logo

ఎల్లంపల్లిలో తగ్గిన నీటి మట్టం

ఎల్లంపల్లి శ్రీపాదసాగర్‌ నీటిమట్టం పడిపోయింది. డెడ్‌ స్టోరేజీకి చేరువైంది. రానున్న కాలంలో తాగునీటికి ముప్పు పొంచి ఉంది. ఇన్‌ఫ్లో పెద్దగా లేకపోగా ప్రతిరోజు తాగునీటితో పాటు ఎన్టీపీసీకి నీటిని సరఫరా చేయాల్సి ఉండటంతో ఉన్న నిల్వ కొద్ది రోజుల్లోనే ఆవిరయ్యే అవకాశం ఉంది.

Published : 19 May 2024 03:26 IST

డెడ్‌ స్టోరేజీకి చేరువలో జలాశయం

 ఎల్లంపల్లి బ్యారేజీ వద్ద తగ్గిన నీటి మట్టం 

న్యూస్‌టుడే, గోదావరిఖని: ఎల్లంపల్లి శ్రీపాదసాగర్‌ నీటిమట్టం పడిపోయింది. డెడ్‌ స్టోరేజీకి చేరువైంది. రానున్న కాలంలో తాగునీటికి ముప్పు పొంచి ఉంది. ఇన్‌ఫ్లో పెద్దగా లేకపోగా ప్రతిరోజు తాగునీటితో పాటు ఎన్టీపీసీకి నీటిని సరఫరా చేయాల్సి ఉండటంతో ఉన్న నిల్వ కొద్ది రోజుల్లోనే ఆవిరయ్యే అవకాశం ఉంది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి శ్రీపాదసాగర్‌లో ప్రస్తుతం నీటి మట్టం 5.6 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.178 టీఎంసీలు కాగా ఇక్కడి నుంచే మిషన్‌ భగీరథతో పాటు హైదరాబాద్‌ మెట్రో నగరాలకు తాగునీరు సరఫరా చేయాలి. ప్రస్తుతం ఉన్న 5.6 టీఎంసీల నీటిలోంచి మరో 2.3 టీఎంసీల నీటిని సరఫరా చేస్తే పూర్తిస్థాయిలో డెడ్‌ స్టోరేజీకి చేరుకుంటుంది. అంటే 3.3 టీఎంసీలకు చేరుకుంటే డెడ్‌ స్టోరేజీ కిందకు వస్తుంది. దీంతో పంపు మోటార్లతో నీటిని సేకరించే అవకాశం లేకుండా పోతుంది.

తాగునీటికి ముప్పు

ప్రస్తుతం ఉన్న నీరు పూర్తిగా డెడ్‌ స్టోరేజీకి చేరితే తాగునీటికి రానున్న రోజుల్లో ముప్పు పొంచి ఉంది. ఇక్కడి నుంచి రోజుకు ఎన్టీపీసీకి 69 క్యూసెక్కులు, హైదరాబాద్‌ మెట్రో వాటర్‌కు 331 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథకు 23 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తారు. ప్రతిరోజు తాగునీరు, విద్యుత్తు ఉత్పత్తికి ఇక్కడి నుంచే నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. ఎండ తీవ్రత దృష్ట్యా రోజుకు 159 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ ఎన్ని రోజులకు సరిపోతుందో అధికారులు అంచనా వేస్తున్నారు.

అడుగంటుతున్న భూగర్భ జలాలు

ఎల్లంపల్లిలో పూర్తిస్థాయిలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో భూగర్భ జలాలు కూడా పడిపోతున్నాయి. పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఉన్న సమయంలో భూగర్భ నీటి మట్టం పైపైనే ఉండేది. ప్రస్తుతం నీటి నిల్వ తగ్గిపోవడంతో పాటు సుందిళ్ల బ్యారేజీ వద్ద కూడా నీరు లేకపోవడంతో బావులు, బోర్లలో నీటి మట్టం పడిపోయింది. సాధారణ స్థాయి కంటే భూగర్భ నీటి మట్టం పడిపోవడంతో నీటి సమస్య మొదలైంది. ముందస్తుగా వర్షాలు కురిస్తే తప్ప నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని