logo

నమోదును మించి.. పోలింగుకు పోటెత్తి

సార్వత్రిక సమరంలో గతానికి భిన్నంగా ఈసారి ఓటర్లు పోటెత్తారు. ఎప్పుడూ పోలింగ్‌ బూత్‌ మొహం ఎరగని వారు కూడా ఈసారి ఓటెత్తారు. ఫలితంగానే రికార్డు స్థాయిలో 83.94 శాతం పోలింగ్‌ జరిగింది.

Published : 18 May 2024 05:58 IST

సంప్రదాయానికి భిన్నంగా 
పెరిగిన ఓటర్లు 38,836 మంది.. 
అదనంగా ఓట్లేసింది 74,914 మంది

ఈనాడు, అనకాపల్లి, పాడేరు, రంపచోడవరం: సార్వత్రిక సమరంలో గతానికి భిన్నంగా ఈసారి ఓటర్లు పోటెత్తారు. ఎప్పుడూ పోలింగ్‌ బూత్‌ మొహం ఎరగని వారు కూడా ఈసారి ఓటెత్తారు. ఫలితంగానే రికార్డు స్థాయిలో 83.94 శాతం పోలింగ్‌ జరిగింది. పోస్టల్‌ బ్యాలెట్‌ కలిపితే పోలింగ్‌ శాతం మరింత పెరగనుంది. గత అయిదేళ్లలో అనకాపల్లి జిల్లాలోని ఆరు నియోజవర్గాల్లో కొత్తగా నమోదైన ఓటర్లు 38,836 మంది. ఈ ఎన్నికల్లో అంతకు రెండింతల మంది ఓటేయడం విశేషం. యువత మొదలుకొని అన్ని వర్గాలు సమరోత్సాహంతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈవీఎంలు మొరాయించినా, వాతావరణం విసిగించినా గంటల తరబడి బారులు తీరి మరీ ఓటు వేశారు. ఇందులో ప్రభుత్వ వ్యతిరేక ఓటే ఎక్కువగా ఉందని కూటమి నేతలు చెబుతున్నారు.. సంక్షేమానికి ఓటేశారని అధికార పక్ష నేతలంటున్నారు. ఎవరి వాదనలో నిజముందో జూన్‌ 4 వరకు ఉత్కంఠగా ఎదురుచూడాల్సిందే.

పోలింగ్‌ పెరగడానికి వారే కారణం.. ఈ ఎన్నికల్లో యువత ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతంలో ఈ వర్గం ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపేవారు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కొంతకాలంగా రాష్ట్రం నలుదిక్కులా తిరిగి యువతను ఓటు బాట పట్టించేలా ఉత్సాహపరిచారు. ప్రభుత్వం గత అయిదేళ్లలో ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపకపోవడంతో సర్కారు తీరుపై రగిలిపోయారు. వీరంతా ఓటుతో బుద్ధి చెప్పాలని బారులు తీరి ఓటేశారు.. ఓట్లేయలేని స్థితిలో ఉన్నవారిని కూడా వారే పోలింగ్‌ కేంద్రాలకు తీసుకువచ్చి బాధ్యత చాటుకున్నారు. 

  • వలస ఓటర్లు గతంలో కంటే ఎక్కువ మంది ఈసారి వచ్చారు. కొంతమందికి అభ్యర్థులే రానుపోను రవాణా సదుపాయం కల్పించి మరీ తీసుకొచ్చారు. పోలింగ్‌లో వలస ఓటర్ల శాతం ఎక్కువ కనిపిస్తోంది. 
  • ఉద్యోగులు, సంపన్న కుటుంబాలకు చెందిన వారు గతంలో పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటేయడానికి ఇష్టపడేవారు కాదు. ఈసారి ఆ పరిస్థితి మారింది. ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌తో సరిపెట్టలేదు. కుటుంబ సభ్యులందరినీ ఓట్లు వేసేలా ప్రోత్సహించారు. అపార్ట్‌మెంటువాసులు సైతం ఓట్ల కోసం కదిలివెళ్లారు.
  • ఓటర్లకు ఇరు పార్టీల నేతలూ భారీగానే డబ్బులు పంచిపెట్టారు. పోలింగ్‌ శాతం పెరగడంపై  ఆ ప్రభావం కూడా ఉంది.
  • కూటమి ప్రకటించిన సూపర్‌  సిక్స్‌ పథకాల్లో అందరినీ ఆకట్టుకునేవి ఎక్కువగా ఉన్నాయి.. 50 ఏళ్లకే  పింఛన్ల మంజూరు, రూ.4 వేలకు పింఛను పెంపు వంటి హామీలకు వచ్చిన స్పందనగా ఓటింగ్‌ శాతం పెరిగినట్లు ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని