logo
Published : 01/12/2021 01:03 IST

రూ 10 కే సేవలు

ఓపీడీకి పెరిగిన రోగుల సంఖ్య

పేదలకు అందుబాటులో ఎయిమ్స్‌


పేర్లు నమోదు చేసుకుంటున్న రోగులు

మంగళగిరి, న్యూస్‌టుడే : రాష్ట్రంలోని పేద రోగులకు అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్‌) వరంగా మారింది. మంగళగిరిలో రెండు కొండల నడుమ 200 ఎకరాల విస్తీర్ణంలో ఆహ్లాదకర వాతావరణంలో 200 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,680 కోట్ల వ్యయంతో తీర్చిదిద్దిన ఈ అత్యాధునిక వైద్యాలయంలో రోగులకు వివిధ సేవలు అందుతున్నాయి. పలురకాల వ్యాధులకు నామమాత్రపు రుసుంతో వైద్యమందించడమే కాకుండా వివిధ రకాల పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం ఓపీ (అవుట్‌ పేషెంట్స్‌) విభాగం అందుబాటులో వచ్చింది. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి రోజూ సుమారు 1150 నుంచి 1300 మంది రోగులు ఓపీలో వైద్య సేవలు పొందుతున్నారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణాతో పాటు తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో రోగులు వస్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన వారు ముందుగా పేర్లు నమోదు చేసుకొని, బిల్లింగ్‌ కౌంటర్‌ వద్దకు వెళ్లి రూ.10 రుసుం చెల్లిస్తే చాలు మనకు అవసరమైన వైద్యులు అందుబాటులో వస్తారు.

ఎయిమ్స్‌ చికిత్స కేంద్రాలు

సామాజిక వైద్య సేవల్లో భాగంగా మంగళగిరి అర్బన్‌ ఆస్పత్రి, నూతక్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ ఎయిమ్స్‌ కేంద్రాలు నడుస్తున్నాయి. త్వరలో పూర్తిస్థాయిలో ఓపీ విభాగాలను ఆయా కేంద్రాల్లో అమలు చేయనున్నారు. ఇప్పటికే నూతక్కి పీహెచ్‌సీకి ఎయిమ్స్‌ వైద్యులు వెళ్లి సేవలందిస్తున్నారు.

మరిన్ని వసతులు కావాలి

ఎయిమ్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున మరిన్ని మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. రహదారి సౌకర్యం సమకూరినా, వీధి దీపాలు ఏర్పాటు చేయాలి. విద్యుత్తు సదుపాయానికి రూ.7 కోట్లతో ఉపకేంద్రం నిర్మించారు. తాగునీటి వసతి లేదు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ నుంచి రోజూ 2 లక్షల లీటర్లు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. రూ.14 కోట్ల వ్యయంతో పథకం ఏర్పాటు చేస్తామని గత తెదేపా ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి, కొత్తగా మంగళగిరికి రూ.98 కోట్లతో నిర్మించే నీటి పథకం నుంచి తాగునీరు ఇవ్వాలని నిర్ణయించింది. కొండల మధ్యలో ఉన్న ఎయిమ్స్‌కి డ్రైనేజీ వసతి ఏర్పాటు చేయాల్సి ఉంది.

60% తక్కువ ధరకే

ఎయిమ్స్‌లో అత్యాధునిక ల్యాబోరేటరీ సదుపాయం ఉంది. అన్ని రకాల పరీక్షలకు బయట ల్యాబ్‌ల కంటే 54-60 శాతం తక్కువ ధరకే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్‌, మమోగ్రఫీ ఇక్కడ ఉన్నాయి. తక్కవ ధరలకు మందులు అందజేయడానికి ఫార్మసీ ఏర్పాటు చేశారు.

త్వరలో 960 పడకలు

ఇన్‌ పేషెంట్లకు 100 పడకలు ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో 960 పడకలతో ఇన్‌ పేషెంట్ల వార్డులు రానున్నాయి. సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులో వచ్చాయి. వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. ఓపీడీ సేవలు విస్తృతం చేశాం. రోగులకు వీలైనన్ని వైద్య సేవలు అందజేస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి రోగులు వస్తున్నారు. అధునాతన వైద్యం అందించడమే మా లక్ష్యం.  -డాక్టర్‌ రాజేశ్‌ కక్కర్‌, సూపరింటెండెంట్‌, ఎయిమ్స్‌

అన్ని రకాల వైద్య పరీక్షలు

ఈ ఆసుపత్రిలో వైద్యులు చాలా బాగా చూస్తున్నారు. రూ.10లు రుసుం చెల్లిస్తే చాలు అన్ని రకాల వ్యాధులకు వైద్య సేవలందుతున్నాయి. తక్కువ ఖర్చుతో రక్త, ఇతర పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌రే సదుపాయం ఉంది. పేద రోగులకు చాలా ప్రయోజనం.n -ఎ.రామకృష్ణ, దాచేపల్లి

వైద్య సేవలు ఇలా..

జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, పిల్లల వైద్యం, ఈఎన్‌టీ, ఎముకలు, గైనకాలజీ, కమ్యూనిటీ ఫ్యామిలీ మెడిసిన్‌, దంత, నేత్ర, చర్మ వ్యాధులు, మానసిక రోగాలకు చికిత్స అందిస్తున్నారు. వీటితో పాటు సమగ్ర రొమ్ము సంక్షేమ క్లినిక్‌, డైట్‌ అండ్‌ న్యూట్రిషియన్‌ కౌన్సెలింగ్‌, అనస్తీషియా, ఈసీజీ, నొప్పి నియంత్రణ, ఫిజికల్‌ మెడికల్‌ అండ్‌ రీ హాబిలిటేషన్‌ విభాగాలు పని చేస్తున్నాయి.

ఆస్పత్రి పరిశుభ్రంగా ఉంది

పేద రోగులకు తక్కువ వ్యయంతో మెరుగైన వైద్యం లభిస్తోంది. రక్త, చక్కెరతో పాటు వివిధ వైద్య పరీక్షలు నామమాత్రం రుసుంతో చేస్తున్నారు. ఆసుపత్రి శుభ్రంగా ఉంది. ఇక్కడికి వస్తే మనసు తేలిక పడుతోంది. ఉదయాన్నే చక్కెర వ్యాధి పరీక్షకు వచ్చా, చాలా బాగా చేశారు. -వేజెండ్ల నాగమణి, మంగళగిరి

వైద్యం బాగా చేస్తున్నారు

దగ్గు జలుబుతో బాధపడుతుంటే చికిత్స కోసం వచ్చాను. వైద్యులు బాగా చూస్తున్నారు. కరోనా పరీక్షలు నిలిపేశామని చెప్పారు. దగ్గు, జలుబు ఉంది కాబట్టి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ఒకసారి కరోనా పరీక్ష చేయించుకోమన్నారు. వైద్యం బాగానే ఉంది-బి.పద్మావతి, నంబూరు

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని