Home Loan: పండగ సీజన్‌లో హోంలోన్‌.. ఆఫర్‌ ఒక్కటే చూస్తే సరిపోదు!

Home Loan: పండగ సీజన్‌ నేపథ్యంలో బ్యాంకులు గృహ రుణాలపై ఆఫర్లు ఇస్తున్నాయి. సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునేవారికి ఇది మంచి తరుణం. అయితే, కేవలం ఆఫర్‌ను మాత్రమే కాకుండా ఇతర అంశాలను కూడా పరిశీలించి లోన్‌ తీసుకోవాలి.

Updated : 14 Nov 2023 11:51 IST

Home Loan | పండగ సీజన్‌ నేపథ్యంలో చాలా బ్యాంకులు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు గృహ రుణాల (Home Loan)పై ఆఫర్లను ప్రకటించాయి. ఈ పండగ ఆఫర్లను ప్రధానంగా రెండు కేటగిరీల్లో చేర్చొచ్చు. ఒకటి వడ్డీరేట్లలో రాయితీ అయితే, మరొకటి కొన్ని రకాల రుసుముల ఎత్తివేత లేదా తగ్గింపు. హోంలోన్‌ (Home Loan) తీసుకోవాలనుకునేవారికి ఇది మంచి తరుణమే అని చెప్పొచ్చు. కానీ, ఆఫర్లు ఉన్నాయి కదా అని మిగిలిన నియమ నిబంధనల్ని పరిశీలించకుండా తొందరపడొద్దు.

ఆఫర్లు అందరికీ కాదు..

వాస్తవానికి పండగ సందర్భంగా ఇస్తున్న ప్రత్యేక ఆఫర్లు అందరికీ వర్తించకపోవచ్చు. కొన్ని షరతులకు లోబడే అవి ఉంటాయి. ఉదాహరణకు వడ్డీరేట్లలో రాయితీ పొందాలంటే నిర్దిష్ట క్రెడిట్‌ స్కోర్‌ ఉండాల్సిందేనని బ్యాంకులు షరతు విధిస్తాయి. ఉదాహరణకు 700 పైన స్కోర్‌ ఉన్నవారికి మాత్రమే పండగ సందర్భంగా ఇస్తున్న వడ్డీరేట్లలో రాయితీ వర్తిస్తుందని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ 800 పైన క్రెడిట్‌ స్కోర్‌ ఉండాలని కండిషన్‌ పెట్టింది. నిర్దేశిత స్కోర్‌ లేకపోతే సాధారణ రేట్లే వర్తిస్తాయి.

మరోవైపు కొన్ని బ్యాంకులు కేవలం మహిళలకు మాత్రమే రుణ రేట్లలో రాయితీ ఇస్తాయి. అలాగే స్వల్పకాలిక రుణాలకు మాత్రమే తక్కువ రుణరేటును ఆఫర్‌ చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో గృహ రుణం తీసుకోబోయే ముందు ఒకటికి రెండుసార్లు ఆఫర్‌ షరతులను గమనించాలి. ఒకవైపు ప్రయోజనం ఇస్తూనే.. మరోరూపంలో దాన్ని వసూలు చేసుకుంటున్నాయేమో గ్రహించాలి.

మిగిలిన ఫీజులనూ గమనించాలి..

కేవలం రుణ రేట్లపై రాయితీ మాత్రమే కాదు.. ప్రాసెసింగ్‌ ఫీజు సహా ఇతర రుసుములను కూడా గమనించాలి. ఈఎంఐ కాలిక్యులేటర్‌ సాయంతో మొత్తం రుణ వ్యయం ఎంతవుతుందో అంచనా వేయాలి. ముందు మీ డిపాజిట్‌, క్రెడిట్‌ కార్డు, ఇతర లోన్లు ఉన్న బ్యాంకుల్లో రుణం తీసుకుంటే ఎంత వరకు వ్యయం అవుతుందో చూడాలి. తర్వాత ఆన్‌లైన్‌లో ఇతర సంస్థలతో పోల్చుకోవాలి. మొత్తం రుణ వ్యయం ఎక్కడ తక్కువగా ఉంటే దాన్ని ఎంపిక చేసుకోవాలి. కేవలం ఆఫర్‌ మాత్రమే కాకుండా.. రుణం పూర్తిగా చెల్లించే సమయానికి మీపై ఎంత భారం పడుతుందో చూసుకోవాలి.

కావాల్సినంత ఇస్తారా?

కోరుకున్న ఇంటిని సొంతం చేసుకోవాలంటే దాన్ని కొనడానికి సరిపడా డబ్బు కూడా ఉండాలి. అందుకే బ్యాంకులు కావాల్సిన మొత్తాన్ని లోన్‌ కింద ఇస్తున్నాయో లేదో చూసుకోవాలి. ఆఫర్‌ ఉంది కదా అని తక్కువ మొత్తానికే రాజీపడితే.. మిగిలిన డబ్బును చేతి నుంచి భరించాల్సి ఉంటుంది. ఇది మీ ఆర్థిక ప్రణాళికలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు. ఒకవేళ ఇతర మార్గాల ద్వారా ఆ డబ్బు సమకూర్చుకుంటే అది మరింత ఖర్చుతో కూడుకొని ఉండొచ్చు. వీటన్నింటినీ ముందే బేరీజు వేసుకోవాలి.

ముందస్తు చెల్లింపు షరతులు..

గృహ రుణం తీసుకున్న చాలా మంది ముందే చెల్లించడానికి మొగ్గుచూపుతుంటారు. కనీసం 20 ఏళ్ల కాలపరిమితితో రుణం తీసుకున్నప్పటికీ.. 8- 10 ఏళ్లలో లోన్‌ క్లోజ్‌ చేసుకోవడానికి చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ముందస్తు రుణ చెల్లింపు షరతులను క్షుణ్నంగా పరిశీలించాలి. అలాగే వీలైనప్పుడల్లా అదనంగా చెల్లించే వెసులుబాటు కూడా ఉంటే మంచిది.

కాలపరిమితి..

ప్రత్యేక ఆఫర్లు ఇచ్చేటప్పుడు బ్యాంకులు నిర్దిష్ట కాలపరిమితితో తీసుకుంటేనే ప్రయోజనాన్ని ఇస్తుంటాయి. అందుకే వారిచ్చే గడువు ఓకే అనుకుంటేనే లోన్‌ తీసుకోవాలి. ఎక్కువ కాలమైతే.. నెలవారీ ఈఎంఐ భారం తగ్గుతుంది. కానీ, మొత్తంగా మీరు చెల్లించే వడ్డీ ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటు ఈఎంఐ భారం కాకుండా.. అటు చెల్లించే మొత్తం పెరగకుండా బ్యాలెన్స్ అయ్యేలా చూసుకోవాలి.

వివిధ బ్యాంకుల పండగ ఆఫర్లు..

  • బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా: 8.4% వడ్డీరేటు, ప్రాసెసింగ్‌ ఫీజు లేదు, మహిళలకు వడ్డీరేటులో రాయితీ
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌: వడ్డీరేటు 8.35% నుంచి ప్రారంభమవుతుంది. ప్రాసెసింగ్‌ ఫీజుపై 50% రాయితీ
  • సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా: 8.5% వడ్డీరేటుతో మహిళలకు ప్రత్యేక హౌసింగ్‌ లోన్‌, ముందస్తు చెల్లింపు ఛార్జీలు ఉండవు, ప్రాసెసింగ్‌ ఫీజు కూడా లేదు
  • ఐడీబీఐ బ్యాంక్‌: 8.45 శాతం నుంచి వడ్డీరేటు ప్రారంభమవుతుంది.
  • కెనరా బ్యాంక్‌: వడ్డీరేటు 8.4 శాతం నుంచి మొదలవుతుంది. ప్రాసెసింగ్‌ ఫీజుపై పూర్తి రాయితీ
  • పీఎన్‌బీ హౌసింగ్‌: 8.5 శాతం నుంచి వడ్డీరేటు ప్రారంభమవుతుంది

గమనిక: పండగ సీజన్‌ నేపథ్యంలో ప్రకటించిన ఈ ప్రత్యేక ఆఫర్ల తుది గడువు బ్యాంకులు, సంస్థలను బట్టి మారుతుంది. ఆ వివరాల కోసం ఆయా బ్యాంకుల వెబ్‌సైట్లను సంప్రదించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని