రీఫైనాన్స్‌ కోసం మీ అభ్యర్థనను ఆమోదించే అవకాశం ఉండదు. బ్యాంకులు ప్రకటించే రాయితీ వడ్డీ రేట్లు రుణగ్రహీతలను ఆకర్షిస్తాయి. అయితే, ఈ రేట్లు/వడ్డీ రాయితీలు స్వల్పకాలానికే ఉండొచ్చు. అందుచేత, బ్యాంకుకు సంబంధించిన వడ్డీ రేటు చరిత్రను ట్రాక్‌ చేయండి. ప్రతిపాదిత వడ్డీ రేటు వాస్తవమా, దీర్ఘకాలికంగా అందుబాటులో ఉంటుందా లేదా అనేది ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి.

ప్రాసెసింగ్‌ ఛార్జీలు

మీ ఇంటి రుణాన్ని బదిలీ చేసినప్పుడు మళ్లీ ప్రాసెసింగ్‌ ఫీజులు, ఇతర ఛార్జీలను చెల్లించాలి. ఈ ఫీజులు తక్కువ ఉంటేనే మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది. వడ్డీ తగ్గింపుల వల్ల దీర్ఘకాలానికి ఈఎంఐ తగ్గుతుంది కాబట్టి, స్వల్ప మొత్తంలో వసూలు చేసే ప్రాసెసింగ్‌ ఫీజులు పెద్ద భారంగా ఉండవు. అయితే, మీ మునుపటి బ్యాంకులో ఈఎంఐలు సకాలంలో చెల్లించి, మెరుగైన క్రెడిట్‌ స్కోరు కలిగి ఉంటే.. ప్రాసెసింగ్‌ రుసుములను మాఫీ చేయమని కొత్త బ్యాంకును అభ్యర్థించవచ్చు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వంటి కొన్ని బ్యాంకులు గృహ రుణ బదిలీల కోసం ఎటువంటి ప్రాసెసింగ్‌ రుసుమునూ విధించవు. ఇలాంటి బ్యాంకును ఎంచుకోవడం మంచిది.

చివరిగా: మీరు హోమ్‌లోన్‌ రీఫైనాన్సింగ్‌ను ఎంచుకునే ముందు దాని నుంచి ప్రయోజనం పొందుతున్నారో లేదో లెక్కించడం చాలా అవసరం. బదిలీ ఖర్చును లెక్కించండి. మీ ప్రస్తుత బ్యాంకు వసూలు చేసే రుణ ముగింపు రుసుములు, కొత్త బ్యాంకు వసూలు చేసే ప్రాసెసింగ్‌ ఫీజులు, ఇతర చార్జీలు ఎంతో చూడండి. రుణ బదిలీలో వచ్చే పొదుపు కంటే ఖర్చులు తక్కువగా ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని