logo

సిద్ధు మనుగడకే సవాల్‌

తమిళనాడు, కేరళ సరిహద్దుల్లో విస్తరించిన చామరాజనగర (ఎస్‌సీ) లోక్‌సభ నియోజకవర్గం అన్ని పార్టీలకూ ప్రతిష్ఠాత్మకంగా మారింది.

Published : 14 Apr 2024 01:35 IST

చామరాజనగరలో హోరాహోరీ

సునీల్‌బోస్‌ (కాంగ్రెస్‌) , బాలరాజ్‌ (భాజపా)

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : తమిళనాడు, కేరళ సరిహద్దుల్లో విస్తరించిన చామరాజనగర (ఎస్‌సీ) లోక్‌సభ నియోజకవర్గం అన్ని పార్టీలకూ ప్రతిష్ఠాత్మకంగా మారింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ విధానసభ సెగ్మెంట్‌ దీని పరిధిలోకే వస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం ఆయనకు ఓ సవాల్‌గా పరిణమించింది. తొలి నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ వరుణ సెగ్మెంట్లో గత ఎన్నికలకన్నా ఎక్కువ మెజార్టీ ఓట్లు వస్తే తన సీటు భద్రమనే రీతిలో ఆయన చేసిన వ్యాఖ్యానాలు రాజకీయరంగంలో దూమరాన్ని సృష్టించాయి. మంత్రి డాక్టర్‌ మహదేవప్ప కుమారుడు సునీల్‌బోస్‌ ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి. భాజపా అభ్యర్థిగా బాలరాజ్‌ పోటీలో ఉన్నారు. సునీల్‌బోస్‌ కోసం మంత్రి డాక్టర్‌ మహదేవప్ప పావులు కదుపుతున్నారు. మొన్నటి వరకు బద్ధశత్రువులుగా ఉన్న భాజపా సిట్టింగ్‌ ఎంపీ శ్రీనివాస్‌ప్రసాద్‌ ఇంటికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా వెళ్లి ఆరోగ్య యోగక్షేమాలను విచారించి కాంగ్రెస్‌ అభ్యర్థ్థి సునీల్‌బోస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఒకప్పుడు నరహంతకుడు వీరప్పన్‌ తిరగాడిన ప్రదేశమే చామరాజనగర జిల్లా. ఇక్కడ దళిత, లింగాయత, కురుబ వర్గాలకు చెందిన ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. 1952లో ఎన్‌.రాచయ్య, 1957 నుంచి 1977 వరకు ఎస్‌ఎం సిద్ధయ్య, 1977లో బి.రాచయ్య,. 1980, 1984, 1989, 1991, 1999, 2019లో శ్రీనివాస్‌ప్రసాద్‌ విజయాలు నమోదు చేశారు. మధ్యలో.. 2009, 2014లో ధ్రువనారాయణ (కాంగ్రెస్‌) లోక్‌సభ సభ్యులుగా కొనసాగారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 179 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి ధ్రువనారాయణ గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్‌- భాజపా మధ్య పోటీ పతాక స్థాయిలో కొనసాగుతోంది.

చాముండేశ్వరి దేవి దేవస్థానం

విధానసభ నియోజకవర్గాలు : హెచ్‌.డి.కోట, నంజునగూడు, వరుణ, టి.నరసిపుర, హానూరు, కొళ్లేగాల, చామరాజనగర, గుండ్లుపేట.
ఓటర్లు : 16,67,044 మంది, పురుషులు - 8,32,382 మంది, మహిళలు- 8,32,541 మంది, ఇతరులు 111 మంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని