Credit card: క్రెడిట్‌ కార్డు తీసుకొని వాడట్లేదా.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Credit card: ఒకటికి మించి క్రెడిట్‌ కార్డులు ఉన్నప్పుడు.. ఒకే కార్డుపై అన్ని కొనుగోళ్లనూ పూర్తి చేయొద్దు. వీలును బట్టి, అన్ని కార్డులను వాడేందుకు ప్రయత్నించాలి. ఎందుకో చూద్దాం..

Updated : 01 Nov 2023 14:20 IST

Credit card | ఇంటర్నెట్‌ డెస్క్‌: కొంత మంది దగ్గర ఒకటికి మించి క్రెడిట్‌ కార్డులుంటాయి (Credit card). అయితే, అన్నింటినీ వాడడం దేనికిలే అని కొన్నింటిని పక్కన పెడుతుంటారు. మరికొంత మంది కార్డు (Credit card) తీసుకొని అత్యవసరమైనప్పుడు ఉపయోగించుకుందాం అనుకొని పక్కన పెట్టేస్తారు. దీని వల్ల తక్షణం ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చు. కానీ, దీర్ఘకాలంలో కొన్ని ప్రయోజనాలను కోల్పోవాల్సి రావొచ్చు. క్రెడిట్‌ కార్డు (Credit card)ను వాడకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండొచ్చని అనుకుంటుంటారు. కానీ, కొన్ని ప్రతికూల ప్రభావాలూ ఉంటాయని గుర్తించాలి. అవేంటో చూద్దాం..

బలమైన క్రెడిట్‌ స్కోరు చేజారుతుంది..

మంచి క్రెడిట్‌ స్కోర్‌ (Credit Score)ను మెయింటైన్‌ చేయడానికి క్రెడిట్‌ కార్డు (Credit card) మేలైన మార్గం. కార్డును అవసరమున్న చోట వాడుకుంటూ సకాలంలో బిల్లు చెల్లిస్తే బలమైన స్కోర్‌ను నిర్మించుకోవచ్చు. మెరుగైన స్కోర్‌ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు! మరోవైపు ఒక్కోసారి ఈఎంఐల చెల్లింపుల్లో ఆలస్యం లేదా ఇతర కారణాల వల్ల క్రెడిట్‌ స్కోర్‌ దెబ్బతింటుంది. అలాంటప్పుడు దాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు క్రెడిట్‌ కార్డు చక్కని మార్గం. మరి అదే కార్డును పెద్దగా ఉపయోగించకపోతే మాత్రం ఈ ప్రయోజనాన్ని కోల్పోతున్నట్లే. పైగా సుదీర్ఘకాలం క్రితం తీసుకున్న కార్డును పక్కన పెట్టడం వల్ల ఆ మేర క్రెడిట్‌ హిస్టరీని కూడా కోల్పోయినట్లే.

పరిమితి పెరగదు..

క్రెడిట్‌ కార్డు ‘రుణ వినియోగ నిష్పత్తి (Credit Utilisation Ratio- CUR) 40 శాతం కంటే తక్కువ ఉంటే మేలు. కార్డు పరిమితిలో మీరు వాడుతున్న మొత్తాన్ని సీయూఆర్‌ సూచిస్తుంది. ఇది 40 శాతం మించితే మీరు రుణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారని అర్థం! కాబట్టి కార్డును తరచూ వాడడం వల్ల కంపెనీలు పరిమితిని పెంచుతాయి. దీంతో మీరు కార్డు నుంచి ఎక్కువ మొత్తంలో వాడుకునే వెసులుబాటు ఉంటుంది. అదే కార్డును పక్కన పెడితే.. పెరుగుతున్న మీ అవసరాలకు అనుగుణంగా ఎక్కువ మొత్తంలో వాడుకునే వీలుండదు. దీనివల్ల కార్డు ప్రయోజనాన్ని పూర్తిస్థాయిలో పొందలేరు.

డియాక్టివేట్‌ కావొచ్చు..

కొన్ని సంస్థలు క్రెడిట్‌ కార్డును దీర్ఘకాలం వాడకుండా పక్కన పెడితే.. వాటిని డియాక్టివేట్‌ చేస్తాయి. వాటిపై ఛార్జీలు కూడా విధిస్తాయి. అలాగే కార్డును పునరుద్ధరించుకోవాలంటే మళ్లీ రుసుములు చెల్లించాల్సి రావొచ్చు. కార్డు తీసుకునే ముందు నియమ నిబంధనలన్నింటినీ తెలుసుకోవాలి. ఈ తరహా ఛార్జీలు ఉన్నాయేమో గమనించాలి.

రివార్డులు కోల్పోతారు..

క్రెడిట్‌ కార్డులపై రివార్డు పాయింట్లు, రాయితీలు, క్యాష్‌బ్యాక్‌ వంటి ఆఫర్లు ఉంటాయి. కార్డు వీలున్నచోట వాడకపోతే వీటన్నింటినీ కోల్పోవాల్సి వస్తుంది. పైగా కార్డుపై చెల్లించే వార్షిక ఫీజు వృథా అవుతుంది. ఆ మేరకు ప్రయోజనాలు పొందితేనే కార్డుని పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నవారవుతారు.

అత్యవసరంలో ఇబ్బందులు..

అత్యవసరమైనప్పుడే వాడదాం అనుకొని చాలా మంది క్రెడిట్‌ కార్డును పక్కన పెడుతుంటారు. ఆ సమయం వచ్చే సరికి కార్డు డియాక్టివేట్‌ అయిపోవచ్చు. అలాంటప్పుడు దాన్ని తిరిగి యాక్టివేట్‌ చేసుకోవడం శ్రమతో కూడుకున్న పని. పైగా అత్యవసర సమయంలో పొందాల్సిన ప్రయోజనాన్ని చేజార్చుకోవచ్చు.

సుదీర్ఘ రుణ చరిత్ర..

సుదీర్ఘ క్రెడిట్‌ హిస్టరీ ఆర్థిక లావాదేవీలకు చాలా కీలకం. లోన్లు, ఇతర క్రెడిట్‌ ఉత్పత్తులకు దరఖాస్తు చేసుకున్నప్పుడు దీన్నే ఆధారం చేసుకుంటారు. క్రెడిట్‌ కార్డు మీ రుణ చరిత్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీ చెల్లింపు సామర్థ్యాన్ని తెలియజేస్తుంది.

ఒకటికి మించి క్రెడిట్‌ కార్డులు ఉన్నప్పుడు.. ఒకే కార్డుపై అన్ని కొనుగోళ్లనూ పూర్తి చేయొద్దు. వీలును బట్టి, అన్ని కార్డులను వాడేందుకు ప్రయత్నించాలి. క్రెడిట్‌ కార్డులను క్రమం తప్పకుండా వినియోగిస్తుంటే.. కనీసం ఏడాదికోసారైనా క్రెడిట్‌ స్కోరును తనిఖీ చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని