Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 02 Jun 2024 13:02 IST

1. విశాఖపట్నంలో ఈదురుగాలులతో భారీ వర్షం

విశాఖపట్నం: నగరంలో ఆదివారం ఉదయం ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై చెట్లు కూలాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్షం, ఈదురుగాలులతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీల్లో వరదనీరు ఉప్పొంగడంతో కొన్నిచోట్ల మ్యాన్‌హోళ్లు తెరుచుకున్నాయి. అక్కయ్యపాలెంలోని నందినగర్‌లో ఓ కారుపై చెట్టు కూలింది. పూర్తి కథనం

2. మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో భారాస విజయం!

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భారాస విజయం సాధించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై భారాస అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి 109 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు సమాచారం. మార్చి 28న పోలింగ్‌ నిర్వహించగా.. నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో కౌంటింగ్‌ నిర్వహించారు. పూర్తి కథనం

3. సీఎం రేవంత్‌ నేతృత్వంలో గ్యారంటీలను అమలు చేస్తాం: సోనియాగాంధీ

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని సోనియా విడుదల చేశారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఈ వీడియోను ప్రదర్శించారు.పూర్తి కథనం

4. తెలంగాణ ప్రజలు బానిసత్వాన్ని భరించరు: ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్‌

తెలంగాణ జీవనశైలి స్వేచ్ఛ అని.. ఇక్కడి ప్రజలు బానిసత్వాన్ని భరించరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం రాష్ట్ర ప్రజల తత్వమని చెప్పారు. సంక్షేమం ముసుగులో చెరబట్టాలని చూస్తే ఇక్కడి సమాజం సహించదన్నారు.పూర్తి కథనం

5. పుణె కారు ప్రమాదం..దర్యాప్తునకు 100మంది పోలీసులు

మహారాష్ట్రలోని పుణె (Pune)లో ఓ టీనేజర్ ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు మృతి చెందిన కేసు (Pune Porsche Crash)లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. విస్తృత స్థాయి దర్యాప్తులో భాగంగా తాజాగా 100 మంది సిబ్బందితో కూడిన డజనుకు పైగా బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.పూర్తి కథనం

6. డ్రాగన్‌ ఘనత.. జాబిల్లి ఆవలివైపు ల్యాండ్‌ అయిన చాంగే-6..!

చైనాకు చెందిన లూనార్‌ల్యాండర్‌ చాంగే-6 విజయవంతంగా జాబిల్లి ఆవలివైపు ల్యాండ్‌ అయింది. ఈ విషయాన్ని చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకటించింది. బీజింగ్‌ కాలమానం ప్రకారం నేటి ఉదయం అయిట్కిన్‌ బేసిన్‌ పేరిట ఉన్న ప్రదేశంలో సురక్షితంగా ఉపరితలాన్ని తాకినట్లు పేర్కొంది. పూర్తి కథనం

7. కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: భాజపా ఎంపీ లక్ష్మణ్‌

తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది ప్రాణాలను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బలి తీసుకుందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి భాజపా మద్దతు తెలిపి పోరాటం చేసిందన్నారు.పూర్తి కథనం

8. కౌంటింగ్‌ నిబంధనలపై కాంగ్రెస్‌ అభ్యంతరాలు.. స్పష్టతనిచ్చిన ఈసీ

కౌంటింగ్‌ నిబంధనలు ఈవీఎంల రిగ్గింగ్‌ కోసమే మార్చారంటూ ఓ కాంగ్రెస్‌ (Congress) నేత చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. దీనిపై స్పందించిన దిల్లీ ఈసీ వివరణ ఇచ్చింది. ‘‘అభ్యర్థుల కౌంటింగ్‌ ఏజెంట్లను తొలిసారి ఏఆర్‌వో టేబుల్స్‌ వద్దకు అనుమతించడంలేదు. నేను తొమ్మిది లోక్‌సభ, విధాన్‌సభ ఎన్నికలను చూశాను. ఇలా జరగడం ఇదే తొలిసారి. ఇదే నిజమైతే ఈవీఎంల రిగ్గింగ్‌ కన్నా పెద్దది.పూర్తి కథనం

9. మరోసారి టైం వేస్టు చేసుకోవద్దు: ఎగ్జిట్‌ పోల్స్‌ తర్వాత ప్రశాంత్‌ కిశోర్‌ స్పందన

కొందరు చేపట్టే అనవసర రాజకీయ చర్చలు వింటూ సమయం వృథా చేసుకోవద్దని ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) ప్రజలకు సలహా ఇచ్చారు. నిన్న పలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు తన అంచనాలకు అనుకూలంగా వెలువడిన తర్వాత ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తొలిసారి స్పందించారు.పూర్తి కథనం

10. పార్టీ నేతలకు కేజ్రీవాల్ సందేశం..ఏమన్నారంటే..

ఎన్నికల ప్రచారానికి సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ముగియడంతో నేడు(ఆదివారం) తిహాడ్‌ జైల్లో లొంగిపోతానని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తెలిపారు. లొంగిపోయే ముందు రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ స్మారకాన్ని, కన్నాట్ ప్రాంతంలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తానని తెలిపారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు