logo

వైద్యరంగానికి ఇదేనా పెద్దపీట

వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. అరుదైన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగుల పట్ల కనీసం కనికరం  లేకుండా వ్యవహరిస్తున్నారు.

Published : 20 Apr 2024 02:51 IST

 నాలుగు నెలలుగా మందుల్లేక విలవిల
దయనీయంగా హీమోఫీలియా రోగుల దుస్థితి 

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం : వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. అరుదైన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగుల పట్ల కనీసం కనికరం  లేకుండా వ్యవహరిస్తున్నారు. శరీరంలో(ఇంటర్నల్‌ బ్లీడింగ్‌) రక్తస్రావమై వాపులు, దెబ్బతగిలితే రక్తస్రావం ఆగకపోవడం వంటి అరుదైన అధిక రక్తస్రావ వ్యాధి(హీమోఫీలియా)తో బాధపడుతున్న రోగులకు గత నాలుగు నెలలుగా మందులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ జీజీహెచ్‌లలో ఇవి అందుబాటులో ఉండేవి. నాలుగు నెలల నుంచి మందులు రాకపోవడంతో నొప్పులు తట్టుకోలేక.. వ్యాధి తీవ్రత పెరిగిపోయి రోగులు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు.

ఇదీ పరిస్థితి..

ఉమ్మడి జిల్లాలో హీమోఫీలియాతో బాధపడు తున్న వారు సుమారు 200 మంది వరకు ఉన్నారు. వీరికి గతం నుంచి కాకినాడ జీజీహెచ్‌లో మందులు అందిస్తున్నారు. రాజమహేంద్రవరం వైద్యశాల జీజీహెచ్‌గా మారినప్పటి నుంచి ఇక్కడ సైతం ఆ ఇంజక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ రోగుల్లో రక్తం గడ్డకట్టే స్వభావం ఉండదు. సాధారణ రోగులకు చిన్న రక్తస్రావమైతే కొద్దిసేపటికి ఆగిపోతుంది. ఈ వ్యాధిగ్రస్తుల్లో మాత్రం గంటల తరబడి రక్తం కారుతూనే ఉంటుంది. శరీరానికి ఏదైనా గాయమైనా లోపల ఇంటర్నల్‌గా రక్తస్రావమై ఒళ్లంతా వాపులు వస్తుంటాయి. అలాంటప్పుడు వారి పరిస్థితి దయనీయం. చస్తూ బతుకుతూ నెట్టుకొస్తుంటారు. అప్పుడు వారికి ఫ్యాక్టర్‌-7, ఫ్యాక్టర్‌-8, ఫ్యాక్టర్‌-9 అనే మందును ఇంజక్షన్ల రూపంలో అందజేస్తే వారికి స్వల్ప ఉపశమనం కలుగుతుంది.

డిసెంబరు నుంచి నిలిపివేత

ఈ ఇంజక్షన్లు గతేడాది డిసెంబర్‌ నుంచి కాకినాడ, రాజమహేంద్రవరం జీజీహెచ్‌లకు సరఫరా నిలిచిపోయింది. జాతీయ ఆరోగ్య మిషన్‌, రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నిధులతో వీటిని కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారుల సమన్వయ లోపం, త్వరగా సరఫరా చేసేలా పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో పంపిణీ నిలిచిపోయింది. ఈ మందు ప్రైవేటులో కొనుగోలు చేసి వేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక్కొక్కరూ వారి వ్యాధి తీవ్రతను బట్టి నెలకు అయిదారు సార్లు.. అంతకంటే  ఎక్కువ సార్లు డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోడోసు బయట మార్కెట్లో కొనుగోలు చేస్తే రూ.10 వేల వరకు ఖర్చవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా లేదని వాపోతున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు సమస్యపై దృష్టిసారించి త్వరగా మందులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ మందులు అందుబాటులో లేక రెండు నెలల కిందట కోనసీమకు చెందిన ఓ రోగి మృతిచెందడం దుస్థితికి అద్దం పడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని