Pawan Kalyan: ఇక శ్వాస తీసుకోవడమూ ఆపేయమంటారా?: పేర్ని నానికి పవన్ కౌంటర్

ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం జనసేన(Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) ‘వారాహి’ (Varahi) వాహనాన్ని సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.

Updated : 09 Dec 2022 10:04 IST

అమరావతి: ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం జనసేన(Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) ‘వారాహి’ (Varahi) వాహనాన్ని సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వాహనానికి నిషేధిత రంగు వేశారంటూ వైకాపా(YSRCP)కు చెందిన మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) చేసిన విమర్శలపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పరోక్షంగా కౌంటర్‌ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 

‘వారాహి’తో యుద్ధానికి సిద్ధమంటూ జనసేన తీసుకొచ్చిన వాహనానికి నిషేధిత రంగు వేశారని వైకాపాకు చెందిన మాజీ మంత్రి పేర్నినాని చేసిన విమర్శలపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్పందించారు. ముందుగా నా సినిమాలను అడ్డుకున్నారు. విశాఖ వెళ్తే హోటల్‌ గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. విశాఖ నుంచి బలవంతంగా పంపించేశారు. మంగళగిరిలో నా కారులో వెళ్తుంటే అడ్డుకున్నారు. ఇప్పటం గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్న నన్ను ఆపేశారు. ఇప్పుడు వాహనం రంగుపైనా వివాదం చేస్తున్నారు.  కనీసం ముదురు ఆకుపచ్చ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ ట్వీట్‌ చేశారు. ఇకపై శ్వాస తీసుకోవడం కూడా ఆపేయమంటారా?’’ అని ఆయన వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. 

పేర్ని నాని ఏమన్నారంటే..

‘వారాహితో యుద్ధానికి సిద్ధం అంటూ పవన్‌ కల్యాణ్‌ తీసుకొచ్చిన వాహనానికి నిషేధిత రంగు వేశారు’ అని పేర్ని నాని ఆరోపించారు. గురువారం ఆయన ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘మిలటరీ వాహనాలకు వాడే ఆలివ్‌ గ్రీన్‌ రంగును ప్రైవేటు వాహనాలకు వినియోగించడం నిషిద్ధమని చట్టం స్పష్టంగా చెబుతోంది. అదే రంగు ఉంటే రిజిస్ట్రేషన్‌ అవ్వదు. మీరు ఎటూ రంగు మార్చాలి కదా... అదేదో పసుపు రంగు వేసుకుంటే సరిపోతుంది. మీరు తెదేపాతో కలిసి వెళ్లేవారే కదా? ఇప్పుడేదో ప్రధాని మోదీ చెప్పడంతో నాలుగు రోజులు ఆగారు కదా. వ్యాన్లతో ఎన్నికల యుద్ధం అయిపోతుందనుకుంటే ప్రతి ఒక్కరూ వాటినే కొనేస్తారు. నేనూ కొనలేనా? ఇలాంటివి సినిమాల్లో అయితే బాగుంటాయి’ అని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో పేర్ని నాని వ్యాఖ్యలపై పవన్‌ స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని