logo

నకిలీ పత్రాలతో నిలువుదోపిడీ

ఒకే ఇంటి స్థలానికి లెక్కలేనన్ని నకిలీ పత్రాలు సిద్ధం చేసి వాటిని 22 బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.10 కోట్లకు పైగా రుణాన్ని తీసుకున్న ఆరుగురు వంచకులను బెంగళూరు జయనగర ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

Published : 20 Apr 2024 04:07 IST

జప్తు చేసుకున్న నగదు పరిశీలిస్తున్న పోలీస్‌ కమిషనర్‌ దయానంద్‌

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : ఒకే ఇంటి స్థలానికి లెక్కలేనన్ని నకిలీ పత్రాలు సిద్ధం చేసి వాటిని 22 బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.10 కోట్లకు పైగా రుణాన్ని తీసుకున్న ఆరుగురు వంచకులను బెంగళూరు జయనగర ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. వంట పనిచేసే నాగేశ్‌ భరద్వాజ్‌, అతని భార్య సుమ, ఆమె అక్క వేద, బావ శేషగిరి, తమ్ముడు సతీశ్‌, వారి స్నేహితురాలు వేదవతిని నిందితులుగా గుర్తించారు. వీరికి రుణం మంజూరు చేసిన బ్యాంకు సిబ్బంది, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల సిబ్బందిని విచారిస్తామని నగర పోలీసు కమిషనర్‌ బి.దయానంద్‌ తెలిపారు. తీసుకున్న రుణంతో ఒక ఇంటి స్థలం, ఇంటినీ కొనుగోలు చేసుకున్నారని గుర్తించామని చెప్పారు. వీరి నివాసాల నుంచి కొంత నగదు జప్తు చేసుకున్నారు. యంత్రోపకరణాల కొనుగోలుకు రూ.1.3 కోట్ల రుణం తీసుకుని, దాన్ని చెల్లించకుండా మరోసారి రుణం తీసుకునేందుకు జయనగర మూడో బ్లాక్‌లోని ఒక కోఆపరేటివ్‌ బ్యాంకును వీరు సంప్రదించారు. అక్కడి అధికారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో వీరి వంచనలు వెలుగులోకి వచ్చాయని దయానంద్‌ తెలిపారు. వీరిని న్యాయమూర్తి ముందు హాజరుపరచి.. న్యాయనిర్బంధానికి పంపించామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని