logo

అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు

ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Updated : 25 Apr 2024 04:47 IST

తనిఖీల హంగామాపై సీఎం రమేశ్‌ ఆగ్రహం

అధికారులను హెచ్చరిస్తున్న సీఎం రమేశ్‌

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉదయం 11.05 గంటలకు తన నామినేషన్‌ పత్రాన్ని జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ రవికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నామినేషన్‌ సమయంలో మూడు వాహనాలు లోనికి వెళ్లడానికి అనుమతి ఉంటే ఒక వాహనం మాత్రమే పంపారన్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో తన బంధువులు, కుటుంబ సభ్యులు హోటళ్లలో బసచేస్తే, ఎలాంటి సెర్చ్‌ వారెంట్ లేకుండా సోదాలు చేసి దురుసుగా ప్రవర్తించారన్నారు. దీనిపై డీజీపీకి చెబితే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. అర్ధరాత్రి సమయంలో భాజపా సానుభూతిపరుడంటూ ఓ వ్యాపారి ఇంట్లో రెండుసార్లు సోదాలు చేశారని చెప్పారు. జూన్‌ 4 అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అక్రమాలకు పాల్పడిన పోలీసులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేశంలో ఏ కొత్త పథకం అమల్లోకి వచ్చినా అది తొలుత అనకాపల్లిలో చేపట్టేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవిపై సజ్జల రామకృష్ణారెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదట సజ్జలపైనే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. భగవంతుడు, అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నామినేషన్‌ వేశానని, తనతో పాటు ఏడు అసెంబ్లీ నియోజవర్గాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, దాడి వీరభద్రరావు, పాయకరావుపేట అసెంబ్లీ అభ్యర్థి వంగలపూడి అనిత మాట్లాడుతూ దేశంలో ప్రధానిగా నరేంద్రమోదీ, రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబునాయుడు అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అభివృద్ధి కోసం తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

 దేశవ్యాప్తంగా ఏకకాలంలో పూజలు: నామినేషన్‌ వేయడానికి ముందుగా సీఎం రమేశ్‌, సతీమణి శ్రీదేవి కుటుంబ సమేతంగా అనకాపల్లి నూకాలమ్మ, కన్యకాపరమేశ్వరి అమ్మవార్లను దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు, భాజపా జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు ఉన్నారు. ఈసందర్భంగా దేశంలోని అన్ని ప్రధాన దేవాలయాలతోపాటుగా అయోధ్య రామాలయంలో సీఎం రమేశ్‌ పేరుతో ఏకకాలంలో పూజలు చేయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని