logo

నంజుండి చేతికి కాంగ్రెస్‌ పతాకం

విధానపరిషత్‌ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్‌సింగ్‌ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ పతాకాన్ని అందుకున్నారు.

Published : 25 Apr 2024 01:35 IST

కాంగ్రెస్‌ పతాకం అందుకున్న మాజీ ఎమ్మెల్సీ నంజుండి తదితరులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : విధానపరిషత్‌ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్‌సింగ్‌ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ పతాకాన్ని అందుకున్నారు. ఈసందర్భంగా సుర్జేవాల మాట్లాడుతూ రాజ్యాంగానికి ముప్పు ఎదురవుతున్న సమయంలో అందరూ ఒకటిగా పోరాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పిలుపునిచ్చారు. దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల రిజర్వేషన్‌ సౌకర్యాన్ని ఒక పథకం ప్రకారం నాశనం చేసేందుకు భాజపా నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చుతామని వారు బహిరంగంగానే ప్రకటిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో బడుగు వర్గాలకు చెందిన అధికారులకు ఉన్నతాసనాలు కరవయ్యాయని, ఇలాంటి పరిస్థితుల్లో అట్టడుగు వర్గాల అభ్యున్నతి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కేంద్రంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అందులో ఎనిమిది లక్షల ఉద్యోగాలు వెనకబడిన వర్గాలకు చెందాలని విశ్లేషించారు. ఈసారి కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో చేరిన నంజుండి మాట్లాడుతూ భాజపాలో నన్ను నిర్లక్ష్యం చేశారని, బడుగులు తరఫున పోరాటాలకు విలువ లేకుండా పోయిందని వాపోయారు. ఆ పార్టీలో ఇక ఇమడలేననే రాజీనామా చేయాలని రెండేళ్ల నుంచి అనుకున్నా.. ఇప్పుడు ఆ పని చేయక తప్పలేదన్నారు. కార్యక్రమంలో బెంగళూరు దక్షిణ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి సౌమ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు