logo

జగన్మోసకారి!

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ

Published : 29 Apr 2024 06:37 IST

మార్చి 6న బటన్‌ నొక్కి ప్రచార ఆర్భాటం
53 రోజులైనా పడని పెట్టుబడి రాయితీ
నేడు పొన్నూరుకు రానున్న సీఎం జగన్‌

2023 డిసెంబరు 8న

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ మిగ్‌జాం తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు బీమా, పెట్టుబడి రాయితీలు రావనే అపోహలు వద్దని, ప్రతి రైతును ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సంక్రాంతికి పెట్టుబడి రాయితీ జమ చేస్తామని, బీమా సొమ్ము వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నాటికి అందిస్తామని హామీ ఇచ్చారు.


జిల్లాలో రైతుల ఖాతాలకు సొమ్ము జమ చేస్తున్నట్లు ప్రకటించి విడుదల చేసిన మెగా చెక్కు

2024 మార్చి 6న

పెట్టుబడి రాయితీకి సంబంధించిన సొమ్ము విడుదల చేస్తున్నట్లు జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కారు. గతేడాది ఖరీఫ్‌ వర్షాభావం వల్ల నష్టపోయిన రైతులు, రబీ సీజన్‌ ప్రారంభంలో మిగ్‌జాం తుపాను వల్ల జరిగిన నష్టానికి పెట్టుబడి రాయితీ విడుదల చేస్తున్నామని ప్రకటించారు. రైతులకు ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారికి అందాల్సిన సాయం సమయానికి ఇచ్చే నమ్మకాన్ని కలిగించామని ప్రగల్భాలు పలికారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ఈ రోజు విడుదల చేస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించారు.

ఖాతాలకు జమ ఎప్పుడో..

జిల్లాలో 52,863 మంది రైతులకు రూ.61.73కోట్ల సొమ్ము జమ చేస్తున్నట్లు మార్చి 6న బటన్‌ నొక్కారు. రైతుల ఖాతాలందరికీ వెంటనే సొమ్ము జమవుతుందని చెప్పారు. ఏప్రిల్‌ 28 వచ్చినా ఒక్క రైతు ఖాతాకు సొమ్ము జమకాలేదు. ఇదేనా రైతుల పక్షపాత ప్రభుత్వమంటే జగనన్నా అని అన్నదాతలు నిలదీస్తున్నారు. సోమవారం సీఎం జగన్‌ పొన్నూరుకు ఎన్నికల ప్రచారానికి వస్తున్న నేపథ్యంలో పెట్టుబడి రాయితీ ఇవ్వకుండా చెప్పిన మాట నిలబెట్టుకోకుండా మరోసారి మోసం చేయడానికి వస్తున్నారా? అని రైతులు మండిపడుతున్నారు.

కర్షకులకు కోలుకోలేని నష్టం

కృష్ణా పశ్చిమ డెల్టాలో వరి పంట కోతల దశలో వచ్చిన మిగ్‌జాం తుపాను జిల్లాలో అపారనష్టం మిగిల్చింది. డిసెంబరు నెల ప్రారంభంలో తుపాను ప్రభావంతో వచ్చిన భారీ వర్షాల వల్ల చేతికొచ్చిన పంటలు ఇంటికొచ్చే వేళ రైతులు పూర్తిగా నష్టపోయారు. వర్షాలకు దెబ్బతిన్న పంట నూర్పిడి చేసుకోవడానికి అదనంగా ఖర్చు వెచ్చించాల్సి వచ్చింది. మురుగు నీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో కృష్ణా పశ్చిమ డెల్టాలో పంటలు వరదపాలై కర్షకులు సర్వం కోల్పోయారు. ఈ క్రమంలో బాపట్ల జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌ రైతుల దుస్థితిని చూసి సంక్రాంతి నాటికి పెట్టుబడి రాయితీ అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ తరువాత బటన్‌ నొక్కినా డబ్బులు పడలేదు.

డెల్టా రైతుకు దక్కని ఊరట

మిగ్‌జాం తుపాను వ్యవసాయ, ఉద్యాన, వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం కలగజేసింది. తీతకు వచ్చిన పత్తి తడిసిపోయి పనికిరాకుండా పోయింది. పూత, కాయలతో ఉన్న మిర్చి పంటలో కాయలు రాలిపోయి నష్టం వాటిల్లింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలవాలి, నీటమునిగి సర్వం వర్షార్పణమైంది. నీట మునిగిన పంట ఆరిన తర్వాత కోత ఖర్చు తడిసిమోపెడైంది. కొందరు రైతులకు కోత ఖర్చులు కూడా రావని భావించి పంటను నీటిలో తొక్కించేశారు. ఉద్యాన పంటలకు కోలుకోలేని నష్టం జరిగింది. ఈదురుగాలులు, భారీ వర్షంతో ఉద్యాన పంటలు నేలకొరిగి కాయలు రాలిపోయి, చెట్లు పడిపోయి తీరని నష్టం వాటిల్లింది.

అప్పులు తీర్చడానికి

అష్టకష్టాలుతుపాను మిగిల్చిన నష్టం నుంచి కోలుకోవడానికి సాగుదారులకు చాలా రోజులు పట్టింది. అప్పుడు చేసిన అప్పులు తీర్చడానికి రైతులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. పెట్టుబడి రాయితీ సకాలంలో వస్తే ఎంతో కొంత ఊరట లభిస్తుందని భావించారు. ఆలస్యంగానైనా మార్చిలో బటన్‌ నొక్కితే సొమ్ములు వస్తాయని ఆశపడ్డారు. ఇప్పటికీ సొమ్ము జమకాకపోవడంతో బటన్‌ నొక్కి రైతులను మోసం చేశారని మండిపడుతున్నారు. జిల్లాలో వ్యవసాయ పంటలకు రూ.47.28కోట్లు, ఉద్యాన పంటలకు రూ.14.44కోట్లు పెట్టుబడి రాయితీ రావాల్సి ఉంది. సోమవారం పొన్నూరు వస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని పెట్టుబడి రాయితీ ఎప్పుడిస్తారంటూ నిలదీయడానికి రైతులు సిద్ధమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని