Updated : 07 Dec 2021 16:13 IST

మత్తు తలకెక్కింది.. వేగం మితిమీరింది!

 అదుపుతప్పి నలుగురిని బలిగొన్నారు

మరో నలుగురికి తీవ్ర గాయాలు

తాగి వాహనాలు నడపడమే కారణం

ఈనాడు, హైదరాబాద్‌: తలకెక్కిన మద్యం మత్తు నిండు ప్రాణాలు తీసింది. కన్నూమిన్నూ కానకుండా, శరవేగంగా వాహనాలు నడిపిన చోదకులు నలుగురి మృతికి కారణమయ్యారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఆది, సోమవారాల్లో జరిగిన మూడు వేర్వేరు ఘటనల్లో  ప్రమాదానికి గురైన వారంతా బడుగుజీవులు.. ఉపాధి కోసం నగరానికి వచ్చిన వారు.

మూడు చోట్ల తాగి... రెండు ప్రాణాలు తీసి...

ఉప్పల్‌ రాఘవేంద్ర కాలనీకి చెందిన రోహిత్‌గౌడ్‌(29) మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఖరీదైన పోర్షే  కారులో బయల్దేరాడు. ఆదివారం రాత్రి దుర్గం చెరువు వద్ద బార్‌లో మద్యం తాగాడు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45లోని ఓ పబ్‌కు వెళ్లి మరోసారి తాగాడు. అనంతరం బంజారాహిల్స్‌లోని ఒక హోటల్‌కు వెళ్లి.. ఇంకోసారి తాగాడు. మద్యం మత్తులోనే కేబీఆర్‌ పార్కు చుట్టూ ఒక రౌండ్‌ చుట్టొచ్చారు. అర్ధరాత్రి దాటాక 1.20 గంటల సమయంలో పార్క్‌హయత్‌ వైపు  80-120 కిలోమీటర్ల వేగంతో వెళ్లారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 2లో రోడ్డు దాటుతున్న అయోధ్యరామ్‌(23), దేబేంద్రకుమార్‌దాస్‌ అనే ఇద్దరు యువకులను రోహిత్‌గౌడ్‌ నడుపుతున్న కారు శరవేగంగా ఢీకొట్టింది. వారిద్దరూ కారుపై నుంచి ఎగిరిపడి మృతిచెందారు. అనంతరం నిందితుడు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు కారుతో ఉడాయించాలనుకోగా.. పోలీసులు చాకచక్యంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతుల్లో అయోధ్యరామ్‌ రెయిన్‌బో ఆసుపత్రిలో యుటిలిటీ బాయ్‌గా పనిచేస్తుండగా, దేబేంద్రకుమార్‌దాస్‌ అసిస్టెంట్‌ కుక్‌గా పని చేస్తున్నాడు.

రంగంలోకి పెద్దలు!

ఇద్దరి మరణాలకు కారణమైన రోహిత్‌గౌడ్‌ బీటెక్‌ చదివాడు. ప్రమాదానికి కారకులైన నిందితులను తప్పించేందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు, మరికొందరు నేతలు రంగంలోకి దిగినట్టు సమాచారం. ‘వారు మావాళ్లే.. కాస్త చూసీచూడనట్టు వదిలేయమ’ంటూ పోలీసు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇద్దరు ఎమ్మెల్యేలు ఠాణాకు వచ్చి పోలీసులతో మాట్లాడినట్టు తెలుస్తోంది.

అదుపు తప్పిన వైద్య విద్యార్థులు

మాదాపూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన మరో ప్రమాదంలో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం రాత్రి నిఖిల్‌రెడ్డి(26), మెండు తరుణ్‌(24), గొట్టిముక్కుల అఖిల్‌(23) అనే వైద్య విద్యార్థులు మాదాపూర్‌లోని ఒక పబ్‌లో మద్యం తాగారు. మత్తులో ఉన్న నిఖిల్‌రెడ్డి అర్ధరాత్రి 12.10 నిమిషాలకు కారును అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నలుగురు యువకులను బలంగా ఢీకొట్టాడు.  దాంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు నేపాల్‌ నుంచి ఉపాధి కోసం నగరానికి వచ్చారు. 

అయ్యో పాపం...

కోకాపేట్‌కు చెందిన దుర్గం రాజు(37), ఆయన భార్య మౌనిక(28) సోమవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై గండిపేట్‌కు వెళ్లారు. బ్యాంకులో పనులు ముగించుకుని వెళుతుండగా, అపసవ్య దిశలో వెళుతున్న వీరి వాహనాన్ని ఎదురుగా అతివేగంగా వస్తున్న క్వాలిస్‌ వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాల పాలైన వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ సంజీవ మద్యం మత్తులో వాహనం నడపటం వల్లనే ఘోర ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. రాజు దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు.


Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని