Home Loan: హోమ్‌ లోన్‌ బ్యాలెన్స్‌ బదిలీని ఎప్పుడు ఎంచుకోవాలి?

చాలా మంది హోమ్‌ లోన్‌ రుణగ్రహీతలు వడ్డీ ఖర్చులపై ఆదా చేయడానికి లేదా రుణ కాలవ్యవధిని పెంచుకోవడానికి హోమ్‌లోన్‌ బ్యాలెన్స్‌ బదిలీని ఎంచుకుంటారు.

Published : 06 Oct 2023 16:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలా మంది బ్యాంకు రుణంతో ఇళ్లను కొనుగోలు చేస్తుంటారు. సాధారణంగా ఎక్కువమంది ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్లనే ఎంచుకుంటారు. వేగంగా ఇంటి రుణం పొందాలనే ఉద్దేశంతో ఏదో ఒక బ్యాంకులో రుణాన్ని తీసుకుంటారు. కాలక్రమంలో ఈఎంఐ మొత్తం ఎక్కువయిందనో.. రుణం తీర్చే కాలవ్యవధి అధికంగా ఉందనే ఆలోచనలో పడతారు. లేదా వేరే బ్యాంకు తక్కువ వడ్డీకి రుణం ఆఫర్‌ చేస్తుందనో ఇంటి రుణాన్ని వేరే బ్యాంకుకు బదిలీ చేసుకోవాలనుకుంటారు. బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ లేదా రీఫైనాన్సింగ్‌గా ఈ రుణ బదిలీని ఎంచుకోవడం వల్ల రుణగ్రహీతలకు కొన్ని పరిస్థితుల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ రుణ బదిలీని ఎంచుకోవడానికి ముందు దానికి సరైన సమయం ఎంచుకోవడం ముఖ్యం.

తక్కువ వడ్డీ రేట్లు

రుణం తీసుకునేటప్పుడు రుణగ్రహీతలను ఎక్కువ ప్రభావితం చేసేది వడ్డీ రేటే. హోమ్‌లోన్‌ బ్యాలెన్స్‌ బదిలీ ఆఫర్లకు సంబంధించి ప్రధాన ప్రయోజనాల్లో వడ్డీ ఖర్చులపై ఆదా చేయడం ఒకటి. మీరు ఇంటి రుణాన్ని పొందిన తర్వాత మార్కెట్‌లో రుణ రేట్లు తగ్గితే.. మీ ప్రస్తుత బ్యాంకు ఇప్పటికే అధిక వడ్డీ రేటును వసూలు చేస్తుంటే, మీ లోన్‌ను రీఫైనాన్స్‌ చేయడానికి తక్కువ వడ్డీ రేటును అందించే బ్యాంకును ఎంచుకోవచ్చు. వడ్డీ రేటు తగ్గుదల వ్యత్యాసం కనీసం 75 బేసిస్‌ పాయింట్లు వరకు ఉంటే మాత్రమే రుణ బదిలీకి ప్రయత్నించడం మంచిది. ఇది దీర్ఘకాలంలో వడ్డీ ఖర్చులను ఆదా చేయడంలో మీకు ఉపయోగపడుతుంది.

క్రెడిట్‌ స్కోరు

మీరు గతంలో ఏవైనా అస్థిరమైన ఈఎంఐ చెల్లింపులను కలిగి ఉంటే.. అది మీ క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. కొత్త బ్యాంకు పేలవమైన రీపేమెంట్‌ చరిత్ర కలిగిన రుణగ్రహీతతో రుణ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఇష్టపడదు. మీరు మంచి క్రెడిట్‌ రేటింగ్‌ను కలిగి ఉంటేనే రుణానికి సంబంధించి బ్యాలెన్స్‌ బదిలీ ఎక్కువగా సాధ్యమవుతుంది. అనుకూలమైన రుణ నిబంధనలతో రుణాన్ని బదిలీ చేసుకోవచ్చు. మీరు ముందు రుణం తీసుకున్నప్పటి కంటే ఇప్పుడు మీ క్రెడిట్‌ స్కోరు మెరుగుపడి ఉంటే.. మరొక బ్యాంకు మెరుగైన వడ్డీ రేటుకు మీకు రుణం ఇస్తుంది. 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు ఉన్నవారు తక్కువ వడ్డీ రేట్లతో రుణ ఆమోదానికి అవకాశం ఉంటుంది. అందుచేత కనీసం నెలకు ఒకసారి మీ క్రెడిట్‌ స్కోరుని తనిఖీ చేయాలని బ్యాంకింగ్‌ నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. 

ముందస్తు చెల్లింపు పెనాల్టీ

కొన్ని బ్యాంకులు మెచ్యూరిటీకి ముందే హోమ్‌ లోన్‌ను తిరిగి చెల్లించినందుకు ముందస్తు చెల్లింపు ఛార్జీలను వసూలు చేయొచ్చు. మీరు రుణ బదిలీని ఎంచుకున్నప్పుడు కొత్త బ్యాంకు ప్రీపేమెంట్‌ పెనాల్టీని మాఫీ చేయడానికి లేదా రీయింబర్స్‌ చేయడానికి ఆఫర్‌ చేయొచ్చు. ఇలాంటి ఆఫర్లు ఉన్నప్పుడు రుణ బదిలీకి ప్రయత్నించవచ్చు.

మెరుగైన సేవలు, ఫీచర్లు

మీ ప్రస్తుత బ్యాంకులో ఆన్‌లైన్‌ ఖాతా నిర్వహణ, పార్ట్‌-పేమెంట్‌ ఆప్షన్‌లు లేదా ఫోర్‌క్లోజర్‌ సౌలభ్యం వంటి ముఖ్యమైన సర్వీసులు, ఫీచర్‌లు లేకుంటే..ఈ సౌకర్యాలను అందించే బ్యాంకుకు రుణ బదిలీ చేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని పరిస్థితుల వల్ల మీ ప్రస్తుత బ్యాంకు మరొక బ్యాంకులో విలీనమైన సందర్భంలో మీ రుణానికి సంబంధించిన నిబంధనలు, షరతులు మారొచ్చు. ఇలాంటి సందర్భంలో మీకు ఆ కొత్త బ్యాంకులో ఇబ్బందులెదురైతే కూడా రుణ బదిలీ ప్రయత్నాలు చేయొచ్చు.

అదనపు నిధులు

హోమ్‌లోన్‌ పొందిన తర్వాత, ఇంటి మరమ్మతులు లేదా అదనపు హంగుల కోసం అదనపు నిధులు అవసరం కావచ్చు. ఈ సందర్భంలో హోమ్‌ లోన్‌ రీఫైనాన్సింగ్‌ మీకు అదనపు నిధులను పొందడంలో సహాయపడుతుంది.

ఈఎంఐ తగ్గించుకోవడానికి

మీ ఆర్థిక స్థితిలో ఏవైనా మార్పులు ఉన్నప్పుడు, రుణ ఈఎంఐలను భరించలేకపోతే రీఫైనాన్సింగ్‌ మంచి ఎంపిక. హోమ్‌ లోన్‌ బదిలీ చేయడం ద్వారా ఈఎంఐను తగ్గించుకునేలా ఎంచుకోవచ్చు. మీ లోన్‌ కాలపరిమితిని పెంచడం ద్వారా మీ ఈఎంఐని తగ్గించుకోవచ్చు.

రుణ బదిలీ ఎప్పుడు

రుణానికి సంబంధించిన కాలవ్యవధి చివరిలో రుణ బదిలీని ఎంచుకోవడం సరైంది కాదు. మీ ప్రస్తుత హోమ్‌ లోన్‌ను చెల్లించడానికి మరికొన్ని సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంటే.. ఇప్పటికే చాలా వడ్డీని చెల్లించేసి ఉంటారు. రుణ బదిలీ ఎక్కువగా వడ్డీని తగ్గించుకోవడానికి చేస్తుంటారు. కాబట్టి ఈ సందర్భంలో రుణాన్ని రీఫైనాన్స్‌ చేయడం మంచి ఆలోచన కాదు. రుణ కాలవ్యవధి మొదట్లో గానీ, మధ్యలో గానీ రుణ బదిలీ సౌకర్యాన్ని వినియోగించుకుంటే వడ్డీ ఖర్చులు తగ్గుతాయి.

రీఫైనాన్స్‌ ఖర్చులు

రుణాన్ని రీఫైనాన్స్‌ చేయడం వల్ల నిర్దిష్ట రుసుములు, ఛార్జీలు ఉంటాయి. బదిలీ ప్రక్రియకు మీరు మళ్లీ డాక్యుమెంటేషన్‌ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. స్టాంప్‌ పేపర్‌ ఫీజులు, డాక్యుమెంటేషన్‌ ఛార్జీలు, ప్రాసెసింగ్‌ ఫీజులు మొదలైనవి ఉంటాయి. మీరు పొందే లాభం కంటే ఈ ఖర్చులు ఎక్కువ ఉంటే.. లోన్‌ని రీఫైనాన్స్‌ చేయడం కరెక్ట్‌ కాదు.

నిబంధనలు, షరతులు

కొత్త రుణానికి సంబంధించిన నిబంధనలు, షరతుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. తక్కువ వడ్డీ రేటుతో ఇంటి రుణం ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, కొత్త బ్యాంకు అందించే నిబంధనలు, షరతులను పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ షరతులు ప్రయోజనకరంగా ఉంటేనే మీ హోమ్‌ లోన్‌ రీఫైనాన్స్‌ చేయడానికి ఎంచుకోండి.

ప్రస్తుత బ్యాంకుతో చర్చించొచ్చు

వడ్డీ తగ్గింపే మీ ప్రధాన కారణమైతే.. మీరు ఇప్పటికే ఉన్న మీ రుణంపై మెరుగైన డీల్‌ను అందించమని మీ బ్యాంకును అడగొచ్చు. ప్రతి బ్యాంకు తన ప్రస్తుత కస్టమర్లను నిలుపుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇలాంటి సందర్భంలో కొన్ని సార్లు వడ్డీ రేటును స్వల్పంగా తగ్గించవచ్చు. దీనివల్ల మీ లోన్‌ బదిలీ ప్రయత్నాలు మీరు విరమించుకోవచ్చు. దీనివల్ల కొత్త బ్యాంకు విధించే ప్రాసెసింగ్‌ రుసుము, ఇతర ఛార్జీలను కూడా ఆదా చేసుకోవచ్చు.

చివరిగా: రుణ బదిలీ దీర్ఘకాలంలో ప్రయోజనాన్ని చేకూర్చాలంటే, వివిధ బ్యాంకుల నిబంధనలు, ఆఫర్లను సరిపోల్చుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని