logo

బాక్సింగ్‌ కింగ్‌లు.. ఆదోని కుర్రాళ్లు

ఆ కుర్రాళ్లు కొట్టే దెబ్బలకు దవడలు అదిరిపోతాయి.. మెదడులోని నరాల్లో కదలికలు పుడతాయి.. రింగులోకి ప్రత్యర్థి రావాలంటేనే భయపడే పరిస్థితి.. పతకాలు మాత్రం వచ్చి వాలిపోతాయి.

Published : 19 May 2024 04:54 IST

జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ 
న్యూస్‌టుడే, ఆదోని క్రీడలు

ఆ కుర్రాళ్లు కొట్టే దెబ్బలకు దవడలు అదిరిపోతాయి.. మెదడులోని నరాల్లో కదలికలు పుడతాయి.. రింగులోకి ప్రత్యర్థి రావాలంటేనే భయపడే పరిస్థితి.. పతకాలు మాత్రం వచ్చి వాలిపోతాయి. ఆదోని పట్టణానికి చెందిన బాక్సింగ్‌ క్రీడాకారులు తమ ప్రత్యేకతను చాటుతున్నారు. కోచ్‌ కేశవ్‌ ఆధ్వర్యంలో బాక్సింగ్‌ క్రీడలో కఠిన సాధన చేస్తున్నారు.

గోవాలో జాతీయ స్థాయి బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌-2024 పోటీల్లో ప్రతిభ చాటిన ఆదోని బాక్సర్లు 

జాతీయ స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో ప్రత్యర్థులపై తమ పంచ్‌ పవర్‌ రుచి చూపించి పతకాల కైవసం చేసుకున్నారు. ఇటీవల గోవాలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌-2024 పోటీలో రాణించిన ఆదోని పట్టణానికి చెందిన బాక్సింగ్‌ క్రీడాకారుల గురించి తెలుసుకుందామా..


 విష్ణు విశ్వరూపం

ఆదోని పట్టణానికి చెందిన నాగరాజు దంపతుల కుమారుడు విష్ణువర్దన్‌ ఇంటర్మీడియేట్‌ చదువుతున్నాడు. రెండేళ్లుగా బాక్సింగ్‌ నేర్చుకుటున్నాడు. ముఖ్యంగా ఫేస్‌పంచ్, స్ట్రైట్‌ పంచ్, లోయర్‌ పంచ్‌ వంటి పంచ్‌లపై ప్రత్యేకంగా మెలకువలు నేర్చుకుంటున్నాడు. చురుకుదనంతో ప్రత్యర్థులపై తన పంచ్‌ల వర్షం కురిపిస్తూ.. అపజయాలు రుచిచూపిస్తున్నాడు. గోవాలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో అండర్‌-60 కేటగిరీ విభాగంలో బరిలో దిగి ప్రత్యర్థులను ఇంటిదారిపట్టించాడు. బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.


రఘు పంచ్‌తంత్రం

ఆదోని మండలం విరుపాపురం గ్రామానికి చెందిన రైతు రాజు, సుజాత దంపతుల కుమారుడు యు.రఘు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. బాక్సింగ్‌ క్రీడపై మక్కువతో ఆదోని పట్టణంలోని మాస్టర్‌ కేశవ్‌ వద్ద శిక్షణ పొందుతున్నాడు. చదువుతూనే మరో వైపు ఉదయం, సాయంత్రం బాక్సింగ్‌ క్రీడలో సాధన చేస్తూ పట్టు సాధిస్తున్నాడు. ప్రత్యర్థులపై పంచ్‌ల వర్షం కురిపిస్తాడు. పంచ్‌ తప్పించుకోవడంలో మెలకువలు నేర్చుకుంటున్నాడు. గోవాలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో అండర్‌-45 కేటగిరీలో పాల్గొని తన క్రాస్‌ పంచ్‌ పవర్‌తో ప్రత్యర్థిపై విజయం సాధించి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. బాగా చదవడంతో పాటు బాక్సింగ్‌లో రాణించాలని ఉందని చెబుతున్నాడు రఘు.


రింగ్‌లో శివతాండవం

ఆదోని పట్టణం విక్టోరియాపేటకు చెందిన మల్లికార్జున, పార్వతి దంపతుల కుమారుడు బి.శివకుమార్‌ బీఏ డిగ్రీ చదువుతున్నాడు. రెండేళ్లుగా బాక్సింగ్‌ సాధన చేస్తున్నాడు. రోజూ బాక్సింగ్‌లో సాధన చేస్తూనే పౌష్టికాహారం తీసుకుంటూ.. అవసరమైన వ్యాయామం చేస్తున్నాడు. గోవాలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో శివకుమార్‌ అండర్‌-80 విభాగంలో ప్రాతినిధ్యం వహించి ఫైనల్స్‌ వరకు దూసుకెళ్లి వెండి పతకం కైవసం చేసుకున్నాడు. బాక్సింగ్‌ క్రీడలో రాణించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నానంటున్నాడు క్రీడాకారుడు శివకుమార్‌.


విజయాల చిరునామా

ఆదోని పట్టణం మహాత్మాగాంధీనగర్‌కు చెందిన వీరేశ్, పార్వతి దంపతుల కుమారుడు కె.విజయ్‌ పదో తరగతి చదువుతున్నాడు. చదువుతో పాటు బాక్సింగ్‌ క్రీడలో రాణిస్తున్నాడు. కోచ్‌ కేశవ్‌ వద్ద గత ఏడాది నుంచి బాక్సింగ్‌లో సాధన చేస్తున్నాడు. ప్రత్యర్థులపై పంచ్‌ల వర్షం కురిపించడంతో పాటు ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలి.. శక్తి ఎలా కూడగట్టుకోవాలి.. అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాడు. గోవాలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో ఫైనల్‌ పోటీ వరకు వెళ్లి వెండి పతకం సాధించి సత్తా చాటాడు. జాతీయ స్థాయిలో రాణించాలని లక్ష్యమని చెబుతున్నాడు క్రీడాకారుడు విజయ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని