Published : 30/11/2021 05:21 IST

అప్పు మిగిలింది.. ఆశ చచ్చిపోయింది..!

రుణబాధతో ముగ్గురు రైతుల బలవన్మరణం

జహీరాబాద్‌ అర్బన్‌, కారేపల్లి, గోవిందరావుపేట న్యూస్‌టుడే: అన్నదాతల అన్ని అవసరాలకూ ఆ పంటపొలమే ఆధారం. ఈసారైనా దిగుబడి వస్తుందనే ఆశే పెట్టుబడి. అలాంటి ఆశతోనే సాగుఖర్చులకు..పిల్లల పెళ్లిళ్లు, చదువులకు అప్పులు చేస్తున్న రైతులు.. వాటిని తీర్చే దారి కన్పించని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా సంగారెడ్డి, ఖమ్మం, ములుగు జిల్లాల్లో ముగ్గురు రైతులు ఇలాంటి కారణాలతోనే నేలరాలిపోయారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం ఆనెగుంటకు చెందిన రైతు గొల్ల ఆగమయ్య(58)కు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. దాదాపు మూడున్నర ఎకరాల పొలం ఉంది. రెండేళ్ల వ్యవధిలో ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేయడంతో అప్పులపాలయ్యారు. ఏ పంటలోనూ దిగుబడి సరిగా రాకపోవడం, అదనంగా పెట్టుబడి ఖర్చులు పైనపడటంతో కుంగిపోయారు. ఆదివారం పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకున్నారు.

ఖమ్మం జిల్లాలో ఇంకొకరు

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గేటురేలకాయలపల్లి గ్రామానికి చెందిన వాంకుడోతు పుల్లు (58)కు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడితో కలిసి అదే గ్రామంలో ఉంటూ తమకున్న నాలుగు ఎకరాల భూమితోపాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నారు. కుటుంబ అవసరాలు, సేద్యం కోసం చేసిన అప్పులు రూ.5 లక్షలకు చేరడం, తీర్చే మార్గం కన్పించకపోవడంతో సోమవారం పొలం వద్దనే వద్ద పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.

మూడు పంటలూ పోయాయని..

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన యువ రైతు కట్ల శ్రీనివాసరెడ్డి(40)కి రెండెకరాల భూమి ఉంది. దాంతోపాటు ఐదెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగుచేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక గత రెండు పంట కాలాల్లో రూ.3 లక్షల వరకు నష్టం వచ్చింది. ప్రస్తుతం వానాకాలంలో సాగుచేసిన పంట ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతినడంతో కుంగిపోయారు. నవంబరు 22న పొలం వద్దనే పురుగు మందు తాగారు. సోమవారం మృతి చెందారు. శ్రీనివాసరెడ్డికి భార్య లత, కుమారుడు సిద్దు(12), కుమార్తె పృధ్విత (3) ఉన్నారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని