logo

పద్దు పొడుపుపైౖ గంపెడాశలు

సార్వత్రిక ఎన్నికల ముందు వచ్చే కేంద్ర బడ్జెట్‌ కావడంతో.. ఉద్యోగులు, రైతులు, యువతకు మేలు చేసేలా ఉంటుందనే అంచనాలున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో రైల్వే సహా అనేక కేంద్ర ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరు.

Updated : 01 Feb 2024 08:00 IST

కేంద్రం ఆదుకుంటుందని వివిధ వర్గాల ఎదురుచూపు 

ఈనాడు, అమరావతి : సార్వత్రిక ఎన్నికల ముందు వచ్చే కేంద్ర బడ్జెట్‌ కావడంతో.. ఉద్యోగులు, రైతులు, యువతకు మేలు చేసేలా ఉంటుందనే అంచనాలున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో రైల్వే సహా అనేక కేంద్ర ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరు. రెండు జిల్లాల్లో కలిపి నాలుగు లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. అన్ని రకాల పంటలు కలిపి ఏటా 12.50 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రైతుకు మేలు చేసేలా ఈసారి బడ్జెట్‌ ఉంటే బాగుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

యువతకు అవకాశాలు పెంచేలా..

రాష్ట్రంలోనే అత్యధికంగా రెండు జిల్లాల్లోనూ యువత, విద్యాసంస్థలు ఉన్నాయి. యువతకు ఉపాధి అవకాశాలను పెంచడంపై మరింత దృష్టిపెడితే బాగుంటుంది. ఏటా రెండు జిల్లాల్లో రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంజినీరింగ్‌, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సులను పూర్తిచేస్తున్నారు. వీరికి ఉపాధి చూపడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైంది. గత బడ్జెట్‌లో కేంద్రం ప్రవేశపెట్టినట్లు ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన(పీఎంకేవీవై) వంటివి ఈసారి కూడా పెడితే బాగుంటుంది.

పర్యాటకానికి ఊతమివ్వాలి..

రెండు జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ప్రధానంగా భవానీద్వీపం సహా అనేక ప్రకృతి సహజ పర్యాటక ప్రాంతాలున్నాయి. గత కేంద్ర బడ్జెట్‌లో మాదిరి పర్యాటక రంగం అభివృద్ధి కోసం.. ప్రత్యేక మొబైల్‌ యాప్‌ రూపకల్పన వంటివి ఈసారి మరిన్ని పెంచాలి.

వేతన జీవుల నిరీక్షణ...

ఆదాయపన్ను పరిమితి ఈసారి పెంచుతారనే ఆశాభావంలో అందరూ ఉన్నారు. ప్రధానంగా ఉద్యోగులు సహా ఇతర పన్ను చెల్లింపుదారులంతా ఈసారి పరిమితి మరింత పెంచే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. రెండు జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.

ఎంఎస్‌ఎంఈలకు ఆసరా ఇస్తే..

దేశ జీడీపీలో 35 శాతంపైగా వాటాతో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈసారి కేంద్ర బడ్జెట్‌లో ఊతమివ్వాలని పారిశ్రామిక వర్గాలు ఆశిస్తున్నాయి. కరోనా ప్రభావంతో దెబ్బతిన్న పరిశ్రమలు నేటికీ కోలుకోలేకపోతున్నాయి. ఈసారి బడ్జెట్‌లో ఎంఎస్‌ఎంఈలకు సహకారం అందించాలని కోరుకుంటున్నారు.

రైల్వే పెండింగ్‌ ప్రాజెక్టులు చాలానే...

విజయవాడ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ, రద్దీకి తగ్గట్టుగా ప్లాట్‌ఫాంల సంఖ్యను మరో రెండు మూడు పెంచాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. విజయవాడ సహా రెండు జిల్లాల్లో పలు ఆర్వోబీలు నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి. విజయవాడ రైల్వేస్టేషన్‌కు అనుసంధానంగా శాటిలైట్‌ స్టేషన్ల అభివృద్ధి, కొత్త రైళ్ల ఏర్పాటు కొలిక్కి రాలేదు. స్టేషన్‌ నుంచి నిత్యం 250 రైళ్లు, లక్షన్నర మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రైళ్ల రద్దీకి పరిష్కారంగా విశాఖ వైపు నుంచి వచ్చే రైళ్లను కొన్ని రామవరప్పాడు, గుణదలలో ఆపేసి.. అక్కడి నుంచి రాయనపాడు మీదుగా హైదరాబాద్‌ వైపు మళ్లించాలనేది ప్రణాళిక. హైదరాబాద్‌ వైపు నుంచి వచ్చే రైళ్లను కొన్నింటిని రాయనపాడులో ఆపేసి.. అటునుంచి విజయవాడ స్టేషన్‌కు రాకుండా బయట నుంచే విశాఖ వైపు పంపించేస్తారు. కృష్ణా కెనాల్‌ స్టేషన్‌ను కూడా శాటిలైట్‌ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలి. మౌలిక సౌకర్యాల ఏర్పాటు, రైళ్లను మళ్లించేందుకు అవసరమైన అభివృద్ధి చేపట్టాలి. ఇప్పటికే రాయనపాడు నుంచి ప్రయోగాత్మకంగా కొన్ని రైళ్లను ఆపుతున్నా.. పూర్తిగా లేదు. 2016లో కృష్ణా పుష్కరాలప్పుడు రూ.50 కోట్లతో ఈ శాటిలైట్‌ స్టేషన్లను ఆధునికీకరించాలని ప్రతిపాదించినా.. కొంతవరకే పనులు చేపట్టారు. వీటిని అందుబాటులోకి తేవడంలో విఫలమయ్యారు.
వి విజయవాడ నుంచి దేశంలో అన్ని ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీ అధికం. విజయవాడ-నాగపట్నం మధ్య వేళంగిని ఎక్స్‌ప్రెస్‌ను నడపాలనే ప్రతిపాదన ఉంది. ఈ ప్రాంత క్రిస్టియన్‌ మైనార్టీలకు ఈ రైలు ఎంతో ప్రయోజనకరం. ముంబయి, జైపూర్‌, బెంగళూరుకు కొత్త రైళ్లు కావాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని