logo

ముఖ్య నేతల కోసం అభ్యర్ధుల యత్నం

ఆదిలాబాద్‌, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాలకు నామపత్రాలు దాఖలు చేసేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థుల తేదీలు ఖరారయ్యాయి. ఆదిలాబాద్‌ ఎస్టీ రిజర్వు కాగా పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్‌ స్థానం.

Published : 20 Apr 2024 02:50 IST

నామినేషన్ల తేదీలు ఖరారు..

ఈటీవీ - ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాలకు నామపత్రాలు దాఖలు చేసేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థుల తేదీలు ఖరారయ్యాయి. ఆదిలాబాద్‌ ఎస్టీ రిజర్వు కాగా పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్‌ స్థానం. ఈ రెండు స్థానాల్లో విజయ సాధించాలని కాంగ్రెస్‌, భాజపా, భారాస ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటం కీలకంగా మారింది. ఈ నెల 18 నుంచి ప్రారంభమైన నామపత్రాల స్వీకరణ ఈ నెల 25తో ముగియనుంది. మరో అయిదు రోజులే మిగిలి ఉండటంతో ఈ నెల 22, 23, 24 తేదీల్లో నామినేషన్లు వేయటంపై ప్రధాన పార్టీల దృష్టి సారించాయి. కానీ నామినేషన్ల ఘట్టంలో పాల్గొనే ప్రధాన పార్టీల రాష్ట్ర, జాతీయ నేతలు ఎవరనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. పెద్దపల్లి స్థానానికి శుక్రవారం భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీ నామినేషన్లు వేస్తే, ఆదిలాబాద్‌ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థి సుగుణ తరఫున ఆ పార్టీ ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు నామినేషన్‌ వేశారు. కొప్పుల ఈశ్వర్‌ తరఫున భారాస నేత కేటీఆర్‌ హాజరు కావాల్సి ఉండగా ఆయన రాలేదు. గడ్డం వంశీ తరఫున ధర్మపురి, పెద్దపల్లి ఎమ్మెల్యేలు లక్ష్మణ్‌, విజయరామారావు తప్పితే మంత్రులెవరూ హాజరుకాలేదు.

22న సీఎం రేవంత్‌రెడ్డి రాక..

ఈ నెల 22న సీఎం రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్‌ పర్యటన ఖరారైంది. ఆత్రం సుగుణ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదిలాబాద్‌లో భాజపా అభ్యర్థి గోడం నగేష్‌ తరఫున ఈ నెల 24న మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌షిండే ముఖ్యఅతిథిగా హాజరవుతారని ప్రచారం చేసినా చివరి నిమిషంలో రద్దయింది. నామినేషన్‌ పర్వంలో ముఖ్య అతిథిగా ఎవరు హాజరవుతారనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని అభ్యర్థి నగేష్‌ తెలిపారు. భారాస అభ్యర్థి సక్కు తరఫున ఈ నెల 14న ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వచ్చి వెళ్లడంతో నామినేషన్‌ పర్వానికి అతిథులెవరనేది ఇంకా ఖారారు కాలేదు. పెద్దపల్లి భాజపా అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌ 24న నామినేషన్‌ వేయనున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని