logo

పోరు.. ఖరారు

సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. బరిలో నిలిచింది ఎందరో తేలిపోయింది. మరోవైపు తుది, అనుబంధ ఓటర్ల జాబితాలు ఖరారయ్యాయి.

Updated : 30 Apr 2024 06:26 IST

లోక్‌సభకు 23.. శాసనసభకు 133
నామినేషన్ల ప్రక్రియ పూర్తి
ఆయా స్థానాలకు బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలు వెల్లడి

మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, చిత్రంలో ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌

సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. బరిలో నిలిచింది ఎందరో తేలిపోయింది. మరోవైపు తుది, అనుబంధ ఓటర్ల జాబితాలు ఖరారయ్యాయి. మొత్తం 18,12,980 మంది ఓటర్లు 2014 సార్వత్రిక సమరంలో తమ ఓటుహక్కు వినియోగించుకుని 156 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు.

తిరుపతి (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: జిల్లా పరిధిలో నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ పర్యవేక్షణలో ఆయా నియోజకవర్గాల ఆర్వోలు పూర్తిచేశారు. సోమవారం ఎస్పీ కృష్ణకాంత్‌ పాటిల్‌తో కలిసి కలెక్టర్‌ ఆ వివరాలు వెల్లడించారు. తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి 23 మంది అభ్యర్థులు, ఏడు శాసనసభ స్థానాలకు సంబంధించి 133 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినట్లు తెలిపారు. జిల్లాలో ప్రధాన నియోజకవర్గాలైన తిరుపతిలో అత్యధికంగా 46 మంది పోటీలో నిలవగా, చంద్రగిరిలో 24 మంది అభ్యర్థులు తలపడనున్నట్లు చెప్పారు. వచ్చేనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు  రూ.1.51 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ జరిగేలా చూస్తామన్నారు. కేంద్రం నుంచి మరో నాలుగు అదనపు భద్రతా బృందాలు రానున్నాయన్నారు.

  • సర్వీసు ఓటర్ల సంఖ్య: 24,596
  • 85 సంవత్సరాలు నిండిన ఓటర్లు: 7,924
  • జిల్లాలోని పోలింగ్‌ స్టేషన్లు : 2,140
  • సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు: 696
  • పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం వచ్చిన దరఖాస్తులు: 22,416

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని