Published : 28 May 2022 09:26 IST

పరువుహత్య: కుమార్తెను కిరాతకంగా చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం

 ఆదిలాబాద్‌ జిల్లాలో దారుణం

నార్నూర్‌, న్యూస్‌టుడే: పచ్చని పల్లెలో పరువుహత్య కలకలం రేపింది. కుమార్తె ప్రేమను అంగీకరించని తల్లిదండ్రులు కిరాతకంగా గొంతుకోసి ఆమెను హతమార్చారు. ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలంలోని ఏజెన్సీ గ్రామం నాగల్‌కొండలో శుక్రవారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాగల్‌కొండకు చెందిన పవార్‌ సావిత్రిబాయి-దేవిదాస్‌లకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తెకు వివాహమైంది. కుమారుడు ఆదిలాబాద్‌లో ఉంటున్నాడు. చిన్న కుమార్తె రాజేశ్వరి(20), అదే గ్రామానికి చెందిన షేక్‌ అలీం కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఆమె ప్రేమ తల్లిదండ్రులకు ఇష్టం లేదు. 45 రోజుల కిందట ప్రేమికులిద్దరు మహారాష్ట్రకు పారిపోయారు. తమ కుమార్తెను అలీం కిడ్నాప్‌ చేశాడంటూ అమ్మాయి తల్లిదండ్రులు నార్నూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి వారి ఆచూకీ కనుగొన్నారు. యువతిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. యువకుడిని కిడ్నాప్‌ కేసులో అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు. తాను అతడినే పెళ్లిచేసుకుంటానని రాజేశ్వరి ఇంటికి వచ్చాక తరచూ తల్లిదండ్రులతో గొడవపడేది. గురువారం రాత్రి గొడవ తారస్థాయికి చేరింది. తర్వాత అంతా నిద్రపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న రాజేశ్వరిని తల్లిదండ్రులిద్దరూ కలిసి కత్తితో గొంతుకోసి హతమార్చారు. తండ్రి దేవిదాస్‌ ఉదయం గ్రామ పెద్ద గుణవంత్‌రావు, సర్పంచి సునీతల ఇళ్లకు వెళ్లి తన కుమార్తె కత్తితో గొంతుకోసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. వారిచ్చిన సమాచారంతో సీఐ ప్రేమ్‌కుమార్‌, ఎస్‌ఐ రవికిరణ్‌లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసు జాగిలాలను రప్పించారు. స్థానికులను విచారించారు. రాజేశ్వరిది ఆత్మహత్య కాదని, హత్య అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సర్పంచి జాదవ్‌ సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శవపంచనామా నిర్వహించి, మృతదేహాన్ని ఉట్నూరు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. యువతి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని