logo

సెలవులొచ్చాయ్‌.. ప్రణాళికలు ఖరారయ్యాయ్‌!

ఈవిద్యా సంవత్సరం నేడు (మంగళవారం) ముగియనుంది. పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. ఈనేపథ్యంలో ప్రభుత్వ బడుల బలోపేతంపై దృష్టి సారించింది.

Updated : 23 Apr 2024 05:33 IST

నేటితో ముగియనున్న విద్యా సంవత్సరం
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే

ఈవిద్యా సంవత్సరం నేడు (మంగళవారం) ముగియనుంది. పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. ఈనేపథ్యంలో ప్రభుత్వ బడుల బలోపేతంపై దృష్టి సారించింది. రాబోయే విద్యాసంవత్సరంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా  కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. చివరి పనిదినం మొదలు పాఠశాలల పునఃప్రారంభం నాటికి పూర్తిచేయాల్సిన పనులపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ దిశానిర్దేశం చేసింది. వారు చేయాల్సిన పనుల గురించి వివరించింది.

డ్రాపౌట్‌ లేకుండా..

ప్రాథమిక పాఠశాలల్లో ఐదోతరగతి, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏడోతరగతి  ఉత్తీర్ణులైన విద్యార్థులు నూరు శాతం  పైతరగతుల్లో చేరేలా ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది విద్యార్థులు పైతరగతుల్లో చేరకుండా డ్రాపౌట్‌గా మారుతున్నారు. ఈనేపథ్యంలో అందరు విద్యార్థులు బడిలో తిరిగి చేరేలా కృషి చేయాలని సంబంధిత హెచ్‌ఎంలకు ప్రభుత్వం సూచించింది.

బియ్యం పాడవకుండా..

పాఠశాల చివరి పనిదినం తర్వాత మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యం నిల్వలు ఉంటాయి. క్వింటాళ్ల కొద్దీ బియ్యం పాడవకుండా, ఎలుకలు తినకుండా ప్రత్యేక చర్యలు   తీసుకోవాలని సూచించింది.

పనుల పరిశీలనకు...

ప్రస్తుతం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. వేసవి సెలవుల్లో ప్రతి పాఠశాలలో ఈ పనులు చూసుకునేందుకు ప్రధానోపాధ్యాయులు లేదా ఎవరైనా ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాలి.

మధిర మండలం వంగవీడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మార్కుల పత్రాలతో విద్యార్థులు

సమ దుస్తుల కొలతలు...

జూన్‌లో పాఠశాలల పునఃప్రారంభం నాటికి విద్యార్థులకు సమ దుస్తులు    అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వేసవి సెలవుల దృష్ట్యా విద్యార్థులు అందుబాటులో ఉండరు. కాబటి ఇప్పుడే వారి దుస్తులకు సంబంధించిన కొలతలను తీసుకుంటారు.

సకాలంలో పాఠ్య పుస్తకాలు

పాఠ్య పుస్తకాల సరఫరాలో ఏటా కొంత జాప్యం జరుగుతోంది. ఈసారి దీన్ని  నివారించేందుకు ముందస్తు ప్రణాళిక రూపొందించారు. వేసవి సెలవుల్లోనే పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్‌, నోట్‌ పుస్తకాలను జిల్లాలోని పాఠ్యపుస్తకాల గోదాముకు తెప్పించాలని భావిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు ముద్రణ పూర్తయ్యింది.

నేడు ఫలితాల ప్రకటన

తల్లిదండ్రులు, విద్యార్థులతో ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం ఆన్‌లైన్‌ ప్రగతి పత్రాలు అందజేస్తారు. ఏడాది పాటు విద్యార్థి ప్రగతిపై      చర్చిస్తారు. తరగతుల వారీగా ఉత్తీర్ణులైన వివరాల జాబితాను విడుదల చేస్తారు

ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగింత

పాఠశాలల చివరి పని దినం రోజు, వేసవి   సెలవుల్లోనూ చేయాల్సిన పనుల గురించి సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు బాధ్యతలు  అప్పగించాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీరు ఈ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల శాతం పెంచేందుకు ప్రతి ఒక్కరూ  కృషి చేయాలి. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన    విషయంలోనూ శ్రద్ధ కనబరచాలి.

జిల్లాల వారీగా  విద్యార్థుల సంఖ్య (సుమారుగా)

భద్రాద్రి: 60,000 
ఖమ్మం: 68,000

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని