logo

అరటి రైతు విలవిల

అరటి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెండు రోజులుగా కురుస్తున్న గాలి, వానకు చెట్లు భారీగా పడిపోయాయి. దీంతో ఒక్కో రైతుకు రూ. లక్షల్లో నష్టం వాటిల్లింది.

Updated : 18 May 2024 05:42 IST

గాలి వానకు కూలిన తోటలు

రూ.లక్షల్లో నష్టం

న్యూస్‌టుడే, తోట్లవల్లూరు: అరటి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెండు రోజులుగా కురుస్తున్న గాలి, వానకు చెట్లు భారీగా పడిపోయాయి. దీంతో ఒక్కో రైతుకు రూ. లక్షల్లో నష్టం వాటిల్లింది. రొయ్యూరు, వల్లూరుపాలెం, తోట్లవల్లూరు, పాములలంక, భద్రిరాజుపాలెం, చాగంటిపాడు, దేవరపల్లి, గుర్విందపల్లి, ఐలూరు గ్రామాల్లోని లంక భూముల్లో రైతులు అరటి పంట వేశారు. తోట్లవల్లూరు మండలంలో ఈ ఏడాది 4,200 ఎకరాల్లో అరటి సాగు చేశారని ఉద్యాన శాఖాధికారి జోసఫ్‌చందు తెలిపారు. చిన్న, పెద్ద గెలలు వచ్చిన చెట్లన్నీ కూలిపోయాయి. చేతికి అంది వచ్చే సమయంలో కురిసిన అకాల వర్షంతో సుమారు ఆరు నెలలుగా పెంచిన చెట్లు నేల వాలిపోయాయి. రూ.లక్షలు ఖర్చు చేసి సాగు చేసిన పంటంతా పాడైపోవడంతో అన్నదాతలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎకరం సాగుకు ఎరువులు, కలుపు నివారణ, కూలీలు తదితర వాటికి సుమారు రూ.90 వేల వరకు ఖర్చు చేశారు. ఏటా మే, జూన్‌ నెలల్లో కురిసే వానలు, గాలులకు చెట్లు పడిపోతున్నాయి. ఏటా నష్టం వాటిల్లుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

 రూ.6 లక్షలు ఆవిరి

ఈ ఏడాది నాలుగు ఎకరాల్లో అరటి సాగు చేశాను. చెట్లకు గెలలు వచ్చాయి. రెండు నెలలుంటే పంట చేతికి వస్తుందని ఆశించాం. ఆకస్మికంగా వచ్చిన గాలి వానకు 4 ఎకరాల్లో చెట్లు పడిపోయాయి. పెట్టుబడి నష్టపోయాను. గతేడాది కూడా చెట్లు కూలిపోయి నష్టం వాటిల్లింది. పడిపోయిన చెట్లు తొలగించేందుకు అదనపు ఖర్చు చేయాల్సి వస్తోంది.
గుత్తా రాము, రైతు, తోట్లవల్లూరు


ఏటా ఇదే పరిస్థితి

ఏటా మే, జూన్‌ నెలల్లో కురిసే గాలి వానకు అరటి చెట్లు పడిపోయి నష్టపోతున్నాం. ఈ ఉడాది అయిదు ఎకరాల్లో అరటి సాగు చేసి సుమారు రూ.4 లక్షలు పెట్టుబడి పెట్టాను. గాలివానకు చెట్లన్నీ నేలవాలాయి. సుమారు రూ.పది లక్షల వరకు నష్టం వాటిల్లింది. నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గెలలకు సరైన గిట్టుబాటు ధరలు ఉండటం లేదు. మార్కెట్‌ సదుపాయం కూడా అంతంతమాత్రమే. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

గంగిశెట్టి సత్యనారాయణ, కౌలు రైతు, తోడేళ్లదిబ్బలంక

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని