logo

భూసార పరీక్షలు కొందరికే

ఇష్టారీతి రసాయనిక ఎరువుల వినియోగంతో సాగు భూమి సారం కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. పంట భూమిలో నత్రజని, భాస్వరం, సేంద్రియ కర్బనాల్లాంటి పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో భూసార పరీక్షల ద్వారా తెలుసుకుని

Published : 20 May 2024 06:02 IST

దుమ్ముగూడెం మండలం అర్లగూడెంలో సేకరిస్తున్న మట్టి నమూనా 

టేకులపల్లి, న్యూస్‌టుడే: ఇష్టారీతి రసాయనిక ఎరువుల వినియోగంతో సాగు భూమి సారం కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. పంట భూమిలో నత్రజని, భాస్వరం, సేంద్రియ కర్బనాల్లాంటి పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో భూసార పరీక్షల ద్వారా తెలుసుకుని వాటికి తగ్గట్టు మొక్కలకు ఎరువులను అందిస్తే అధిక దిగుబడులు సాధించొచ్చు. పెట్టుబడి వ్యయమూ తగ్గుతుంది. ఉభయ జిల్లాల్లో మూడేళ్లుగా భూసార పరీక్షల ఊసేలేదు. ఈ ఏడాది కేవలం కొన్ని మండలాల్లో మాత్రమే నిర్దిష్ట నమూనాలు సేకరిస్తున్నారు. 

ఎందుకిలా?

కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మిషన్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ అగ్రికల్చర్‌ పథకం ద్వారా 2016లో మట్టి నమూనాల సేకరణకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించింది. నాలుగేళ్లపాటు సాగిన ఈ పథకం 2021 నుంచి అటకెక్కింది. తాము ఉద్దేశించిన లక్ష్యాలు పూర్తి కావడంతో కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదల నిలిపివేసినట్టు అధికారులు చెబుతున్నారు. భూసార పరీక్ష కేంద్రాలకు నిధులు విడుదల కాకపోవటంతో వాటిల్లోని రసాయనాలు, పరికరాలు అటకెక్కాయి. రసాయనాల గడువు ముగియడంతో మట్టి నమూన పరీక్షల ఊసే లేకుండా పోయింది. 

ఎంపికైన మండలాల్లోనే..

కేంద్ర సహకారం ఆగిపోవటంతో రాష్ట్ర ప్రభుత్వమే ఈ వానాకాలం భూసార పరీక్షలకు నిధులు మంజూరు చేసింది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీల నుంచి ఉభయ జిల్లాల్లోని ప్రధాన ల్యాబ్‌లకు రూ.7.2 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. గతంలో రైతుల వారీగా కాకుండా మండలంలో నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో పది ఎకరాలకు ఒక నమూన, వర్షాధారిత ప్రాంతాల్లో 25 ఎకరాలకు ఒకటి చొప్పున సేకరించి పరీక్షలకు పంపించేవారు. ఈసారి ఎంపికైన మండలాల్లో కొద్దిమంది రైతుల భూముల నుంచే నమూనాలు సేకరిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో ఇప్పటికే ఏఈఓలు మట్టి నమూనాలను సేకరించే పనిలో ఉండగా ఖమ్మం జిల్లాలో ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. 


త్వరలో అన్ని ప్రాంతాల్లో

బాబురావు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి, భద్రాద్రి 

భద్రాద్రి జిల్లాల్లో గుండాల, దుమ్ముగూడెంలో మరో 400 నమూనాలు సేకరించాలి. సేకరించిన వాటి ఫలితాలు వారంలో వెల్లడిస్తాం. ఎన్నికల కోడ్‌ ముగిసిన అనంతరం ప్రభుత్వ సూచనల మేరకు అన్ని మండలాల్లో నమూనాలు సేకరించే అవకాశం ఉంది. కార్యరూపు దాలిస్తే ప్రతి క్లస్టర్‌లోని ఏఈఓలకు కిట్లు పంపిణీ చేసి అక్కడే పరీక్షలు పూర్తి చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని