Loan Eligibility: రుణ అర్హత పెంచుకుందాం

ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు రుణాలు చాలా సులభంగా లభిస్తున్నాయనే చెప్పొచ్చు. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) పూర్తిగా డిజిటల్‌ రూపంలోనే క్షణాల్లో అప్పులు ఇచ్చేందుకు సిద్ధం అంటున్నాయి.

Updated : 31 May 2024 10:57 IST

ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు రుణాలు చాలా సులభంగా లభిస్తున్నాయనే చెప్పొచ్చు. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) పూర్తిగా డిజిటల్‌ రూపంలోనే క్షణాల్లో అప్పులు ఇచ్చేందుకు సిద్ధం అంటున్నాయి.  అదే సమయంలో అధిక రుణాలు, తక్కువ క్రెడిట్‌ స్కోరున్న వారి దరఖాస్తులను తిరస్కరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి తన రుణ అర్హతను పెంచుకునేందుకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. 

సాధారణంగా బ్యాంకులు ఎప్పుడూ మంచి క్రెడిట్‌ స్కోరు, రుణ చరిత్ర ఉన్న వారికి అప్పులు ఇచ్చేందుకు ఇష్టపడతాయి. గృహ, వాహన, వ్యక్తిగత రుణాల్లో కొంత వడ్డీ రాయితీనీ అందిస్తుంటాయి. మరోవైపు కొన్ని అంశాల్లో కఠినంగా ఉంటాయి. కాబట్టి, కొత్త రుణాలను తీసుకోవాలనుకున్నప్పుడు మన రుణ చరిత్రను ప్రభావితం చేసే అంశాలు, వాటికి పరిష్కారం ఏమిటన్నది పరిశీలిద్దాం.   

 బాకీలు అధికంగా ఉంటే..

రుణం కావాలని మనం దరఖాస్తు చేయగానే బ్యాంకులు ముందుగా మన ఆర్థిక స్తోమతను పరిశీలిస్తాయి. ఇప్పటికే ఉన్న అప్పుల గురించి ఆరా తీస్తాయి. అందులో కొన్ని తీర్చేందుకు అవకాశం ఉందా లేదా అనేది చూస్తాయి. దరఖాస్తుదారుడికి రుణం ఉన్నప్పటికీ, అది ఆరు నెలల్లో ముగుస్తుంది అంటే, దాన్ని పెద్దగా పట్టించుకోవు. ఆదాయంలో ఎంత మొత్తం వాయిదాలకు చెల్లిస్తున్నారనేది కీలకం. ఆదాయంలో 40 శాతానికి మించి రుణ వాయిదాలకు చెల్లిస్తూ ఉంటే.. అలాంటి వారికి కొత్త అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు కాస్త ఆలోచిస్తాయి. 60 శాతం దాటితే మాత్రం రుణం ఇవ్వడం కష్టం కావచ్చు. కాబట్టి, గృహరుణంలాంటి పెద్ద అప్పు కావాల్సి వచ్చినప్పుడు చిన్న చిన్న రుణాలను ఒకేసారి తీర్చేయడమే ఉత్తమం.

క్రెడిట్‌ స్కోరును చూడండి..

ఇప్పటికే రుణాలు తీసుకున్న వారు తమ క్రెడిట్‌ స్కోరును ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. చాలా సంస్థలు ఇప్పుడు ఈ స్కోరును ఉచితంగానే తీసుకునే సౌలభ్యం కల్పిస్తున్నాయి. 750కి మించి స్కోరున్న వ్యక్తులకు రుణాలను ఇచ్చేందుకు బ్యాంకులు ఇష్టపడతాయి. కొన్ని బ్యాంకులు 700 స్కోరున్నా ఇబ్బంది లేదని చెబుతున్నాయి. క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటే వెంటనే దాన్ని సరిదిద్దేందుకు చర్యలు తీసుకోండి. క్రెడిట్‌ కార్డును విపరీతంగా వాడటం వల్ల స్కోరు దెబ్బతింటుంది. ఉదాహరణకు మీ క్రెడిట్‌ కార్డు పరిమితి రూ.లక్ష అనుకుందాం. ఇందులో మీ క్రెడిట్‌ వినియోగం 40 శాతానికి మించకూడదు. అంటే రూ.40వేల వరకే మీరు కార్డును వాడాలి. దీనికి మించి వాడినప్పుడు క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం పడుతుంది. చాలామంది రుణదాతలు 30 శాతం క్రెడిట్‌ వినియోగాన్ని ఇష్టపడతారు. ఒకే బ్యాంకులో కాకుండా, రెండు మూడు బ్యాంకుల్లో రుణానికి దరఖాస్తు చేసినా స్కోరుపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. తరచూ రుణాల కోసం దరఖాస్తు చేస్తుంటే మీరు రుణాలపైనే ఆధారపడుతున్నారని ఆర్థిక సంస్థలు భావిస్తాయి. తక్కువ వ్యవధిలోనే ఎక్కువ రుణాలు తీసుకోవడమూ సరికాదు. 

ఉమ్మడిగా...

గృహరుణం అధికంగా రావాలంటే సులభమైన మార్గాల్లో ఒకటి... జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడిగా రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం. కొన్ని బ్యాంకులు తండ్రి, తల్లి, కొడుకు, కుమార్తె వంటి దగ్గరి కుటుంబ సభ్యులనూ సహ-దరఖాస్తుదారుగా అనుమతిస్తున్నాయి. బ్యాంకు, ఎన్‌బీఎఫ్‌సీని సంప్రదించి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. 

వాయిదాలను పెంచుతూ..

ఉద్యోగంలో చేరిన కొత్తలో వేతనం తక్కువగా ఉంటుంది. కాబట్టి, రుణ అర్హత అధికంగా ఉండదు. ఇలాంటప్పుడు స్టెప్‌ అప్‌ పద్ధతిలో రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. మీకు అవసరమైన రుణాన్ని ఇప్పుడు అందిస్తాయి. ప్రారంభంలో తక్కువ ఈఎంఐ ఉంటుంది. వేతనం పెరుగుతున్న కొద్దీ వాయిదాల మొత్తం అధికం అవుతుంది. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి కొన్ని బ్యాంకులు ఇలాంటి వెసులుబాటును అందిస్తున్నాయి. సాధారణ రుణాలతో పోలిస్తే వీటికి వడ్డీ అధికంగా ఉంటుంది. భవిష్యత్తులో ఆదాయం పెరుగుతుందని కచ్చితమైన అంచనాలు ఉన్నప్పుడే ఈ విధానాన్ని ఉపయోగించుకోవాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని