logo

సత్యసాయి తాగునీటి పథకం నిర్వహణ అస్తవ్యస్తం

భూగర్భ జలాలు అడుగంటిపోవడం, సత్యసాయి తాగునీటి పథకం నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేయడంతో శ్రీసత్యసాయి జిల్లా ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు.

Published : 19 May 2024 04:46 IST

పాలకులు, అధికారుల నిర్లక్ష్యం
వంద గ్రామాలకు ఆగిన సరఫరా

నల్లమాడలో తాగునీటి సరఫరా కేంద్రం

పుట్టపర్తి, న్యూస్‌టుడే: భూగర్భ జలాలు అడుగంటిపోవడం, సత్యసాయి తాగునీటి పథకం నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేయడంతో శ్రీసత్యసాయి జిల్లా ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. గుక్కెడు నీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఉమ్మడి అనంత జిల్లా ప్రజల దాహార్తి తీర్చాలన్న ఉద్దేశంతో కోట్ల రూపాయల వ్యయంతో పుట్టపర్తి సత్యసాయి బాబా సత్యసాయి తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. తద్వారా రక్షిత నీటిని అందించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పథకం నిర్వహణకు ప్రభుత్వం సక్రమంగా నిధులు మంజూరు చేయకపోవడంతో ఆర్థిక గండం పట్టిపీడిస్తోంది. చిన్నపాటి మరమ్మతులు వచ్చినా రిపేరీ చేసుకోలేని పరిస్థితిలో ఉంది. నిర్వహణ లోపంతో ఎప్పుడు ఏ గ్రామానికి నీటి సరఫరా ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఏడాదిగా వందల గ్రామాలకు నీటి సరఫరా కావడం లేదు. కరవు ప్రాంతమైన ఉమ్మడి అనంత జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు చేపట్టిన పథకం లక్ష్యం నిర్వహణ లోపంతో నీరుగారిపోతోంది. 16 నెలల కిందట జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షాలకు పైపులైన్‌ దెబ్బతింది. చిన్నపాటి మరమ్మతులు చేయడానికీ నిధులు లేకపోవడంతో నిర్వహణను అధికారులు, పాలకులు గాలికి వదిలేశారు. చిత్రావతి జలాశయంలో విద్యుత్తు అంతరాయంతో నీటి సరఫరా సక్రమంగా కావడం లేదు. తాగునీటి పథకం నిర్వహణ ఛైర్మన్లుగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి పథకం నిర్వహణను గాడిలో పెట్టి గ్రామాలకు తాగునీటి సరఫరా చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

పట్టించుకునే నాథుడే కరవు

2022 ఆక్టోబరులో కురిసిన వర్షాలకు చిత్రావతి ఉద్ధృతంగా ప్రవహించడంతో.. పైపులైన్‌ పూర్తిగా దెబ్బతిని కొట్టుకుపోయింది. పైపులైన్‌ దెబ్బతినడంతో బుక్కపట్నం, పుట్టపర్తి, కొత్తచెరువు, చెన్నేకొత్తపల్లి మండలాల పరిధిలోని  గ్రామాలకు తాగునీటి నీటి సరఫరా ఆగిపోయింది. కొన్ని గ్రామాలకు మాత్రమే మరమ్మతులు చేశారు. దాదాపు వంద గ్రామాలకు సక్రమంగా తాగునీరు సరఫరా కావడం లేదు. వీటితో పాటు సీబీఆర్‌ తాగునీటి పథకం పంపింగ్‌ కేంద్రం వద్ద తరచూ విద్యుత్తు అంతరాయం ఏర్పడుతుండటంతో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. చాలాచోట్ల తాగునీటి పంపింగ్‌ కేంద్రాల్లో మోటార్లు మరమ్మతులకు గురై మూలనపడ్డాయి. వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సత్యసాయి తాగునీటి పథకం నుంచి నల్లమాడ, ఓడీసీ, అమడగూరు మండలాలకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తాగునీరు సరఫరా కావడం లేదు. సత్యసాయి తాగునీటి ట్యాంకులు దిష్టిబొమ్మల్లా దర్శనం ఇస్తున్నాయి. అరకొరగా కొన్ని గ్రామాలకు మాత్రమే సరఫరా అవుతున్నాయి.

బుక్కపట్నం సమీపంలో చిత్రావతినది ఉద్ధృతికి దెబ్బతిన్న పైపులైన్‌ నేటికీ మరమ్మతులు చేయలేదు

పేరుకుపోయిన బకాయిలు

జిల్లావ్యాప్తంగా 5 మున్సిపాలిటీలతో పాటు 648 గ్రామాలకు రోజూ 7.50 కోట్ల లీటర్లు తాగునీటిని ప్రజలకు అందిస్తున్నారు. విద్యుత్తు శాఖ అధికారులు రూ.315 కోట్లు బకాయిలు చెల్లించాలని తాగునీటి పథకానికి నోటీసులు జారీ చేస్తున్నారు. మున్సిపాలిటీ, నగర, మేజర్‌ పంచాయతీల నుంచి రూ.123,90,93,564 బకాయిలు వసూలు కావాల్సి ఉంది. సత్యసాయి తాగునీటి పథకం నిర్వహణ వ్యయం కింద కేవలం రూ.27 ప్రకారం నామమాత్రపు రుసుముకే వెయ్యి లీటర్లు సరఫరా చేస్తున్నారు. 1995 నుంచి 2024 వరకు బకాయిలు చెల్లించాలని బోర్డు నోటీసులు పంపుతున్నా.. 29 ఏళ్లుగా సక్రమంగా చెల్లించకపోవడంతో బకాయిలు రూ123.90 కోట్లకు చేరుకున్నాయి.


అన్ని గ్రామాలకు తాగునీరందించేలా చర్యలు

- రామారావు, సత్యసాయి తాగునీటి పథకం డీఈ

సత్యసాయి తాగునీటిని సరఫరా చేసే అన్ని గ్రామాలకు నీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. రహదారుల పనుల వల్ల కొన్ని గ్రామాలకు తాగునీరు సరఫరా కావడం లేదు. నల్లమాడ, ఓడీసీ, అమడగూరు మండలాలకు సత్యసాయి తాగునీటిని సరఫరా చేస్తున్నాం. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు నిర్వహణ చూసుకోవాలి. వేసవిలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని