logo
Published : 29/11/2021 06:39 IST

వరద గాయానికి.. వర్షం పోటు!

రక్షణ ఇవ్వని గుడారాలు

చలి గాలులు, దోమల విజృంభణ 

జ్వరంతో బాధపడుతున్న ఈ బాలుడు గొడుగు నీడలో సేద తీరుతున్నాడిలా..

కడప, న్యూస్‌టుడే: భారీ వర్షాలకు పింఛ, అన్నమయ్య జలాశయాల మట్టి కట్టలు ఈ నెల 19న తెగిపోయాయి. దీంతో చెయ్యేరులో వరద పోటెత్తింది. ఫలితంగా బాహుదా నది ఒడ్డున ఉన్న పులపుత్తూరు గ్రామాన్ని ముంచేసింది. పదుల సంఖ్యల్లో పేదలు, బడుగుజీవుల పక్కాగృహాలు నేలమట్టమయ్యాయి. బాధితులకు నిలువ నీడ లేదు. అధికారులు, దాతలు స్పందించి టార్పాలిన్‌ పట్టలు పంపిణీ చేశారు. బాధితులు కొయ్యలను నాటి పట్టలతో గూడారాలు ఏర్పాటు చేసుకున్నారు. మళ్లీ వరుణుడి ప్రతాపంతో వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. కురుస్తున్న వర్షాలకు వారిలో వణుకు మొదలైంది. ఎవర్ని కదిపినా దేవుడా మాకెందుకీ విషమ పరీక్ష అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. 
రాజంపేట మండలం పులపుత్తూరులో పేదలే ఎక్కువ. పునరావాస ఏర్పాట్లు వేగంగా సాగటంలేదు. ఇదే బాధితుల పాలిట శాపంగా మారింది. బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకొచ్చారు. నిత్యావసరాలు, వస్త్రాలు, వస్తువులు, సామగ్రి, గృహోపకరణాలు ఉచితంగా సమకూర్చారు. వాటిని దాచుకునేందుకు సరైన స్థలం కూడా బాధితులకు లేదు. వర్షాలు, చలి, దోమల విజృంభణతో కంటిమీద కునుకు కరవై అనారోగ్యం పాలవుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు, కడుపునొప్పి, విరేచనాలు, వాంతులతో ఇబ్బందులు పడుతున్నారు. 
పునరావాసం ఏర్పాట్లు వేగవంతం
చెయ్యేరు నది వరద ప్రవాహంతో రాజంపేట మండలం పులపుత్తూరుతోపాటు మరికొన్ని గ్రామాల్లో పేదల పక్కాగృహాలు దెబ్బతిన్నాయి. పునరావాసం వసతికి అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు పనులు వేగవంతం చేశాం. ఇప్పటికే తాత్కాలికంగా నివాసం ఏర్పాటు చేసేందుకు టార్పాలిన్‌ పట్టలు అందజేశాం. గూడు వసతి లేని వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా ప్రమాద రహిత పందిరి (జర్మనీ షెడ్డు) వేయించాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన పన్లేదు. పూర్తి స్థాయిలో వసతులు కల్పిస్తున్నాం. 
- ఎం.గౌతమి, సంయుక్త కలెక్టరు (రెవెన్యూ), కడప 
రైల్వేకోడూరులో అత్యధిక వర్షం
కడప విద్య, న్యూస్‌టుడే : జిల్లావ్యాప్తంగా ఆదివారం విస్తారంగా వర్షం కురిసింది. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా... రైల్వేకోడూరులో అత్యధికంగా 86.8 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. అట్లూరు 83.4, ఒంటిమిట్ట 79.4, పెనగలూరు 69.4, చిట్వేలి 66.2, సిద్దవటం 65, చెన్నూరు 64, నందలూరు 57.4, పుల్లంపేట 55.4, కడప 53.6, రాజంపేట 51.4, వీరబల్లి 51.2, కమలాపురం 45.4, చింతకొమ్మదిన్నె 42.4, ఓబులవారిపల్లెలో 42 మి.మీ. వర్షపాతం నమోదయింది. 

ఊటుకూరు చెరువు అలుగు నీరు సవ్యంగా వెళ్లేలా చేయిస్తున్న పనులు

కష్టంగా ఉంది

​​​​​​​
గుడారాల్లో జీవనం సాగించాలంటే చాలా కష్టంగా ఉంది. నీడ కరవు కావడంతో ఎలా బతకాలని ఆందోళనగా ఉంది. గతంలో ఉన్నంతలో బాగా బతికాం. ఇప్పుడేమో మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. తలుచుకుంటేనే కన్నీళ్లు ఆగడం లేదు. 
- పల్లం కేశవులు, పులపుత్తూరు
జాగారం చేస్తున్నాం


వరద కోలుకోలేని దెబ్బతీసింది. ఎల్లవ రావడంతో ఇల్లు లేకుండాపోయింది. పట్ట ఏర్పాటు చేసుకుని తలదాచుకుంటున్నాం. రాత్రిపూట భయంగా గడుపుతున్నాం. రాత్రంతా జాగారం చేస్తున్నాం. విష పురుగులు వస్తున్నాయి. నిద్ర పట్టడం లేదు. దోమల కాటుతో కునుకు పట్టడం లేదు. మైనపు ఒత్తుల వెలుతురులో కాలం గడుపుతున్నాం. - తిప్పన లక్షుమ్మ, పులపుత్తూరు
చలితో వణికిపోతున్నాం


చీకటి పడితే చాలు దోమలు రయ్‌మంటూ దూసుకొస్తున్నాయి. వాన పడటంతో మరోవైపు ఈదురగాలి వణికిపోయేలా చేస్తోంది. చలికి తట్టులేకపోతున్నాం. రాత్రివేళ నిద్రపట్టడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మా అవస్థలపై అధికారులు దృష్టి సారించి న్యాయం చేయాలి. - అవసాని తిరుపాల్, పులపుత్తూరు
ఉండలేకపోతున్నాం


గుడారాల్లో నివాసం ఉండలేకపోతున్నాం. చిన్నపాటి పట్టతో స్థావరం ఏర్పాటు చేసుకున్నాం. వాన కురుస్తోంది. ఉండాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. చీకటి పడగానే దోమలు, చిన్నపాటి ఈగలు వస్తున్నాయి. ఇక్కడ ఉండాలంటే ఇబ్బందిగా ఉంది. గత్యంతరం లేక ఉండాల్సి వస్తోంది. - సిగమాల వెంకటసుబ్బమ్మ, పులపుత్తూరు

ఇక్కడ గుడారంలో నీరు చేరినట్లు చూపుతున్న అతివ పేరు సద్దల చంద్రకళ. వారం రోజుల క్రితం ఊర్లోకి వరద రావడంతో ఇల్లు కూలిపోయింది. తాత్కాలిక జీవనం కోసం గుడారం వేసుకున్నారు. ప్రస్తుతం వర్షాలకు నీరు రావడంతో ఉండటానికి ఇబ్బంది పడుతున్నారు. రాత్రిపూట గ్రామ సచివాలయంలో నిద్రిస్తున్నాం. పగలు మా గుడిసెలోకి వస్తున్నాం. వాన కురవడంతో చాలా కష్టంగా ఉందని ఆమె ఆవేదన చెందుతున్నారు.

గుడారం కింద గొడుగు పట్టుకుని  కూర్చున్న దంపతులు చిలంకూరు చిన్నక్క, వెంకటయ్య. వీరు శ్రమించి కట్టుకున్న ఇల్లు నీటిలో కలిసిపోయింది. ప్రస్తుతం నిలువ నీడ లేదు. దుర్భర జీవనం గడుపుతున్నారు. వానకు నానా తంటాలు పడుతున్నారు. పగలు తాత్కాలిక స్థావరంలో ఉంటున్నారు. రాత్రిపూట తెలిసిన వారి ఇంటికెళ్లి నిద్రపోతున్నారు. తెల్లారిన వెంటనే మళ్లీ ఈ చిన్నపాటి గూడు చెంత వద్దకు పరుగు తీస్తున్నారు. దాతలు ఇచ్చిన వస్తువులను బంధువుల ఇంట్లో దాచి ఉంచుకున్నామని వీరు కంట తడి పెట్టారు. 

నా పేరు కుంబగిరి కృష్ణవేణి. వరద మా బతుకుల్ని నాశనం చేసింది. జల ప్రవాహంలో ఆశల గూడు కలిసిపోయింది. తాత్కాలికంగా గూడారం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నాం. వాతావరణం మార్పులతో వాన కురుస్తోంది. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. చంటిబిడ్డలతో అవస్థలు పడుతున్నాం. దాతలు ఇచ్చిన వస్త్రాలు, సరకులు, సామగ్రి తడిసిపోయాయి. పిల్లలిద్దరూ జ్వరాలతో బాధపడుతున్నారు. మా కష్టాలు దేవుడికెరుక.  

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని