logo

అధికారుల పనితీరుపై అందరి ఆగ్రహం..

అధికారుల తీరుపై జడ్పీ సమావేశంలో సభ్యులందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 19 May 2024 03:14 IST

డీఎఫ్‌ఓ, ఎఫ్‌డీఓలను సరెండర్‌ చేయాలని జడ్పీ తీర్మానం

మాట్లాడుతున్న జడ్పీ ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ కోనేరు కృష్ణారావు, చిత్రంలో కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ

ఈనాడు, ఆసిఫాబాద్‌: అధికారుల తీరుపై జడ్పీ సమావేశంలో సభ్యులందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ కోనేరు కృష్ణారావు అధ్యక్షతన శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాలనాధికారి వెంకటేష్‌ దోత్రే, అదనపు పాలనాధికారి దీపక్‌ తివారీ, సీఈఓతోపాటు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు. ముందుగా ఆర్‌అండ్‌బీ ఈఈ పెద్దన్న ప్రగతి పనులు వివరిస్తుండగానే.. దశాబ్దాల నుంచి అసంపూర్తిగా ఉన్న రోడ్లు, వంతెనల పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని సభ్యులు నిలదీశారు. కాగజ్‌నగర్‌ డివిజన్‌లో ఒక గుత్తేదారుకే ఎనిమిది రోడ్లు అప్పజెప్పారని, ఏ రోడ్డూ పూర్తి కావడం లేదని, కొత్మీర్‌-దహెగాం రెండు వరుసల రహదారి పనులు ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్నాయని, ఆసిఫాబాద్‌-ఉట్నూరు రహదారి మరమ్మతుల టెండర్‌ పూర్తయినా ఎందుకు చేయడం లేదని.. సభలో ప్రశ్నించారు. ‘కార్యాలయంలో ముగ్గురం మాత్రమే ఉద్యోగులం ఉన్నామని, ఇంతకంటే ఎక్కువ పనిచేయలేమని’.. ఈఈ బదులిచ్చారు.

గుండాలకు అత్యవసర సమయంలో అంబులెన్స్‌లు సైతం వెళ్లని విధంగా రోడ్డు ఉందని జడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్‌ అన్నారు. అనార్‌పల్లి, లక్మాపూర్‌ వంతెనలు దశాబ్దాల నుంచి అసంపూర్తిగా ఉన్నాయని ఎంపీపీ మోతీరాం చెప్పారు. మంత్రి సీతక్క వచ్చి పరిశీలించిన గుండి వంతెన పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు వంతులవారీగా వస్తున్నారని.. జడ్పీటీసీ సభ్యుడు అరిగెల నాగేశ్వరరావు అన్నారు. ‘ఫోన్‌ చేసినా డీఎఫ్‌ఓ నీరజ్‌కుమార్, ఎఫ్‌డీఓ అప్పలకొండ స్పందించరు. ఇటువంటి అధికారులు పనిచేయరు. వీరిని సరెండర్‌ చేయడానికి తీర్మానం చేయాలని..’ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొనగా.. సభ్యులందరూ మద్దతు పలికారు.

హాజరైన అధికారులు, నేతలు 

‘‘స్మగ్లర్లతో కుమ్మక్కై కలపను అటవీ అధికారులే తరలిస్తున్నారు. వాస్తవంగా మీరే పెద్ద స్మగ్లర్లు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై నెల గడిచింది. 45 వేల మెట్రిక్‌ టన్నుల లక్ష్యం కాగా, ఇప్పటికీ పదిశాతం మేర 2వేల మెట్రిక్‌ టన్నులే తీసుకున్నారు. వర్షాలు కురుస్తున్నాయి. కొనుగోళ్లలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. టెండర్‌ పూర్తయినా జిల్లాలో చాలా చోట్ల రహదారుల పనులు ప్రారంభం కాలేదు. ఈ ప్రాంతాలకు వెళ్తే ప్రజలు మమ్మల్ని దూషిస్తున్నారు. మీకు చాతకాకుంటే చెప్పండి మేమే పనులు చేస్తాం. అధికారులు, కొందరు నేతలు మిలాఖతై ఇసుక దందా నడిపిస్తున్నారు. ఇందులో అందరికీ వాటాలు ఉన్నాయి. ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క ఆమోదంతోనే పనులు జరుగుతాయని అంటున్నారు. ఒక బోర్‌వెల్‌ సైతం మంజూరు చేయలేక జిల్లాలో మేముండి ఏం ప్రయోజనమని..’’ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్‌బాబు, కోవ లక్ష్మి, పలువురు జడ్పీటీసీ సభ్యులు మండిపడ్డారు.

రెవెన్యూ పట్టాలున్నా ఇళ్లు కట్టుకోకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని, సాగు చేయకుండా గొడవలు చేస్తున్నారని.. జడ్పీ ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ కృష్ణారావు అన్నారు. రహదారుల పనులు వేగంగా పూర్తి చేయడంతోపాటు తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని పాలనాధికారి వెంకటేష్‌ దోత్రె పేర్కొన్నారు.


భూ కబ్జాలను అరికట్టాలి
- కోవ లక్ష్మి, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే

జన్కాపూర్‌లో, రాజంపేట వసతిగృహం ముందు, అటవీశాఖ చెక్‌పోస్టు ఎదురుగా కొందరు నేతలు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారు. పెద్దవాగు వంతెన సమీపంలో సైతం కబ్జాల పర్వం కొనసాగుతోంది. ప్రభుత్వ భూములను చదును చేసి ప్రహరీ నిర్మిస్తున్నారు. వీటిని వెంటనే అడ్డుకోవాలి. డీఎఫ్‌ఓ నీరజ్‌కుమార్, ఎఫ్‌డీఓ అప్పలకొండ స్పందించరు. గ్రామాల్లో బోర్లు వేయనీయడం లేదు. అటవీ అధికారులు చాలా మంది స్మగ్లర్లతో కుమ్మక్కై దుంగలు అమ్ముకుంటున్నారు. కూలీలు ఉపాధిహామీ డబ్బుల కోసం 10-20 కిలోమీటర్లు సంకేతాలు లేక నడవాల్సి వస్తోంది. జియో టవర్ల నిర్మాణాలు వేయనీయడం లేదు. అడవుల్లో చెక్‌డ్యాంలను ఎవరిని అడిగి కడుతున్నారు. కేసులకు భయపడం. మేము తిరగబడతాం. రెబ్బెన నుంచి నిత్యం 50-60 లారీల్లో ఇసుక వెళ్తోంది. చెన్నూర్‌ బిల్లులు చూపించి తీసుకెళ్తున్నారు. ఇందులో అందరికీ వాటాలు ఉన్నాయి.


ధాన్యం కొనుగోళ్లలో కోతలుంటే కలెక్టరేట్ ముట్టడిస్తాం

- పాల్వాయి హరీశ్‌బాబు, సిర్పూర్‌ ఎమ్మెల్యే

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్పలిన్లు, గన్నీ సంచుల కొరత ఉంది. రైతుల పొట్టకొట్టడానికి అధికారులు దళారులకు మద్దతు తెలిపేలా వ్యవహరిస్తున్నారు. కేంద్రాల్లో రెండు, మూడు కిలోలు, మిల్లుల్లో 5-6 కిలోల ధాన్యం ఒక క్వింటాలులో కోత పేరుతో అదనంగా తీసుకుంటున్నారు. ఈ విధంగా ఉంటే రైతుల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం. మరో వారంలో వర్షాలు వస్తాయి కొనుగోలు వేగవంతం చేసేలా ఇతర జిల్లాల మిల్లులకు లారీలను పంపండి. తూకంలో మోసాలు జరగకుండా పర్యవేక్షించండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని