వైకాపా బాధితులకు న్యాయం చేయాలి

వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు.

Published : 27 Apr 2024 05:33 IST

నేటి నుంచి కోవూరు శ్రీలక్ష్మి నిరవధిక నిరాహార దీక్ష

గుంటూరు నగరం, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల అరాచకాలపై దిల్లీలో చేతి వేలు కోసుకుని నిరసన తెలిపిన శ్రీలక్ష్మి.. శుక్రవారం గుంటూరు లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద విలేకర్లతో మాట్లాడారు. వైకాపా నాయకులు బహిరంగంగా గంజాయి విక్రయిస్తూ, యువతను రౌడీషీటర్లుగా మార్చారని ఆరోపించారు. వారి అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందనా లేకపోవడంతో దిల్లీ వెళ్లి ఫిర్యాదు చేశామన్నారు. ప్రజాసంఘాలు, మహిళా సంఘాల మద్దతుతో నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నానని శ్రీలక్ష్మి చెప్పారు.

గర్భిణి అని చూడకుండా దాడిచేశారు

గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా గుండాలు తనను బజారులోకి ఈడ్చుకెళ్లి కాళ్లు చేతులు కట్టేసి దాడిచేశారని మంగళగిరి సమీపంలోని నవులూరుకు చెందిన నామాల అమృతవర్షిణి బోరున విలపించారు. శ్రీలక్ష్మితో కలిసి ఆమె మాట్లాడారు. ‘మేము ఉంటున్న ఇంటి యజమానికి మా అమ్మ రూ.10 లక్షలు ఇచ్చారు. ఆ డబ్బులు ఎగ్గొట్టేందుకు మా కుటుంబంపై దాడిచేసి బజారున పడేశారు. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే నా పైనే తప్పుడు కేసు పెట్టారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు