logo

జగనన్న ‘ఘోర’ముద్ద

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనం అందించేందుకు జగనన్న గోరుముద్ద కార్యక్రమం ప్రవేశపెట్టామని, రోజూ మెనూ ప్రకారం భోజనం అందిస్తామని సీఎం జగన్‌ చెప్పారు.

Published : 20 Apr 2024 06:25 IST

ముద్దగడుతున్న అన్నం.. తినని విద్యార్థులు
పత్తాలేని చిక్కీలు, కోడిగుడ్ల పంపిణీ
జిల్లాలో ఇదీ పరిస్థితి

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనం అందించేందుకు జగనన్న గోరుముద్ద కార్యక్రమం ప్రవేశపెట్టామని, రోజూ మెనూ ప్రకారం భోజనం అందిస్తామని సీఎం జగన్‌ చెప్పారు. అయితే మెనూ అమలు మాట దేవుడెరుగు ప్రభుత్వం అందిస్తున్న నాసిరకం బియ్యం ముద్ద కడుతోంది. దీంతో పలువురు విద్యార్థులు ఆ భోజనం తినడానికి కూడా ఇష్టపడటం లేదు. ఇళ్ల నుంచి తెచ్చుకుని తినాల్సిన పరిస్థితి.

న్యూస్‌టుడే, చిత్తూరు(విద్య), పుత్తూరు, బంగారుపాళ్యం

పుత్తూరు: జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ముద్ద కట్టిన ఇస్కాన్‌ భోజనం

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు బలవర్ధకమైన ఆహారం లేకపోవడంతో అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, దీంతో చదువుల్లో వెనకబడి పోతున్నారని తలచి ప్రభుత్వం గత కొన్నేళ్లుగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి రోజు వారికి బలవర్ధక ఆహారం అందించాలన్నది లక్ష్యం. అయితే అమల్లో లోపాల కారణంగా పూర్తిస్థాయిలో అది అమలు కావడంలేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 10 నుంచి 20శాతం మంది విద్యార్థులు పాఠశాలలో వడ్డించే మధ్యాహ్న భోజనం తినడం లేదు. ఇళ్ల నుంచి తెచ్చుకుని తింటున్నారు. నగరి నియోజకవర్గంలోని వడమాలపేట, పుత్తూరు మండలం, పుత్తూరు మున్సిపాలిటీలోని కొన్ని పాఠశాలలకు ఇస్కాన్‌ భోజనం అందిస్తున్నారు. అది ఉదయం తిరుపతిలో తయారుచేసి అందిస్తున్నారు. మధ్యాహ్నానికి చల్లబడిపోతోంది. దీనికితోడు ముద్ద కడుతోంది. దీన్ని పిల్లలు తినడానికి ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో ఈ మండలాల్లోని 50శాతం మంది పిల్లలు ఇళ్ల నుంచి తెచ్చుకుంటున్నారు. కుప్పం ప్రాంతంలో అక్షయ పాత్ర సంస్థ పలు పాఠశాలలకు మధ్యాహ్న భోజనం తయారు చేసి అందిస్తుండటం గమనార్హం.

డ్రమ్మునీరే దిక్కు

రెండు నెలల క్రితం విద్యాశాఖ ఉన్నతాధికారులు పరిశీలించిన సమయంలో విద్యార్థులు మధ్యాహ్న భోజన విషయమై చెప్పారు. నాసిరకం బియ్యం అందిస్తే వాటిని తిరిగి ఇచ్చేయాలని, మంచి బియ్యం తీసుకోవాలని సెలవిచ్చారు. అయితే కొందరు పాఠశాలల హెచ్‌ఎంలు.. ఉన్న బియ్యంతో పిల్లలకు మధ్యాహ్న భోజనం వండి వడ్డిస్తున్నారు. దీనికితోడు గుత్తేదారులకు బిల్లులు రూ.8.76కోట్లు చెల్లించాల్సి ఉంది.

  • బంగారుపాళ్యెం జడ్పీ ఉన్నత పాఠశాలలో 680 మంది విద్యార్థులు చదువుతున్నారు. నాడు-నేడు కింద కింద రూ.7.8 లక్షలతో తాగునీటి శుద్ధి యంత్రం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన మూణ్నాళ్లకే అది మూలన పడింది. అప్పటి నుంచి స్థానికంగా ఉన్న బోరు నీటిని డ్రములు ఏర్పాటు చేసి నింపుతున్నారు. ఆ నీరే విద్యార్థులకు గతి.
  • పుత్తూరు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 400 పైచిలుకు విద్యార్థినులు చదువుతున్నారు. వారికి ఇస్కాన్‌ సంస్థ మధ్యాహ్న భోజనం కొన్నేళ్లుగా అందిస్తోంది. అయితే ఆ సంస్థ భారీ సంఖ్యలో విద్యార్థులకు భోజనం తయారు చేస్తుంటారు. అది ఎప్పుడో ఉదయం చేసి పాఠశాలలకు వచ్చేటప్పటికీ భోజనం చల్లబడిపోతోంది. దీనికితోడు అన్నం ముద్ద కడుతోంది. దీంతో విద్యార్థులు అది తినలేక ఇంటి నుంచి తెచ్చుకుని తింటున్నారు.
  • పూతలపట్టు జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తింటే ఆరోగ్యం సహకరించడం లేదని  విద్యార్థులు ఇంటి నుంచి భోజనాలు తెచ్చుకుని తింటుండటం గమనార్హం.

పూతలపట్టు ఉన్నత పాఠశాలలో క్యూలైన్‌లో విద్యార్థులు

అందని బిల్లులు..: జిల్లాలో చిక్కీలకు సంబంధించి గుత్తేదారులకు రూ.2.23 కోట్లు, కోడిగుడ్లకు రూ.6.53కోట్లు బిల్లు బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు.


అన్నం ముద్ద కట్టడంతో తినలేక..

మధ్యాహ్న భోజనానికి నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారు. నాలుగుసార్లు కడిగి వండినా ముద్ద కడుతోంది. ముద్దకట్టిన అన్నంలో సాంబారు కలిపి తింటే నోటికి ఎక్కడం లేదు. దీంతో పిల్లలు చాలా మంది ఇళ్ల నుంచే భోజనం తీసుకెళ్తున్నారు.

షాజిదా, పుత్తూరు


నాణ్యత కొరవడింది..

ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద కార్యక్రమం అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత కొరవడుతోంది. 10 నుంచి 20 శాతం పిల్లలు ఇళ్ల నుంచి భోజనాలు తెచ్చుకుని తింటున్నారు. పలు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి యంత్రాలు అప్పుడే పనిచేయడంలేదు. దీంతో ఇళ్ల నుంచి నీరు తీసుకెళ్తున్నారు. 

పార్వతి, పూతలపట్టు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని